అంపశయ్యపై ఆయుష్
నెల్లూరు(అర్బన్) : భారతదేశ అతి ప్రాచీనమైన వైద్యవిధానాలతో రోగికి చికిత్సనందించి ఆరోగ్యవంతులను చేయడానికి ఉద్దేశించిన శాఖ ఆయుష్(ఆయుర్వేద, యోగ అండ్ నాచురోపతి, యునాని, సిద్ద అండ హోమియోపతి). అల్లోపతి ద్వారా నయంకాని దీర్ఘకాలిక నొప్పులు, తిమ్మిర్లు, అజీర్తి, వైరల్ ఇన్‌ఫెక్షన్లు నయమవుతుండటంతో సంప్రదాయ వైద్య విధానాలకు ఆదరణ పెరిగింది. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2002లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) పథకం ద్వారా పీహెచ్‌సీలకు అనుబంధంగా ఆయుష్ వైద్యశాలలను ఏర్పాటు చేసి నిధులు అందిస్తోంది. అయితే ఈ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆయుష్‌లోని ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరిగానే ఐదున్నరేళ్లు కష్టపడి ఆయుష్ పరీక్షలు కూడా పాసై వృత్తిలో చేరిన డాక్టర్లయినా, వారిని కూడా చిన్నచూపు చూస్తుండటంతో వారు ఆందోళన బాట పడుతున్నారు.
అన్నీ ఖాళీలే
జిల్లాలో 22 ఆయుర్వేద ఆస్పత్రులున్నాయి. వీటిలో 22 మంది డాక్టర్లుండాల్సి ఉండగా 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక వీరికి సహాయకులుగా ఉండాల్సిన అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 13 హోమి యో ఆసుపత్రిలున్నాయి. ఇందులో 13 మంది వైద్యు లకు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 యునాని పోస్టులకు 3 ఖాళీలే. అలాగే నేచురోపతి వైద్యంలో 3 పోస్టులుంటే ఒక్కటీ భర్తీ చేయలేదు. ఇవే కాక జిల్లాలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో 24 రెగ్యులర్ ఆయుర్వేద డిస్పెన్సరీలున్నాయి. రెగ్యు లర్ పోస్టుల్లో మాత్రం రెండు ఆయుర్వేద పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అల్లూరులోని ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరి పోయి కూలేందుకు సిద్ధం గా ఉంది. దీంతో వరండాలో డిస్పెన్సరీని మాత్రమే నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ హోమియో డిస్పెన్సరీలు 13 ఉండగా వాటిలో నలుగురు డాక్టర్లు లేరు. జిల్లాలో ఖాళీ పోస్టుల భర్తీకి 6 నెలల క్రితం మెరిట్‌లిస్టును ప్రకటించారు. అయినా వైద్య శాఖ నేటికీ పోస్టులను భర్తీ చేయకపోవడం చూస్తే ఆయుష్ డాక్టర్లపట్ల అధికారుల నిర్లక్ష్యవైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వేధిస్తున్న మందుల కొరత
ఆయుష్‌కు చెందిన అన్ని డిస్పెన్సరీల్లో ఓపీ సరాసరి 50గా ఉంది. నెల్లూరులోని కుక్కలగుంట హోమియో ఆస్పత్రిని పరిశీలిస్తే అక్కడ ప్రతిరోజు దాదాపు 100 మంది వరకు రోగులు వస్తున్నారు. అయితే సంప్రదాయ వైద్యవిధానాలను ఆశ్రయించే రోగులకు తగిన విధంగా మందులను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు . దీంతో రోగులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జన్మభూమి సభలు నిర్వహించినప్పుడు గ్రామ సభల్లో ఆయుర్వేద మందులను దాదాపు ఖాళీ చేసేశారు. ఇక వైద్యం కోసం ఓపీకి వచ్చే రోగులకు మందులు ఇవ్వలేక డాక్టర్లు ఒకటి, అరా ఇచ్చి సర్దుబాటు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక అసలు రాష్ట్రానికి ఇంకా ఫార్మసీ కూడా ఏర్పాటు చేయలేదు. అధికారులు అరకొర మందులు కొనుగోలు చేసి డిస్పెన్సరీలకు పంపుతున్నారు.
పోస్టుల భర్తీలో ఆయుష్‌కు అన్యాయం
ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఆర్‌బీఎస్‌కే లాంటి స్కీముల కింద మంజూరైన పోస్టుల్లో ఆయుష్ శాఖకు 50 శాతం పోస్టులు కేటాయించాలని జీవోలో స్పష్టంగా ఉంది. అయినా ఈ పోస్టులను కూడా అల్లోపతి డాక్టర్లతో నింపి ఆయుష్ డాక్టర్లకు అన్యాయం చేస్తున్నారు.
జీతాలకు నోచుకోని డాక్టర్లు
ఆయుష్ డాక్టర్లు ఐదు నెలలుగా జీతాలకు నోచుకోలేదు. బడ్జెట్ ఉన్నప్పటికీ తగిన విధంగా ఫైలు ఎప్పటికప్పుడు రన్ చేయడంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పేరుకే డాక్టర్లు అయినప్పటికీ భార్యా, బిడ్డలకు తిండిపెట్టేందుకు అప్పులపాలవుతున్నారు.దీంతో ఆయుష్‌శాఖకి చెందిన ఉద్యోగులు, డాక్టర్లు ఆందోళనలకు పూనుకుంటున్నారు.
మా పోస్టులు మాకే దక్కాలి
ప్రభుత్వ జీవో ప్రకారం మాకు దక్కాల్సిన పోస్టులను కూడా అల్లోపతి వారితో భర్తీ చేయడం అన్యాయం. మా పోస్టులను మాకే ఇవ్వాలి. ప్రభుత్వం చిన్న చూపుచూడటం తగదు. సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఆందోళనకు శ్రీకారం చుడుతున్నాం.
డా.శ్రీనివాసరావు , నేషనల్ ఆయుష్ మెడికల్ అసోసియేషన్(నామా) జిల్లా అధ్యక్షుడు
అల్లోపతి ప్రాక్టీసు చేసేందుకు అనుమతించాలి
మేము కూడా ఐదున్నరేళ్లు వైద్య కోర్సులు చేశాం. కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడ కూడా మాకు అల్లోపతి వైద్య విధానంలో మూడు నెలల పాటు రిఫ్రెషర్ శిక్షణనిచ్చి అల్లోపతివైద్యం చేసేందుకు అనుమతించాలి. డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. జీతాలు తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.
డాక్టర్ సిరాజ్, నామా జిల్లా కార్యదర్శి
త్వరలో జీతాలు ఇస్తాం. పోస్టులను భర్తీ చేస్తాం.
టెక్నికల్ సమస్యల వల్ల తాత్కాలికంగా ఆయుష్ డాక్టర్లకు జీతాల సమస్య ఏర్పడింది. త్వరలో జీతాలు ఇస్తాం. అలాగే గతంలో పోస్టుల భర్తీకి మెరిట్ లిస్టు ప్రకటించిన మాట వాస్తవమే. ఈ మెరిట్ లిస్టుకు అనుగుణంగా వెంటనే పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
డా.వరసుందరం, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి