ఎంత ‘ఘాటు’ ప్రేమయో! | Pushkara works Construction of Ghat on Corruption | Sakshi
Sakshi News home page

ఎంత ‘ఘాటు’ ప్రేమయో!

Published Wed, Jun 29 2016 2:38 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

ఎంత ‘ఘాటు’ ప్రేమయో! - Sakshi

ఎంత ‘ఘాటు’ ప్రేమయో!

పుష్కర పనుల్లో రూ.12.80 కోట్లు వృథా పుష్కర పనుల్లో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. అధికారుల అనాలోచిత నిర్ణయం.. కాంట్రాక్టర్ల ధన దాహం.. వెరసి కోట్లాది రూపాయలు కృష్ణా నదిలో కొట్టుకుపోనున్నాయి. శ్రీశైలంలో చేపట్టిన ఘాట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి పారుతోంది. జిల్లా శివారు ప్రాంతం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. అక్కడ ఏమి చేసినా చెల్లుబాటు అవుతోంది. నీళ్లొస్తే ఘాట్ మునుగుతుందనీ తెలుసు.. నీళ్లు రాకపోతే వృథా అవుతుందనీ తెలుసు.. అయినా ఈ ‘ఘాటు’ ప్రేమ లెక్క వేరు!
 
సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో చేపడుతున్న పుష్కర పనుల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. పాతాళగంగ, లింగాలగట్టు వద్ద ఘాట్ల పనులతో కాంట్రాక్టర్ల పంట పండుతోంది. ఆగస్టు 12వ తేదీ నాటికి అధికారులు ఊహించినట్లు శ్రీశైలం రిజర్వాయర్‌లో 830 అడుగుల నుంచి 850 అడుగుల నీరు చేరితేనే పాతాళగంగలో రూ.8.74 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసే వీలుంటుంది.

ఒకవేళ అనుకున్న స్థాయిలో నీరు చేరకపోతే భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో రిజర్వాయరు కింది భాగంలోని లింగాలగట్టు వద్ద నది మధ్యలో రూ.4.06 కోట్లతో లోలెవల్ ఘాట్ నిర్మితమవుతోంది. అక్కడే ఎగువ భాగాన ఉన్న పాత ఘాట్‌ను విస్మరించి.. పాత మెట్లకు మరమ్మతులతో పాటు పైభాగంలోని రహదారి వరకు కొత్త ఘాట్ నిర్మాణం రూ.3.49కోట్లతో చేపడుతుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రిజర్వాయర్‌లోని నీటి నిల్వలతో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. మంగళవారం నాటికి డ్యాం నీటి మట్టం 779.1 అడుగులుగా నమోదయింది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవకపోతే.. శ్రీశైలంలో రూ.12.80 కోట్లతో చేపట్టిన రెండు ఘాట్ల ఉద్దేశం ‘నీరు’గారినట్లే.
 
పాత ఘాట్ కొట్టుకుపోయినా..

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీశైలం ఇరిగేషన్ అధికారులు సుమారు రూ.20 కోట్లకు పైగా అంచనాలతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని పరిశీలించేందుకు ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు కె.వి.సుబ్బారావు, రౌతు సత్యనారాయణ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. గత ఏప్రిల్ నెలలో ఆ కమిటీ శ్రీశైలంలో పర్యటించింది. పనులు ఎక్కడెక్కడ చేపడుతున్నారు? ఆ ప్రాంతాలు అనువైనవా? తదితర అంశాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. ఆ ప్రకారమే.. పాతాళాగంగలో మరో కొత్త ఘాట్ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.

అదేవిధంగా లింగాలగట్టులో నది మధ్యలో లోలెవల్ ఘాట్‌కు అనుమతించారు. కాగా.. గతంలో నది మధ్యలో నిర్మించిన పాత ఘాట్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీని ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ సజీవం. ఇవేవీ పట్టని ప్రభుత్వ సాంకేతిక నిపుణుల కమిటీ నది మధ్యలో తిరిగి ఘాట్ నిర్మాణానికి పచ్చజెండా ఊపడం విమర్శలకు తావిస్తోంది. నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ప్రయోజం లేదని తెలిసినా..

ప్రభుత్వ అధికారులు నోరు మెదపకపోవడం చూస్తే ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఘాట్ నిర్మాణ పనులు ఆపాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది? కాంట్రాక్టర్ మాత్రం రాత పూర్వకంగా ఆదేశాలు వస్తేనే పనులు ఆపుతామని చెబుతుండటంతో అధికారులు కూడా మౌనం దాల్చినట్లు సమాచారం.
 
