శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టింది.. | before birth of lard shiva | Sakshi
Sakshi News home page

శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టింది..

Published Fri, Sep 2 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

మాట్లాడుతున్న సుద్దాల అశోక్‌తేజ

మాట్లాడుతున్న సుద్దాల అశోక్‌తేజ

  • కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ

  • ఖమ్మం కల్చరల్‌ : శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టిందని ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. నగరంలోని బడ్జెట్‌ హోటల్‌లో శుక్రవారం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ స్తంభాద్రి ఆధ్వర్యంలో సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘శ్రమకావ్య’ గానం పాఠ్యపుస్తకం విలువ, దాని వెనుక ఉన్న భావాలను తెలియజెపాల్పనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్‌తేజ రచించిన ‘శ్రమకావ్య’ పుస్తకానికి సంబంధించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. శంకరుని రూపాన్ని నేను చూసినప్పుడు ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది.. ఆయన ఒంటిపై పులి చర్మం ఉంటుంది.. అంటే ఆయన చేతిలో ఉన్న ఢమరుకాన్ని, పులి చర్మాన్ని తయారు చేసే వ్యక్తి శ్రమకోర్చి వాటిని తయారు చేశాడు కాబట్టే శంకరుడు వాటిని ధరించగలిగాడు.. అందుకే నేను శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టిందని భావిస్తాను. అలాగే రామాయణం కన్నా ముందు శ్రమయాణం పుట్టిందని చెప్పొచ్చు. శ్రమకావ్యన్ని రచించడానికి నాకు మూడు నెలల సమయం పట్టింది. దానిని నేను అమెరికాలో రెండు పర్యాయాలు నా కుమారుడిని చూసేందుకు వెళ్లినప్పుడు ఎటువంటి అసౌకర్యానికి లోనుకాకుండా ప్రశాంత, తీరిక సమయాల్లో రాశాను. శ్రమలో నిమగ్నమైన శారీరక చలనం నుంచి నాట్యం పుట్టింది.. శ్రమతో మమేకమైన మనిషి అరుపులో నుంచి సంగీతం వచ్చింది. ఈ రెండు అంశాలను తీసుకుని శ్రమకావ్యాన్ని రచించాను. ఆదిమానవుడు నరుడిగా రూపాంతరం చెంది ప్రస్తుతం ఎటువంటి జీవన గమనాన్ని అనుసరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన శ్రమ ఎలా దోపిడీకి గురైంది.. శ్రమ గొప్పతనం ఏమిటనే అంశాలను వివరిస్తూ శ్రముడు(పురుష), శ్రమి(స్త్రీ) అనే రెండు పాత్రలను తీసుకుని రాయడం జరిగింది. సాహితీ వేత్త మువ్వా శ్రీనివాసరావు, సాహితీ సేవాసంస్థ అధ్యక్షుడు ఆనందాచారి, కవి సీతారామ్‌.. ‘శ్రమ’ గొప్పతనాన్ని వివరిస్తూ కావ్యాలను రాసిన ఏకైన వ్యక్తి సుద్దాల అశోక్‌తేజ అని కొనియాడారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజను క్లబ్‌ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ స్తంభాద్రి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో రోటరీ దశాబ్ది ఉత్సవాల కన్వీనర్‌ కురవెళ్ల ప్రవీణ్‌కుమార్, క్లబ్‌ అధ్యక్షుడు వందనపు శ్రీనివాసరావు, కార్యదర్శి వజ్రపు రామ్మోహన్, కోశాధికారి బోజెడ్ల ప్రభాకర్‌రావు, సభ్యులు పాలవరపు శ్రీనివాస్, రవి, నాగేష్, దండ్యాల లక్ష్మణరావు పాల్గొన్నారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement