
ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బ్లాక్‌మెయిల్
►రూ.6 లక్షలు ఇవ్వాలంటూ యువతికి బెదిరింపులు
►రూ.4 లక్షలు నగదు, రూ.30 వేలు విలువ చేసే సెల్‌ఫోన్ ఇచ్చిన బాధితురాలు
►కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు
నెల్లూరు సిటీ : ఓ యువతితో మూడేళ్లుగా పరిచయం పెంచుకున్న యువకుడు సన్నిహితంగా ఉండే ఫొటోలు తీసి, చివరికి తనకు డబ్బులు కావాలంటూ యువతిని బ్లాక్‌మెయిల్ చేసి నగదు తీసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో మంగళవారం ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వివరాలు మేరకు నెల్లూరు నగరంలోని మహాత్మాగాంధీనగర్‌లో నివాసం ఉండే గపూర్‌బాషా కుమార్తె(22) బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం జ్యోతినగర్ మసీదువీధిలో ఉంటున్న షేక్ అల్లాభక్షుతో పరిచయం ఏర్పడింది. అల్లాభక్షుతో యువతితో సన్నిహితంగా ఉండే ఫొటోలు ఆమెకు తెలియకుండా తీశారు.
అనంతరం ఇటీవల తనకు రూ.6 లక్షలు డబ్బులు కావాలని యువతిని కోరాడు. తన వద్ద అంత నగదు లేదని చెప్పడంతో అల్లాభక్షు తన వద్ద ఉన్న ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. వారం రోజుల్లో నగదు ఇవ్వకుంటే రోజుకు రూ.50 వేలు లెక్కన అధికంగా ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయభ్రాంతురాలైన యువతి ఇంట్లో తెలియకుండా రూ.5,72 లక్షల నగదును బీరువాలో నుంచి తీసింది. సోమవారం యువతిని ఫోన్ ద్వారా తాను చెప్పినట్లు నడుచుకోవాలని సూచించాడు. నిప్పో సెంటర్ వద్ద స్కూటీని నిలిపి అక్కడి నుంచి ఆటోలో గాంధీబొమ్మ వద్దకు రావాలన్నాడు.
ఓ మొబైల్ దుకాణంలో రూ.30 వేలు విలువ చేసే శ్యామ్‌సంగ్ ఫోను కొని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉండే రైల్వేబ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. అక్కడికి చేరుకుని అల్లాభక్షుకు సెల్‌ఫోన్, రూ.4 లక్షలు నగదు ఇచ్చింది. ఫొటోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను అల్లాభక్షు యువతికి ఇచ్చి వెళ్లిపోయాడు. యువతి కుటుంబసభ్యులు ఇంట్లో కనిపించని నగదు విషయమై ఆమె ప్రశ్నించగా జరిగిన విషయం వివరించింది. కుటుంబసభ్యుల సహకారంతో యువతి ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మంగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.