నిధులు నీళ్లపాలు : తుంగభద్ర డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరి దిగువకు విడుదల చేస్తే శ్రీశైలంలోని లింగాలగట్టు వద్ద నిర్మించిన నూతన ఘాట్, లేదా ఇది వరకే ఉన్న ఘాట్‌ను విస్తరిస్తూ ప్రదేశంలో ఏదో ఒక చోట మాత్రమే భక్తులు స్నానమాచరించే అవకాశం ఉంటుంది. అంటే లింగాలగట్టు వద్ద రూ.4.06 కోట్లు, రూ.3.49 కోట్ల వ్యయంతో నిర్మించిన స్నాన ఘాట్లలో ఒకటి వృథా కానుందన్న మాట.

ఒకవేళ జలాశయంలో నీరు తక్కువగా ఉండి.. పుష్కర సమయానికి 2 టీఎంసీల నీటిని కిందకు వదిలితే లింగాలగట్టు వద్ద లోలెవల్ పుష్కర ఘాట్(నది మధ్యలో నిర్మించిన) వినియోగంలోకి రానుంది. అప్పుడు రూ.3.49 కోట్ల నిధులతో నిర్మిస్తున్న హైలెవల్ ఘాట్.. పాతాళగంగ వద్ద రూ.8.74 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మరో ఘాట్ నిరుపయోగం కానుంది.

నిపుణుల కమిటీ సూచన మేరకే నిర్మాణాలు
 లింగాలగట్టు వద్ద నది మధ్యలో సాంకేతిక నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే ఘాట్‌ను నిర్మిస్తున్నాం. ఈ విషయంలో మా పాత్ర ఏమీ లేదు. గతంలోనూ లింగాలగట్టు వద్ద పాత ఘాట్ సమీపంలో నది మధ్యన ఘాట్ ఉంది. అందువల్లే ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం దానికి దూరంగా నది మధ్యలోనే ఘాట్ నిర్మిస్తున్నాం.
 - రాంబాబు, ఎస్‌ఈ, శ్రీశైలం డ్యాం
 
పుష్కర పనులకు రూ.1.12 కోట్లు
* తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయింపు
* వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెహ్రూనగర్ ఘాట్‌ల పేరిటా నిధులు
* ఘాట్‌లు లేకపోయినా నిధుల విడుదల

కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఘాట్ల వద్ద భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.1.12 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గత సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం వద్ద ఏర్పాటు చేయనున్న ఘాట్‌లో 12 రోజల పాటు నిర్వహించే పుష్కరాలకు 150 మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.53 లక్షలు కేటాయించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 50 షెడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.9లక్షలు.. తాగునీటికి రూ.4.5 లక్షలు వెచ్చించనున్నారు. నెహ్రూనగర్‌లో 30 మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.13లక్షలు.. తాగునీటికి రూ.7లక్షలు.. దుస్తులు మార్చుకునే 30 షెడ్లకు రూ.4.5 లక్షలు మంజూరయ్యాయి. వెలుగోడు రిజర్వాయర్ ఘాట్ వద్ద 10 మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.3.7 లక్షలు.. తాగునీటికి రూ.4లక్షలు.. మహిళలు దుస్తులు మార్చుకునే షెడ్లకు రూ.1.5 లక్షలు మంజూరు చేశారు.
 
ఘాట్లు లేని చోట్ల నిధులు
పుష్కర పనుల్లో ప్రభుత్వం నిధులను ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుందో తాజా కేటాయింపుల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 6 చోట్ల ఘాట్లు ఏర్పాటవుతున్నాయి. శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద రెండు, లింగాలగట్టు వద్ద 2, సంగమేశ్వరం వద్ద రెండు ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఘాట్లు లేని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెహ్రూనగర్‌లకు నిధులు మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది.
 
పుష్కర పనుల్లో అవినీతిపై విచారణ చేయించాలి
కర్నూలు(న్యూసిటీ): కృష్ణానది పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదురుగా ఈ మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కృష్ణానది పుష్కర పనుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు కుమ్మక్కై కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు.  

జిల్లాలో పాత పనులకు మెరుగులద్ది బిల్లులు స్వాహా చేస్తున్నారని విమర్శించారు. అవుకు సొరంగం పనుల్లో రూ.44 కోట్లు లూటీ చేసిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత, ఎంపీ సీఎం రమేష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ పనుల్లో జరిగిన అవినీతి రూ.350 కోట్ల విచారణ చేయించాలన్నారు.

నీరుచెట్టు నిధులు దుర్వినియోగమవుతున్నాయన్నారు. రోజూ దిన పత్రికల్లో టీడీపీ నాయకుల అక్రమాలపై కథనాలు వెలువడుతున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.ధర్నాలో సీపీఎం జిల్లా నాయకులు నాగేశ్వరరావు, నగర కార్యదర్శి పుల్లారెడ్డి, నగర నాయకులు గురుశేఖర్, సాయిబాబా, ఆనంద్‌బాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఐద్వా నాయకురాళ్లు అరుణ, ఉమాదేవి, సుజాత, లక్ష్మీదేవి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement