రెండు రోజుల్లో పూర్తి చేయండి
రెండు రోజుల్లో పూర్తి చేయండి
Published Tue, Sep 27 2016 6:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
మరుగు దొడ్లు నిర్మాణంపై
నగర కమిషనర్ నాగలక్ష్మి ఆదేశాలు
నెహ్రూనగర్: స్వచ్ఛ భారత్ కింద నగరంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగు దొడ్లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ ఎస్. నాగలక్ష్మి అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు విషయమై ఇంజనీరింగ్, ఉపాసెల్ అధికారులతో సోమవారం కౌన్సిల్ హాలులో ఆమె సమావేశమయ్యారు. ముందుగా ఏఈల వారీగా, వార్డుల వారీగా నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల వివరాలను, నిర్మాణాలు పూర్తయిన వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మరుగు దొడ్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. నిర్మాణ సమయంలో వివిధ దశలలో ఆన్‌లైన్‌లో జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి నగరంలో మరుగుదొడ్లు నిర్మాణాలు పెండింగ్ లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు.
కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు..
స్వచ్ఛ గుంటూరు కార్యక్రమం కింద నగరంలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్లు విషయంలో అవకతవకలు జరిగాయి. వచ్చిన దరఖాస్తులను ఉపాసెల్ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. నగరంలో 7,299 మంది మరుగుదొడ్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,321 మందికి మరుగుదొడ్లు కట్టించారు. మరుగుదొడ్లు నిర్మాణానికి మూడు విడతల్లో రూ.15 వేలు చెల్లిస్తారు. కానీ కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మకై కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. మరుగుదొడ్లు నిర్మాణానికి స్థలం గుర్తించి ముందుగా రూ.5 వేలు అడ్వాన్సుల కింద లబ్ధిదారులకు చెల్లించారు. కానీ నగరంలో కొన్ని చోట్ల అనుకూలమైన స్థలం లేకపోవడం, ఇతర కారణాలతో అధికారులు మరుగుదొడ్లు కట్టిం^è లేకపోయారు. ఇలా నగరంలో దాదాపు రూ.10 లక్షల సొమ్మును కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు తిరిగి కార్పొరేషన్‌కు చెల్లించకుండా సొంతానికి వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
జీతాల్లోంచి కట్..
నగర కమిషనర్ వ్యక్తిగత సెలవుపై ఈనెల 9 నుంచి 24వ తేదీ వరకు వెళ్ళడంతో పనులు మందకొడిగా సాగాయి. ఈనెల 25న విధుల్లో చేరిన కమిషనర్ సమావేశం ఏర్పాటు చేయడంతో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. కొన్ని మరుగుదొడ్లు ఇంకా పెండింగ్‌లో ఉండటం, జియో ట్యాగింగ్ చేయకుండా ఉండటాన్ని గమనించిన కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును మంగళవారం సాయంత్రంకల్లా చెల్లించని పక్షంలో జీతాల్లోంచి కట్ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Advertisement
Advertisement