అవినీతి కంపు
అవినీతి కంపు
Published Sat, Oct 1 2016 5:06 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
* తూతూ మంత్రంగా మరుగుదొడ్ల నిర్మాణం
* పాతవాటికి రంగులేసి నిధులు బొక్కేశారు..
* కమిషనర్ కన్నెర్ర... చర్యలకు రంగం సిద్ధం ?
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కార్పొరేషన్ అధికారులు మారుతున్నారు... ప్రధానంగా అభివృద్ధి పనుల్లో వీరి అవినీతి తారస్థాయికి చేరింది. చివరికి మరుగుదొ డ్లు నిర్మాణంలో సైతం ఇంజనీరింగ్ అధికారుల అవినీతి పెచ్చుమీరింది.
సాక్షి, గుంటూరు: స్వచ్ఛ గుంటూరులో భాగంగా అక్టోబర్ 2వ తేదీ నాటికి నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉపాసెల్, ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. కార్పొరేషన్ పరిధిలోని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని పది విలీనగ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో కార్పొరేషన్‌కు 7,160 మంది మరుగుదొడ్లు నిర్మించుకొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో కొన్ని దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు 6,886 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 వేలు మంజూరు చేసింది. ఇంజినీరింగ్ అధికారులు ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి అడ్వాన్సు రూపంలో ఏడు వేల నుంచి 10వేల రూపాలయల వరకు తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా కొన్ని ప్రాంతాల్లో తూతూ మంత్రంగా మరుగుదొడ్లు నిర్మించి వదిలేశారు. కొన్ని ప్రాంతాల్లో గుంతలు తవ్వి వదిలేయడం, మరికొన్ని ప్రాంతాల్లో సగం గోడలు నిర్మిం చి వదిలేయడం చేసి నిధులను మింగేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో చాలా ప్రాంతాల్లో పాత మరుగుదొడ్లకు రంగులు వేసి నిధులు బొక్కేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మరుగొదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందన్నదానిపై కమిషనర్ నాగలక్ష్మి ఆగ్రహంగా ఉన్నారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
ఎలా సాధ్యం?
స్వర్ణభారత్‌నగర్, చౌడవరం, పాతగుంటూరు, శివారుప్రాంతాల్లోని పేదలు ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారు. తొలి, మలివిడతల్లో చేసుకున్న దరఖాస్తులను మాత్రమే స్వీకరించిన అధికారులు వీరి దరఖాస్తులను స్వీకరించలేదు. దీంతో సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా గుంటూరు ఎలా సాధ్యపడుతుందో అధికారులే చెప్పాలనే ప్రశ్నలు వస్తున్నాయి.
Advertisement
Advertisement