బినామీల అడ్డాలు! | Banerims are indispensable in Indiramma colonies | Sakshi
Sakshi News home page

బినామీల అడ్డాలు!

Published Fri, Jun 2 2017 4:14 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

బినామీల అడ్డాలు!

బినామీల అడ్డాలు!

నివ్వెరపోతున్న అధికారులు
విచారణలో తేలుతున్న నిజాలు
ఇందిరమ్మ కాలనీల్లో సిత్రాలు

కోరుట్ల: ఇందిరమ్మ కాలనీల్లో జరిగిన అక్రమాలు రెవెన్యూ అధికారుల విచారణతో వెలుగులోకి వస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా బినామీలు..అనర్హులు కాలనీల్లో అడ్డాలు వేసిన వైనం అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తోంది.

కాలనీల్లో నిజమైన లబ్దిదారులు పదిశాతం కనిపించకపోవడంతో జోరుగా అక్రమాలు సాగినట్లు స్పష్టమవుతోంది. కోరుట్ల పట్టణంలో ఏడు సంవత్సరాల క్రితం పేదలకు కెటాయించిన ఇందిరమ్మ కాలనీల్లో  రెండు రోజులుగా రెవెన్యూ సిబ్బంది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో ఎక్కడిక్కడే బినామీలు ఉండటం గమనార్హం.

నేతలే సూత్రధారులు..
కోరుట్ల పట్టణంలోని అర్బన్‌కాలనీ, ఏసుకోనిగుట్ట కాలనీ, నక్కలగుట్ట కాలనీ, అల్లమయ్యగుట్ట కాలనీ, మాదాపూర్‌ కాలనీల్లో ఏడు సంవత్సరాల క్రితం సుమారు 3వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి హౌసింగ్‌ రుణాలు ఇచ్చి ఇండ్లు కట్టించింది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పంపిణీ సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలు..ప్రజాప్రతినిధులు జోరుగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి.

కొంత మంది నేతలు బినామీల పేరిట ఐదు నుంచి పది పట్టాలు పొంది తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి హౌసింగ్‌ లోన్లు పొందారు. ఇండ్లు కట్టిన అనంతరం వాటిని రూ.5 నుంచి 15లక్షలకు ఇతరులకు అమ్ముకున్నారు. వందలాది ఇళ్లు కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో బినామీలు లబ్దిపొందారు. కొంత మంది అనర్హులకు పట్టాలు అందడంతో వారు ఇండ్లు కట్టి ఇతరులకు అద్దెకు ఇచ్చిన వైనం విచారణలో వెలుగుచూస్తోంది.

జాడలేని లబ్ధిదారులు..
ఇందిరమ్మ  కాలనీల ఏర్పాటు సమయంలో లబ్ధిపొందిన వారిలో చాలా మంది ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రెవెన్యూ అధికారులు సాగిస్తున్న విచారణలో అర్బన్‌ కాలనీలో 90 ఇళ్లలో సర్వే చేయగా కేవలం 22 మంది మాత్రమే నిజమైన పట్టాదారులు ఉన్నారు. మాదాపూర్‌ కాలనీలో 94 ఇళ్ల సర్వే జరగగా..16 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు.

ఏసుకోని గుట్ట కాలనీలో 50 ఇళ్ల సర్వే ముగియగా కేవలం 14 మంది మాత్రమే లబ్దిదారులు ఉన్నారు. ఈ మూడు కాలనీల్లో ఇప్పటి వరకు 234 ఇండ్ల సర్వే పూర్తి కాగా కేవలం 52 మంది మాత్రమే నిజమైన లబ్ధిదారులుగా తేలారు. మిగిలిన ఇళ్లలో అద్దెకు ఉన్నవారు..ఇళ్లు కొనుగోలు చేసిన వారు ఉన్నట్లుగా విచారణలో తేలింది. ఇంకా పట్టణంలోని వివిధ కాలనీల్లో సుమారు 2500 ఇళ్ల  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెందిన విచారణ సాగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement