
రిమ్స్‌లో పసికందు మృతి
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ కాన్పుల వార్డులో సుమలత అనే మహిళ ఓ పసికందుకు జన్మనిచ్చింది. సదరు పసికందు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ సంఘటనపై బాధితులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లక్కిరెడ్డిపల్లె మండలం చౌటపల్లెకు చెందిన సుమలత, గంగరాజులు తమ బంధువులతో కలిసి ఈనెల 1వ తేదీన రిమ్స్‌కు వచ్చారు. ప్రసవ వేదనతో ఉన్న సుమలతను వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఈనెల 9వ తేదీ వరకు సరిగా పట్టించుకోలేదు. ఉన్నట్లుండి గురువారం సుమలతను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లి చిన్నపాటి ఆపరేషన్ నిర్వహించి పసికందుకు జన్మనిచ్చేలా వైద్యం చేశారు. అనంతరం ఆ బిడ్డకు ఉలుకూ, పలుకూ లేదు. ఎందుకిలా జరిగిందని వైద్యులను నిలదీశామని బాధితులు తెలిపారు. వారు బిడ్డ ఆరోగ్యంగా లేదని, తమవంతు వైద్య సహాయం చేశామని, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. తమ పసిపాప మరణానికి వైద్యులే కారణమని, న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డ మరణానికి రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులే కారణమని ఆరోపించారు. ఈ సంఘటనపై రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ జంగం వెంకట శివను వివరణ కోరగా సుమలత గర్భంలోనే మెడచుట్టూ పేగులు బిగించుకుని ఉన్నదని, వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా బిడ్డను రక్షించలేక పోయారని తెలిపారు. తల్లి సుమలత క్షేమంగా ఉందని, వార్డులో చికిత్స పొందుతోందని తెలిపారు.