‘సాగర’ గర్భంలో..
‘సాగర’ గర్భంలో..
Published Sun, Sep 4 2016 11:57 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– పోస్టాఫీసు లాకర్‌లోనూ అవినీతి డబ్బు
– తనిఖీకి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ లేఖ
– బినామీలుగా పలువురు అధికారులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు
శ్రీశైలం మాజీ ఈఓ, దేవాదాయ శాఖ డిప్యూటీæ కమిషనర్ సాగర్‌బాబు అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో లాకర్లను బయటికి తీసిన ఏసీబీ అధికారులు తాజాగా కర్నూలు నగరంలోని పోస్టాఫీసులోని లాకర్లమీద దృష్టి సారించారు. కర్నూలు పోస్టాఫీసులోని లాకర్లలో కూడా ఆయన భారీగా నగదు ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోస్టాఫీసు అధికారులకు, ఏసీబీ అధికారులు లేఖ కూడా రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారి నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు పోస్టాఫీసులో దాచిన మొత్తాన్ని కూడా వెలికి తీసే అవకాశం ఉంది. మరోవైపు ఆయనకు బినామీలుగా పలువురు వ్యక్తులు ఉన్నారని కూడా ఏసీబీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది.
బినామీలుగా ఉద్యోగులు, మిత్రులు
సాగర్‌బాబు అవినీతి వ్యవహారంపై ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిచిన్న పనికి ఆయనకు వాటాలు ముట్టాయని తెలుస్తుంది. అయితే ఈ విధంగా సంపాదించిన మొత్తాన్నంతా తన పేరు మీదనే కాకుండా బినామీలుగా శ్రీశైలం ఉద్యోగులతో పాటు, కొద్దిమంది మిత్రులను కూడా ఆయన ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే శ్రీశైలంలో జూనియర్ అసిస్టెంటుగా ఉన్న శ్రీనివాస్ బినామీగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా ఆయనకు చెందిన లాకర్లను, ఆస్తి వివరాలను కూడా సేకరించారు. దీంతో పాటు మరికొద్దిమంది శ్రీశైల దేవస్థానంలో గతంలో పని చేసిన ఉద్యోగులు కూడా ఆయనకు బినామీగా ఉన్నారని, ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందులో ఒకరు కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద భారీ భవంతి నిర్మించారని కూడా అధికారులు సమాచారం సేకరించారు. అదేవిధంగా సాగర్‌బాబు మిత్రులు కూడా పలువురు ఆయనకు బినామీగా ఉన్నారని తెలుస్తుంది. ఇక సున్నిపెంటలోని స్టేట్‌బ్యాంకులో కూడా ఈ విధంగా బినామీ వ్యక్తులకు చెందిన లాకర్లు ఉన్నట్లు సమాచారం.
తవ్విన కొద్దీ..
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన సాగర్‌బాబు అవినీతి వ్యవహారం తవ్వే కొద్దీ బయటికి వస్తోంది. శ్రీశైలంలో బృహత్తర ప్రణాళిక చేపట్టిన పనుల్లో ఆయన భారీగా వాటాలు అందుకున్నారని సమాచారం. అదేవిధంగా ఉద్యోగుల నియామకాల్లోనూ లక్షల రూపాయలు ఆయన వసూలు చేశారని తెలుస్తోంది. దీంతో పాటు దేవస్థానంలో జరిగే ఇంజనీరింగ్ పనుల్లో ఆయనకు వాటా అందితేనే నిధులు మంజూరు అయ్యేవని ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి టెండరు లేకుండా నామినేషన్ మీద పలు పనులను అప్పగించి వాటాలు దండుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు అసలు పనులు చేయకుండానే చేసినట్లుగా చూపి, లక్షల రూపాయాలు కాజేశారని సమాచారం. ఆయన అవినీతి వ్యవహారంలో పాలుపంచుకున్న పలువురు అధికారుల ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించనున్నారు.
Advertisement
Advertisement