
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌లో బయోమెట్రిక్
- ప్రతి ఒక్కరూ సమయానికి హాజరుకావాల్సిందే
- ఇష్టారాజ్యానికి బయోమెట్రిక్‌తో చెక్
- తొలిసారిగా ఈ ఏడాది నుంచి అమలు
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్‌లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తొలిసారిగా ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశపెట్టారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ విధానాన్ని అనుసంధానం చేసి అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. వాల్యుయేషన్‌లో నకిలీ అధ్యాపకులు హాజరుకాకుండా ఉండటం, డ్యూటీ ఉన్న వాళ్లు విధులకు సమయానికి వచ్చే విధంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటున్నారు.
ప్రస్తుతం మూడు యంత్రాలు ఏర్పాటు
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ నెల్లూరు నగరంలోని కేఏసీ జూనియర్ కళాశాలలో జరుగుతుంది. ప్రస్తుతం కళాశాలలో ఒక గదిలో మూడు బయోమెట్రిక్ యంత్రాలు బిగించారు. పరికరంలో స్పాట్ వాల్యుయేషన్‌కు హాజరయ్యే అధ్యాపకుల వివరాలను నమోదు చేస్తారు. అధ్యాపకులకు కేటాయించిన నంబరు ఆధారంగా ఆధార్ సంఖ్యను నమోదు చేయగానే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 9.30ల నుంచి 10.30 గంటల లోపు వాల్యుయేషన్‌కు వచ్చే అధ్యాపకులు వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు భోజన విరామం ఉంటుంది. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటలలోపు వేలిముద్ర వేసి బయటకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న కారణంగా 62 మంది అ«ధ్యాపకులతో సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన పేపర్‌ను దిద్దుతున్నారు. ఈనెల 17 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు పూర్తి స్థాయి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది. మరో రెండు రోజుల్లో ఏడు బయోమెట్రిక్ యంత్రాలు రానున్నట్లు ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు.
సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
బయోమెట్రిక్ ఆన్‌లైన్ విధానంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు. సీనియార్టీని లెక్కల్లోకి తీసుకున్న క్రమంలో ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులతో పాటు కాంట్రాక్టు అధ్యాపకులను పరిగణనలోకి తీసుకోవాలి. బయోమెట్రిక్ ఆన్‌లైన్ విధానంలో కాంట్రాక్టు అధ్యాపకులను కలపడంతో సాంకేతిక సమస్య వస్తుందంటున్నారు.
బయోమెట్రిక్ అమలు చేస్తున్నాం
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌లో అక్రమాలు జరగకుండా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. స్పాట్ వాల్యుయేషన్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా బయోమెట్రిక్ విధానం ఉపయోగపడుతుంది. అనుసంధానం చేయడంతో ఉన్నతా«ధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. ృబాబూ జాకబ్, ఆర్‌ఐఓ