కథలాపూర్ మండలం కలిగోట శివారులో నిర్మించే సూరమ్మ రిజర్వాయర్ స్థలం ఇదే..
సాక్షి, కథలాపూర్(వేములవాడ) : పరిహారం డబ్బుల కోసం ప్రభుత్వ భూముల్లోనే పాగా వేశారు. ఎక్కడైన ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఆ ప్రాంతంలోని భూనిర్వాసితులకు పరిహారం దక్కడం న్యాయం. కానీ కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూ రమ్మ రిజర్వాయర్ పరిహారం కోసం స్థానికేతరు లు సైతం రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికేతరుల పేర్లు కనిపించడంపై కలిగోట గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న స్థానికులకు మాత్రమే పరిహారం ఇవ్వాలని.. అక్రమార్కులను అడ్డుకోవాలని కోరుతున్నారు.
ఇదీ రిజర్వాయర్ ప్రణాళిక
కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపెల్లి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రిజర్వాయర్‌ను నీటితో నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగు, తాగునీరందించడం లక్ష్యం. రిజర్వాయర్ నిర్మాణానికి అంబారిపేట పరిధిలోని 39.26 ఎకరాలు పట్టా భూమి, 114.33 ఎకరాలు ప్రభుత్వ భూమి అవసరం. కలిగోట పరిధిలో 117.11 ఎకరాలు పట్టాభూమి, 80.36 ఎకరాలు ప్రభుత్వ భూమి కోల్పోతున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. పట్టాభూముల రైతులకు అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరానికి రూ.6.75లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించింది.
బినామీల కన్ను
కలిగోట పరిధిలోని ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నట్లుగా కలిగోట గ్రామస్తులు కాకుండా ఇతరులు ఏడుగురి పేర్లు చేర్చారు. వీరి పేరిట సుమారు 15 ఎకరాలు పహణీల్లో చేర్చారు. మండలంలోని ఓ నాయకుడి చొరవతోనే బినామీలు పేర్లు చేర్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పహణీల్లో పేర్లున్న బినామీల వద్ద భూమికి సంబంధించి ఆధారాలు లేకపోగా.. వారికి ఆ భూమి ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి ఉందని కలిగోట గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.6.75 లక్షలు పరిహారం వస్తుందని తెలిసి మండలంలోని సదరు నాయకుడు 15 ఎకరాల్లో బినామీల పేర్లు రాయించారని, కోటి రూపాయల పరిహారం కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
హక్కులున్న వారికే పరిహారం
సూరమ్మ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇస్తాం. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్న రైతుల్లో భూమి హక్కులున్న వారికే పరిహారం అందజేస్తాం. బినామీలకు పరిహారం ఇవ్వబోం. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం.
– మధు, తహసీల్దార్, కథలాపూర్
Comments
Please login to add a commentAdd a comment