Compensation for crop losses
-
Telangana: పరిహారం.. ఇంకెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలు పరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వంతు ప్రీమియం చెల్లించినా రెండేళ్ల పరిహారం అందలేదని వాపోతున్నారు. 2018–20 కాలంలో రైతులకు చెల్లించాల్సిన రూ.933.90 కోట్ల పరిహారాన్ని బీమా కంపెనీలు చెల్లించకుండా నిలిపివేయడమే దీనికి కారణం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. రెండేళ్లకు సంబంధించి రూ.450 కోట్ల ప్రీమియం మొత్తాన్ని సర్కారు చెల్లించలేదని తెలుస్తోంది. చదవండి: 22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా? 2018–19లో అరకొర చెల్లింపులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఏటా బీమా కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఆ మేరకు టెండర్లు పిలుస్తుంది. ఇలా 2018–19లో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏఐసీ), బజాజ్ అలియాంజ్, టాటా ఏఐజీలు పీఎంఎఫ్‌బీవై పథకం అమలులో పాలుపంచుకున్నాయి. 2019–20లో ఏఐసీ, ఇఫ్కో టోకియో బీమా టెండర్లు దక్కించుకున్నాయి. 2018–19 సంవత్సరంలో తెలంగాణలో 7.9 లక్షల మంది రైతులు పీఎంఎఫ్‌బీవై పథకం కింద బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించారు. ప్రభుత్వాల వాటాతో కలిపి రైతులు కంపెనీలకు రూ.532.61 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.190.71 కోట్లు కాగా అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించినా, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు మాత్రమే చెల్లించినట్టు సమాచారం. ఇలా కొద్ది మొత్తమే ప్రీమియం చెల్లించి రూ.135.71 కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో బీమా కంపెనీలు కేవలం 59 వేల మంది రైతులకు రూ.112.01 కోట్లు పరిహారం కింద చెల్లించాయి. రూ.413 కోట్ల పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టాయి. ఆ సొమ్ము కోసం 7.31 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం 2019–20లో పైసా ఇవ్వలేదు .. రాలేదు ఇక 2019–20 సంవత్సరంలో రాష్ట్రంలో 10.10 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 866.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.314.83 కోట్లు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో ఆ ఏడాదికి సంబంధించి ఏకంగా రూ.520.90 కోట్ల పరిహారం రైతులకు అందలేదు. మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో 17.41 లక్షల మంది రైతులకు రూ.933.90 కోట్ల పరిహారం నిలిచిపోయిందని కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 2019–20 సంవత్సరంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 23,645 కోట్ల పంటల బీమా పరిహారం అందగా, తెలంగాణ రైతులకు ఒక్క పైసా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పథకమూ లేదు బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ పథకం స్థానంలో తమ సొంత పథకాలను ప్రారంభించాయి. ఏపీ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకా న్ని అమలు చేస్తోంది. కానీ తెలంగాణ ఎలాంటి పథకం చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతుబంధు ఇస్తున్నందున పంట నష్ట పరిహారం ఎందుకని కొందరు అధికారులు వాదించడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పీఎంఎఫ్‌బీవై నుంచి వైదొలిగిన తెలంగాణ పీఎంఎఫ్‌బీవై పథకం 2016–17లో ప్రారంభమైంది. టెండర్లలో ఖరారు చేసిన ప్రీమియం సొమ్ములో రైతులు వానాకాలం పంటలకు గరిష్టంగా 2 శాతం, యాసంగికి 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం కట్టాలి. వడగళ్ల