అక్రమాలపై విచారణ
► మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు
►ఆర్డీవో నేతృత్వంలో 13 బృందాలు
► ఇంటింటికీ తిరుగుతున్న అధికారులు
► కలెక్టర్‌కు సర్వే నివేదిక
గంభీరావుపేట : మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి ఫిర్యాదులపై అధికారులు కదిలారు. మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్లు బిల్లులు కాజేయడం, బినామీల పేరిట స్వాహా చేశారనే విషయం పత్రికల్లో రావడం... తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించి వెంటనే విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు అధికారులు రీ సర్వే మొదలెట్టారు. గంభీరావుపేట పంచాయతీ పరధిలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్ నేతృత్వంలో 40 మంది అధికారులు 13 బృందాలుగా విడిపోయి గ్రామంలో సోమవారం సర్వే చేపట్టారు.
ఆర్డీవో బిక్షానాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రాజ్‌కుమార్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నారు. మిగిలిన అధికార బృందాలు కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరుగుదొడ్డి నిర్మాణ ప్రగతిని పరిశీలించి, బిల్లుల చెల్లింపు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. గంభీరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్‌లో భాగంగా 834 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. 263 మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని, లబ్ధిదారుల జాబితాలో బినామీ పేర్లు చే ర్చి బిల్లులు స్వాహా చేశారని, గతంలో ఈజీఎస్‌లో నిర్మించిన మరుగుదొడ్లను కూడా స్వచ్ఛభారత్ మరుగుదొడ్ల జాబితాలో చేర్చి నిధులు కాజేశారని పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలింది.
గంభీరావుపేట గల్లీగల్లీలో అధికారులు తిరుగుతున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యిందని బెస్ట్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో ఈ మరుగుదొడ్లపై అవినీతి, ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి కేటీఆర్ అధికారులపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సమగ్ర సర్వేకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, గంభీరావుపేట గ్రామంలో ఏ వాడకెళ్లినా అధికారులే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా మరుగుదొడ్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అధికారులు సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు సమాచారం. అధికారుల రీసర్వేతో మిగిలిన గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమవుతున్నారు.