సర్కిల్స్ ఆఫీసుల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆధార్ అప్‌డేట్ లేని ఆహార భద్రత లబ్ధిదారులకు శుభవార్త. ‘డేటా నాట్ ఫౌండ్’ ఆధార్ కార్డుల ను తిరిగి పునరుద్దరించుకునేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. సర్కిల్ కార్యాలయానికి ఒకటి చొప్పున ప్రత్యేక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు మీ–సేవా ఆధార్ కేంద్రాల్లో సైతం ఈ వెసులుబాటు కల్పించింది. నగరంలో సుమారు 34 కేంద్రాల్లో ఆధార్ అప్‌డేట్, చేర్పులు, మార్పులు ప్రక్రియ ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో అమలవుతున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈ–పాస్ ) ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియతో ఆధార్ అప్‌డేట్ సమస్య వెలుగులోకి వచ్చింది.
ఆధార్ డేటా లేని లబ్ధిదారుల వేలిముద్రలను మిషన్ స్వీకరించక పోవడంతో సరుకుల పంపిణీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా అప్‌డేట్ గా లేని లబ్ధిదారులకు గత ఆరునెలలుగా సరుకుల పంపిణీ నిలిచిపోయింది. మీ–సేవా కేంద్రాల్లో ఆధార్ అప్ డేట్ కోసం వేలి ముద్రల నమోదు గగనం కావడంతో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఆఫీసుల్లోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
లబ్ధిదారులు 3.5 లక్షలు
గ్రేటర్ హైదరాబాద్ పౌరసరఫరాల విభాగంలో 12 సర్కిళ్లు ఉండగా, వాటి పరిధిలో ప్రస్తుతం సుమారు 44.20 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. మరో 3.5 లక్షల మంది లబ్ధిదారులు ఆధార్ డేటా ఆప్ డేట్ లేక తొలగింపునకు గురయ్యారు. ఆరు నెలలుగా ఈ–పాస్ విధానంలో వేలిముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ చేపట్టారు. ఈ పాస్ యంత్రాలకు ఆధార్ డేటాతో అనుసంధానం చేయడంతో లబ్ధిదారుడి వేలిముద్రలు మ్యాచ్ అయితేనే సరుకులు పంపిణీ జరుగుతుంది.
కొందరు డేటా ఎర్రర్ కారణంగా ఎగిరి పోగా, మరి కొందరి డేటా ఉన్నా వేలి ముద్రలు సరిపోలడం లేదు. వీరిలో అధిక శాతం కూలీలు, రిక్షా కార్మికులు, వృద్ధులు, చిన్నారులు ఉండటం గమనార్హం. గతంలో ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్రలు ప్రస్తుత వేలిముద్రల్లో కొద్ది మార్పులు జరుగడం తో ఈ– పాస్‌లో సరిపోలకపోవడంతో డీలర్లు వారికి రేషన్ సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో వారు తిరిగి ఆదార్ డేటాను అప్‌డేట్ చేసుకొని తిరిగి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.