వాన, వరదలు, స్థానిక ప్రమాదాలు, తుపాన్లు, అకాల వర్షాలు, సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు వంటి వాటివల్ల జరిగే పంట నష్టాలకు ఈ బీమా పరిహారం అందుతుంది. అయితే 2020 వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందం చేసింది. ఈ నేపథ్యంలో అనేక కారణాలతో తెలంగాణ ప్రభుత్వం ఆ పథకం రాష్ట్రంలో అమలు చేయకుండా విరమించుకుంది. అతివృష్టిగా నిర్ధారించినా పరిహారం రాలే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కొల్లూరి మోహన్‌రావు. ఇతనిది వరంగల్ జిల్లా వెంకటాపురం గ్రామం. ప్రతిఏటా బీమా పథకం కింద పసుపు పంటకు ప్రీమియం చెల్లిస్తున్నాడు. అదే క్రమంలో తనకున్న భూమిలో 2 ఎకరాల పసుపు పంటకు గాను ఏడాది క్రితం రూ.4,200 ప్రీమియం చెల్లించాడు. అదేవిధంగా మూడెకరాల మొక్కజొన్న పంటకు రూ.1200 చొప్పున కట్టాడు. ఆ తరువాత విపరీతంగా వర్షాలు కురిసి పసుపు, మక్క చేలు జాలువారిపోయాయి. వ్యవసాయ అధికారులు వచ్చి పంటలను పరిశీలించి అతివృష్టి ప్రభావంతో నష్టం జరిగిందని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ నేటికీ బీమా పరిహారం అందలేదు. పంటతో పాటు బీమా ప్రీమియం డబ్బులు కూడా నష్టపోయానని మోహన్‌రావు వాపోతున్నాడు. పరిహారం రాలేదు నేను 2018లో ఒక ఎకరం భూమిలో మిర్చి పంట, మరో ఎకరంలో వరి సాగు చేశా. మిర్చికి రూ.2,500, వరికి రూ.1,600 బీమా ప్రీమియం చెల్లించాను. ఆ ఏడాది వర్షాల వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. అయినా ఇప్పటివరకు నాకు ఎలాంటి పరిహారం రాలేదు. – మేక దామోదర్ రెడ్డి, కురవి, మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి 2019లో మొత్తం నాలుగు ఎకరాల్లో సోయా పంట వేశా. కాత చాలా బాగా వచ్చింది. సరిగ్గా కోత కోసి కుప్పలు వేసిన రోజునే వర్షం కురిసింది. దీంతో చేన్లోని కుప్పలు మొత్తం తడిసిపోయాయి. వరుసగా మూడు రోజులు ముసురు కమ్ముకోవడంతో చేతికి వచ్చిన పంట పూర్తిగా నాశనం అయిపోయింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి బీమా పరిహారం అందలేదు. ప్రభుత్వం పరిహారం అందేలా చేసి ఆదుకోవాలి. –ఎల్టి రాంరెడ్డి, ఖాప్రి, ఆదిలాబాద్ జిల్లా పంట నష్టం అంచనా వేసినా.. నాకు 8 ఎకరాల భూమి ఉంది. ఏడాది క్రితం సోయా, పసుపు పంటల కోసం ఎకరానికి రూ.1,500 వరకు బీమా ప్రీమియం చెల్లించాను. సోయా పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ బీమా వర్తించలేదు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి నివేదిక సమర్పించారు. అయినా ఇప్పటివరకు నయాపైసా పరిహారం అందలేదు. పంటలకు బీమా చేస్తే మంచిదనుకున్నా. కానీ వృథా అయిపోయింది. – కుంట రవిశంకర్, పాలెం, నిజామాబాద్ జిల్లా -
ఫలించిన మొక్కజొన్న రైతుల పోరాటం
మీర్జాపురం(నూజివీడు): మొక్కజొన్న రైతులు మంగళవారం నాటి నుంచి చేపట్టిన ఆందోళనతో కంపెనీ దిగొచ్చి నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో రైతులు గురువారం ఆందోళన విరమించారు. రైతుసంఘం ఆధ్వర్యంలో 30 గంటల పాటు జరిగిన ఆందోళనతో ఎకరాకు రూ.62,500 చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు సీపీ కంపెనీ అంగీకరించింది. దాదాపు 5వేల ఎకరాలలో మొక్కజొన్న సాగుచేయగా, కంపెనీ చెప్పిన విధంగా దిగుబడులు రాకపోగా, పూర్తిగా నష్టపోయారు. మద్దతుగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు.. నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులకు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు మద్దతుగా నిలిచారు. మీర్జాపురంలోని సీపీ సీడ్ కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి చర్చించారు. ఆ తరువాత కంపెనీ ఆర్గనైజర్లతోను, ప్రతినిధితోను