వేసవిలో దొంగలతో జాగ్రత్త | Be careful with the pirates in the summer | Sakshi
Sakshi News home page

వేసవిలో దొంగలతో జాగ్రత్త

Published Thu, Mar 16 2017 2:04 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

వేసవిలో దొంగలతో జాగ్రత్త - Sakshi

వేసవిలో దొంగలతో జాగ్రత్త

తిరుపతి క్రైం: వేసవిలో తీర్థ యాత్రలకు, విహార యాత్రలకు, ఊళ్లకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడుతున్నారు. ఈ నేప«థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

►ఆరుబయట, మిద్దెలపై నిద్రించే వారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటికి రెండు తాళాలు వేసుకోవాలి.
►ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
►బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించకూడదు. ఇంట్లో పడుకున్నా కిటికీలు తెరిచి ఉండే వైపు పడుకోరాదు.
►దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు.
►వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను కట్టేయాలి. ఇంట్లో ఎటువంటి శబ్దం, అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. అలసత్వం ప్రదర్శించరాదు.
►దూరప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి.
►ఇంటిని చూసుకోమని చుట్టుపక్కల వారికి చెప్పి వెళ్లడం మంచిది. అపార్టుమెంట్‌ అయితే వాచ్‌మెన్‌కు చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
►రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడం మంచిదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌లకు తెలపాలి.
►అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
►ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం.
►ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణించేటప్పుడు డబ్బులు చేతి సంచుల్లో, కర్రబ్యాగుల్లో పెట్టరాదు.
►ప్రయాణాల్లో కొత్తవారితో అప్రమత్తంగా ఉండాలి, వారితో పరిచయం పెంచుకోవడం మంచిదికాదు.
►అనుమానాస్పద వాహనాల్లో ప్రయాణించరాదు.
►ఎప్పుడు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌ నెంబర్‌ దగ్గరుంచుకోవడం మంచిది.

చోరీల నియంత్రణకు చర్యలు
వేసవిలో చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నాం. ఈ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్‌ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌ నెంబర్‌ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
– మురళీకృష్ణ, ఈస్టు సబ్‌ డివిజనల్‌ డీఎస్పీ, తిరుపతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement