రాజధాని శంకుస్థాపనకు వీవీఐపీలు
- ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
- అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు ఆహ్వానాలు
- లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వానాలు
- రాష్ట్రంలో ప్రతిపక్ష నేతతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం
హైదరాబాద్ : విజయ దశమి రోజు అక్టోబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 1500 మంది వీవీఐపీలను, వీఐపీలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విజయ దశమి రోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్రానికి చెందిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్రానికి చెందిన న్యాయ మూర్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ప్రతిపక్ష నేతతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్ ప్రధానమంత్రి, జపాన్ ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినప్పటికీ వారు వచ్చే అవకాశం లేదని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాల ప్రధానమంత్రులను ఆహ్వానిస్తే రారని, దీనికి ఒక విధానం ఉంటుందని ఆ అధికారి తెలిపారు. కేంద్ర విదేశీమంత్రిత్వ శాఖ లేదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇతర దేశాల ప్రధానమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాలని, అలా కాకుండా ముఖ్యమంత్రి ఆహ్వానించడం చెల్లదని ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులు శంకుస్థాపన కార్యక్రమానికి రాకపోయినప్పటికీ ఆ దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని ఉన్నతాధికారి తెలిపారు.
రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు గోదావరి పుష్కరాల్లో చేసినట్లు సినిమా చిత్రీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ చిత్రీకరణ కార్యక్రమాన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు అప్పగించాలని సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను కన్సల్టెంట్‌కు అప్పగించనున్నారు.