మాట్లాడారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం ఎంతిస్తారో తేల్చాలని, లేనిపక్షంలో నూజివీడు– హనుమాన్‌జంక్షన్ రోడ్డుపై రైతులతో కలసి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ప్రతాప్, పోలీసు అధికారులతోను, తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి డీఎస్పీ బమ్మిడి శ్రీనివాసరావు రావడంతో ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ రైతులు ఎకరాకు రూ.90వేలు నష్టం పరిహారం అడుగుతున్నారని, అసలు ఎంతిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులతో తహసీల్దార్ తేజేశ్వరరావు, డీఎస్పీ, సీఐలు పలుమార్లు చర్చించి, నష్టపరిహారాన్ని ప్రకటించాలని సూచించారు. చివరకు ఎకరాకు రూ.62,500 నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు పగడాల వెంకట ఆంజనేయులు, నిమ్మగడ్డ నరసింహా, గరిశేపల్లి రాజు, చిటికెల రామారావు పాల్గొన్నారు. -
బినామీల బాగోతం
సాక్షి, కథలాపూర్(వేములవాడ) : పరిహారం డబ్బుల కోసం ప్రభుత్వ భూముల్లోనే పాగా వేశారు. ఎక్కడైన ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఆ ప్రాంతంలోని భూనిర్వాసితులకు పరిహారం దక్కడం న్యాయం. కానీ కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూ రమ్మ రిజర్వాయర్ పరిహారం కోసం స్థానికేతరు లు సైతం రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికేతరుల పేర్లు కనిపించడంపై కలిగోట గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న స్థానికులకు మాత్రమే పరిహారం ఇవ్వాలని.. అక్రమార్కులను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇదీ రిజర్వాయర్ ప్రణాళిక కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపెల్లి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రిజర్వాయర్‌ను నీటితో నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగు, తాగునీరందించడం లక్ష్యం. రిజర్వాయర్ నిర్మాణానికి అంబారిపేట పరిధిలోని 39.26 ఎకరాలు పట్టా భూమి, 114.33 ఎకరాలు ప్రభుత్వ భూమి అవసరం. కలిగోట పరిధిలో 117.11 ఎకరాలు పట్టాభూమి, 80.36 ఎకరాలు ప్రభుత్వ భూమి కోల్పోతున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. పట్టాభూముల రైతులకు అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరానికి రూ.6.75లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించింది. బినామీల కన్ను కలిగోట పరిధిలోని ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నట్లుగా కలిగోట గ్రామస్తులు కాకుండా ఇతరులు ఏడుగురి పేర్లు చేర్చారు. వీరి పేరిట సుమారు 15 ఎకరాలు పహణీల్లో చేర్చారు. మండలంలోని ఓ నాయకుడి చొరవతోనే బినామీలు పేర్లు చేర్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పహణీల్లో పేర్లున్న బినామీల వద్ద భూమికి సంబంధించి ఆధారాలు లేకపోగా.. వారికి ఆ భూమి ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి ఉందని కలిగోట గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.6.75 లక్షలు పరిహారం వస్తుందని తెలిసి మండలంలోని సదరు నాయకుడు 15 ఎకరాల్లో బినామీల పేర్లు రాయించారని, కోటి రూపాయల పరిహారం కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హక్కులున్న వారికే పరిహారం సూరమ్మ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇస్తాం. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్న రైతుల్లో భూమి హక్కులున్న వారికే పరిహారం అందజేస్తాం. బినామీలకు పరిహారం ఇవ్వబోం. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. – మధు, తహసీల్దార్, కథలాపూర్ -
రూ.101కోట్లుఎప్పుడిస్తారో!
