రూ.101కోట్లుఎప్పుడిస్తారో!
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: గత ఖరీఫ్‌లో వేరుశెనగ పంట నష్టపోయిన రైతాంగానికి అందాల్సిన రూ.101కోట్ల పరిహారం కోసం జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. ఏడాది క్రితం పంటనష్టం జరిగితే ఇంతవరకూ ప్రభుత్వం నుంచి పరిహారం ఊసేలేదు. ఇప్పుడు మళ్లీ ఖరీఫ్ వచ్చింది. పంటలు పెట్టాలంటే పెట్టుబడులు కావాలి.
అసలే వరుస కరువుతో రైతాంగం అల్లాడిపోతుంటే పట్టించుకునే దిక్కులేకుండాపోతోంది. ప్రస్తుతం పంటలకు పోవాలంటే పెట్టుబడి కోసం అన్నదాతలు రుణదాతల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో పంటలకు నష్టం వాటిల్లింది. దీనిపై ప్రభుత్వం 33 కరువు మండలాలను ప్రకటించింది. కరువు సహాయక చర్యలు, పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. అయితే ఇంతవరకు ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పెట్టుబడికోసం దిక్కులు చూస్తున్నారు.
జిల్లాలోని బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, కురబలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, చిత్తూరు, ఐరాల, యాదమరి, తవణంపల్లె, గుడిపాల, పూతలపట్టు, పీలేరు,కేవీ పల్లె, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, సదుం, వాల్మీకిపురం, కలికిరి, కల కడ, మదనపల్లె, నిమ్మనపల్లె, బెరైడ్డిపల్లె, కుప్పం, వీకోట, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, పుంగనూరు, రామసముద్రం, చౌడేపల్లె, సోమల, పులిచెర్లను కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ మండలాల్లో 1,01,082.94 హెక్టార్లలో వేరుశెనగ పంటకు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 1,74,289మంది రైతులకు హెక్టారుకు రూ.10వేలు చొప్పున పరిహారం అందించాల్సి ఉంది. దీనికోసం రూ.101,82,94,200 మంజూరు కావాల్సి ఉంది.
పెట్టుబడి కోసం అవస్థలు
కరువు మండలాలకు చెందిన రైతులు ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశెనగ పంట సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరా సాగుకు రూ.11 నుంచి రూ.12వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం పరిహారం అందించి ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. దాని ఊసే లేకపోవడంతో అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి.
పుణ్యకాలం ముగుస్తున్నా ఇవ్వరా
నిరుటి ఇన్‌పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. మళ్లీ ఖరీఫ్ సీజన్ వస్తోంది. రైతులంటే ఎవ్వరికీ లెక్కలేకుండా పోతోంది. ఇన్‌పుట్, ఇన్సూరెన్సు కింద తప్పకుండా పరిహారం చెల్లిస్తామని ఇదివరకటి మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. ఆయన మంత్రి పదవే కాదు ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. ఇస్తారో ఇవ్వరోనన్న నీలినీడలు అలుముకుంటున్నాయి.
-వేణుగోపాల్ రెడ్డి, రైతు, సర్కారుతోపు, కురబలకోట మండలం
వస్తుందో..రాదో
ఏడాది క్రితం దారుణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇన్‌పుట్ సబ్సిడీ ఇంత వరకు ఇవ్వలేదు. ఎన్నికలు వచ్చి ప్రభుత్వాలు మారాయి. ఇస్తారో..ఇవ్వరోనని అనుమానంగా ఉంది. రైతుల గోడు ఎవరు పట్టించుకుంటారు. పంటల వారీగా ఎంత మేరకు దెబ్బతిందో వివరాలతో కూడిన నివేదికలను పంపినా నిధులు రాలేదు.
-జి.హుస్సేన్ సాబ్,రైతు, అంగళ్లు, కురబలకోట మండలం
పరిహారం పరిహాసమే
కిందటేడాది పంటలు నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిం పునకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి దీన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు రాలేదు. నాయకులకు ఓట్లు..సీట్లపై ఉన్నంత శ్రద్ధ రైతులపై లేదు. రైతులను పట్టించుకోవడం వైఎస్‌ఆర్‌తోనే పోయింది.
-సురేంద్ర, ముదివేడు, కురబలకోట మండల