పేదల పరేషాన్..!
సాక్షి, సిటీ బ్యూరో: మహానగరంలో కొందరు బడాబాబులకు తెలిసోతెలియకో ‘బినామీ’గా ఉన్నందుకు ఇప్పుడు పేదల పాలిట శాపంగా మారింది. సొంత ఆస్తులు, వ్యాపారాలు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయంటూ ప్రభుత్వం ఆహార భద్రత (రేషన్)పై వేటు వేసింది. పౌరసర ఫరాల శాఖ ఆధార్ అనుసంధానంతో సొంత ఆస్తులు, వాహనాలు, వ్యాపారాలు ఉన్న సుమారు 1.02 లక్షల కార్డులను ఏరివేసింది.
మొత్తం మీద 3.50 లక్షల మంది లబ్ధిదారులకు సెప్టెంబర్ నెల కోటా రద్దు చేసింది. ఇవీరిలో సగానికి పైగా నిరుపేద కుటుంబాలు ఉండడం గమనార్హం. కార్డులు రద్దయినట్టు తెలుసుకొని నిరుపేదలు గగ్గోలు పెడుతూ సర్కిల్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు.
ఆధార డేటాతో ఆస్తుల గుర్తింపు..
బహుళ ప్రయోజనకారి ఆధార్‌ను కుటుంబంలో ఏ ఒక్కరు దుర్వినియోగం చేసినా ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై పడి కార్డు రద్దయింది. ఇతరులకు బినామీగా వ్యవహరించేందుకు కార్డును వినియోగించడం దెబ్బతీసినట్లయింది. మరోవైపు ఉపాధి కోసం ఫైనాన్స్‌పై నాలుగు చక్రాల పెద్ద వాహనాలు కొనుగోలు చేసిన కుటుంబాలు సైతం..
సంపన్నుల జాబితాలో చేరిపోయారు. వాస్తవంగా పౌరసరఫరాల శాఖ బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా గత నెలలో అనర్హులపై దృష్టి సారించింది. సొంత ఇళ్లు, వ్యాపారాలు, వాహనాలు ఉన్నవారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ, వాణిజ్య పన్నుల తదితర శాఖల నుంచి వివరాలను సేకరించింది. వాటిని ఈ–పీడీఎస్‌తో అనుసంధానం చేసి కార్డులను తొలగించింది. ఆధార్ డేటా ఆధారంగా సంపన్నులతో పాటు పేదలపై సైతం వేటు పడింది. మొత్తం 1.02 లక్షల కార్డులు రద్దు కాగా, అందులో సుమారు 50 వేలకు పైగా పేదలవే కావడం గమనార్హం.
అవాక్కవుతున్నారు..
కార్డు రద్దయ్యాక.. తమకు అస్తులు, వాహనాలు ఉన్నట్లు బయట పడుతుండటంతో పేదలు అవాక్కవుతున్నారు. సర్కిల్ కార్యాలయాలకు వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఉపాధి కోసం వాహనాలను కొనుగోలు చేశామని, ఫైనాన్స్ చెల్లించకపోవడంతో వారు తీసుకెళ్లినట్టు కొందరు పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం చేసేదిలేదని చేతులెత్తేస్తున్నారు.
హైదరాబాద్ పౌరసరఫరాల విభాగం పరిస్థితి ఇలా...
నెల కార్డుల సంఖ్య యూనిట్లు
ఆగస్టు 7,25,079 25,93,504
సెప్టెంబర్ 6,22,677 22,42,695
కోత 1,02,402 3,50,809