‘బెల్టు’ తీయాల్సిందే
‘బెల్టు’ తీయాల్సిందే
Published Sat, Apr 15 2017 11:21 PM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM
తాడేపల్లిగూడెం : పేదల ప్రాణాలను బలిగొంటున్న బెల్టు షాపులను తక్షణం మూసివేయాల్సిందేనని, అధికారులు స్పందించకుంటే పోలీసు విధులను నియోజకవర్గంలో తానే నిర్వహిస్తానని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు బెల్టు షాపుల రద్దుపై చాలా స్పష్టంగా ఉన్నారన్నారు. బెల్టు దుకాణాల కారణంగా తమ కుటుంబాలు నాశనమవుతున్నాయని అనేకమంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. బెల్టుషాపులను తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు స్పష్టంగా ఆదేశాలిచ్చామన్నారు. మద్యం మహమ్మారి బారినపడి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో బెల్టు దుకాణాల వల్ల కుటుంబాల ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని తనకు చాలామంది బా«ధితులు వివరించారన్నారు. వీటి నిరోధానికి ఎక్సైజ్ అధికారులు సరైన రీతిలో స్పందించకుంటే నియోజకవర్గంలో బెల్టుషాపుల నిరో«ధానికి తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.
బెల్టు షాపుల వివరాలు తెలపండి
నియోజకవర్గంలో బెల్టు షాపుల వివరాలను తమకు తెలియచేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఏయే ప్రాంతాల్లో మద్యం గొలుసుదుకాణాలు నడుస్తున్నాయో తమ క్యాంపు కార్యాలయంలో వివరాలు తెలియచేయాలన్నారు. మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ యెగ్గిన నాగబాబు. బీజేపీ పట్టణ అ««ధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, ప్రధాన కార్యదర్శి ఐనం బాలకృష్ణ పాల్గొన్నారు.
Advertisement