ఇరుపక్షాలు వ్యూహాత్మకంగా..
-
భూసమీకరణ ప్రక్రియపై ఉత్కంఠ
-
భూమి సేకరిస్తామంటున్న పాలకపక్షం
-
రైతుల తరుఫున పోరాటం చేస్తామంటున్న ప్రతిపక్షం
మచిలీపట్నం : మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. పాలకపక్షం అధికారాన్ని ఉపయోగించి రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షాల నాయకులు భూపరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి రైతుల తరఫున పోరాటం చేస్తున్నారు. సెప్టెంబరు 19వ తేదీ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో 33,177 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అప్పటి నుంచి రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
పోటా, పోటీగా సమావేశాలు..
భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం సెప్టెంబరు 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల్లో ఆయా గ్రామాల రైతులు ఏకగ్రీవంగా భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని తీర్మానాలు చేసి ఎంఏడీఏ అధికారులకు అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ భూపరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూములు ఇస్తున్నట్లు ఫారం–3 అందజేస్తే రైతుల నుంచి ప్రభుత్వం భూమి గుంజేసుకుంటుందని మంగళగిరి ఎమ్మెల్యే రామకష్ణారెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, వామపక్షాల నాయకులు వివరించారు. సమావేశంలో రాజధాని ప్రాంతంలో రైతులు ప్రభుత్వంపై పోరాడి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఎలా కాపాడుకున్నారో మంగళగిరి నియోజకవర్గ రైతులతో అవగాహన కల్పించారు. న్యాయనిపుణులతో రైతులకు సలహాలు ఇప్పించారు. దీనికి ధీటుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో పాటు తుళ్లూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులను, రైతులను ఆదివారం మచిలీపట్నం తీసుకువచ్చి భూసమీకరణ ద్వారా రైతులకు చేకూరిన మేలును వివరించే ప్రయత్నం చేశారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం టీడీపీ నిర్వహించిన సమావేశంలో జరగలేదని రైతులే చెబుతున్నారు. తుళ్లూరుకు చెందిన రైతులు వచ్చి భూములు ఇచ్చేయమంటే ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇటీవల ఎంఏడీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భూసమీకరణను ఎలాగైనా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్రను భూసమీకరణను అడ్డుకునే వారిని తరమికి కొడతామని ప్రకటన చేశారు. భూసమీకరణను అడ్డుకునే వారిపై పీడీ యాక్ట్ ద్వారా కేసులు బనాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోదని సమాచారం. తాజాగా పీడీ యాక్ట్ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. దసరా సెలవుల అనంతరం భూసమీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధతం చేస్తామని భూపరిరక్షణ పోరాట కమిటీ నాయకులు చెబుతున్నారు. భూసమీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని రైతులు అంటున్నారు.