వన్‌టౌన్‌లో సెట్‌బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న భవనం
సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడలో అనధికార నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా చేపడుతున్నారు. నగర పాలక సంస్థ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే అపార్టుమెంట్లు సైతం కట్టేస్తున్నారు. తీసుకునే ప్లాన్ ఒకటయితే...నిర్మించే భవనం ఇంకో విధంగా ఉంటుంది. ఇందుకు బిల్డర్ల వద్ద టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, వీఎంసీ అధికారులు పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. దీని వల్లకార్పొరేషన్ ఖజానాకు భారీగానే గండిపడుతోంది. భద్రతా ప్రమాణాలు తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్దంగా అదనపు అంతస్తులు కడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నగరంలో జరుగుతున్న అనధికారిక నిర్మాణాల గురించి అసెంబ్లీలో ప్రస్తావన వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని నేపథ్యంలో విజయవాడలో భవన నిర్మాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
కానీ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఓ వైపు రాజకీయ నాయకుల ఒత్తిడి మరోవైపు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల చేతివాటంతో నగరంలో అనధికారిక నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 2018 జనవరి నుంచి జూన్ వరకు కేవలం 3 వేల అపార్టుమెంట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. కానీ నగరంలోని దుర్గాపురం, అజిత్‌సింగ్‌నగర్, భవానీపురం, ముత్యాలంపాడు, సత్యనారాయణపురంలో అన«ధికారిక నిర్మాణాలు కోకొల్లలు. ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు అపార్టుమెంట్లు నిర్మాణాలు నానాటికీ పెరుగుతున్నాయి. వేలాది భవనాలు కనీస అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు. నగరంలో అనుమతులు లేని భవనాల వివరాలు కావాలని నగరంలోని ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారంటే అధికారుల ధనదాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో భవన నిర్మాణ అనుమతులపై అవకతవకలు జరిగాయని ఏసీబీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విభాగంపై విచారణ అంటేనే ఏళ్ల తరబడి సాగతీత వ్యవహారంగా మారటంతో ఇక్కడి అధికారులు ఎలాంటి విచారణకు బెదరడం లేదని సమాచారం.
కన్పించని సెట్‌బ్యాక్స్
నగరంలో నిర్మాణాలు జరుగుతున్న బహుళ అంతస్తుల భవనాల నుంచి జీప్లస్–3 గృహాల వరకు సెట్‌బ్యాక్స్ వదలటంలేదు. ¿¶ భధ్రత ప్రామాణికంగా ఏర్పాటు చేసిన ఈ విధానానికి బిల్డర్లు తూట్లు పొడుస్తుంటే అధికారులు వంత పాడుతున్నారు. చాలా భవనాలకు సెట్‌బ్యాక్స్ అనేవి ప్రామాణికమైనా అవి నిషిద్ధం అన్నట్లు బిల్డర్లు వ్యవహరిస్తున్నారు.
ఇవిగో అక్రమ నిర్మాణాలు....
బీసెంట్‌రోడ్డులో ఎల్‌ఐసీ భవనం వెంబడి ఓ నిర్మాణం పూర్తి నిబంధనల విరుద్దంగా సాగుతుంది. అనుమతి పొందింది జీప్లస్–3 వరకు మాత్రమే. కానీ స్థానిక కార్పొరేటర్ సహకారంతో అదనపు అంతస్తులు వేసేశారు. ఇందుకు గాను టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి కార్పొరేటర్ వరకు ఆ బిల్డరు రూ. 7 లక్షలు చెల్లించుకున్నట్లు సమాచారం.
ఒన్‌టౌన్‌లోని మారుపిళ్ల చిట్టి రోడ్డులో 50 గజాల స్థలంలో జీప్లస్ 5 నిర్మాణం జరిగింది. నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవటానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సాహసం చేయకలేకపోతున్నారు. కారణం అక్కడ ఎమ్మెల్యే అండదండలతో నిర్మాణం సాగుతోంది. ఇందుకు ఎమ్మెల్యేకు రూ. 10 లక్షలు చెల్లించినట్లు కార్పొరేషన్‌లో వినికిడి.
కృష్ణలంకలోని పొట్టిశ్రీరాములు జూనియర్ కళాశాల వద్ద ఓ గ్రూప్‌హౌస్ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు గాను టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అధికారికి రూ. నాలుగులక్షలు అందాయని సమాచారం.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం
అనధికారిక నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక స్క్వాడ్‌ను కూడా ఏర్పాటు చేశాం. అనధికారిక నిర్మాణాలను నిర్మూలించేందుకు చర్యలు చేపడతున్నాం.బి. లక్ష్మణరావు, సిటీ ప్లానర్
Comments
Please login to add a commentAdd a comment