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: గత ఖరీఫ్‌లో వేరుశెనగ పంట నష్టపోయిన రైతాంగానికి అందాల్సిన రూ.101కోట్ల పరిహారం కోసం జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. ఏడాది క్రితం పంటనష్టం జరిగితే ఇంతవరకూ ప్రభుత్వం నుంచి పరిహారం ఊసేలేదు. ఇప్పుడు మళ్లీ ఖరీఫ్ వచ్చింది. పంటలు పెట్టాలంటే పెట్టుబడులు కావాలి. అసలే వరుస కరువుతో రైతాంగం అల్లాడిపోతుంటే పట్టించుకునే దిక్కులేకుండాపోతోంది. ప్రస్తుతం పంటలకు పోవాలంటే పెట్టుబడి కోసం అన్నదాతలు రుణదాతల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో పంటలకు నష్టం వాటిల్లింది. దీనిపై ప్రభుత్వం 33 కరువు మండలాలను ప్రకటించింది. కరువు సహాయక చర్యలు, పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. అయితే ఇంతవరకు ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పెట్టుబడికోసం దిక్కులు చూస్తున్నారు. జిల్లాలోని బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, కురబలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, చిత్తూరు, ఐరాల, యాదమరి, తవణంపల్లె, గుడిపాల, పూతలపట్టు, పీలేరు,కేవీ పల్లె, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, సదుం, వాల్మీకిపురం, కలికిరి, కల కడ, మదనపల్లె, నిమ్మనపల్లె, బెరైడ్డిపల్లె, కుప్పం, వీకోట, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, పుంగనూరు, రామసముద్రం, చౌడేపల్లె, సోమల, పులిచెర్లను కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ మండలాల్లో 1,01,082.94 హెక్టార్లలో వేరుశెనగ పంటకు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 1,74,289మంది రైతులకు హెక్టారుకు రూ.10వేలు చొప్పున పరిహారం అందించాల్సి ఉంది. దీనికోసం రూ.101,82,94,200 మంజూరు కావాల్సి ఉంది. పెట్టుబడి కోసం అవస్థలు కరువు మండలాలకు చెందిన రైతులు ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశెనగ పంట సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరా సాగుకు రూ.11 నుంచి రూ.12వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం పరిహారం అందించి ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. దాని ఊసే లేకపోవడంతో అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. పుణ్యకాలం ముగుస్తున్నా ఇవ్వరా నిరుటి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. మళ్లీ ఖరీఫ్ సీజన్ వస్తోంది. రైతులంటే ఎవ్వరికీ లెక్కలేకుండా పోతోంది. ఇన్పుట్, ఇన్సూరెన్సు కింద తప్పకుండా పరిహారం చెల్లిస్తామని ఇదివరకటి మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. ఆయన మంత్రి పదవే కాదు ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. ఇస్తారో ఇవ్వరోనన్న నీలినీడలు అలుముకుంటున్నాయి. -వేణుగోపాల్ రెడ్డి, రైతు, సర్కారుతోపు, కురబలకోట మండలం వస్తుందో..రాదో ఏడాది క్రితం దారుణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు ఇవ్వలేదు. ఎన్నికలు వచ్చి ప్రభుత్వాలు మారాయి. ఇస్తారో..ఇవ్వరోనని అనుమానంగా ఉంది. రైతుల గోడు ఎవరు పట్టించుకుంటారు. పంటల వారీగా ఎంత మేరకు దెబ్బతిందో వివరాలతో కూడిన నివేదికలను పంపినా నిధులు రాలేదు. -జి.హుస్సేన్ సాబ్,రైతు, అంగళ్లు, కురబలకోట మండలం పరిహారం పరిహాసమే కిందటేడాది పంటలు నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ చెల్లిం పునకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి దీన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు రాలేదు. నాయకులకు ఓట్లు..సీట్లపై ఉన్నంత శ్రద్ధ రైతులపై లేదు. రైతులను పట్టించుకోవడం వైఎస్ఆర్తోనే పోయింది. -సురేంద్ర, ముదివేడు, కురబలకోట మండల