అధునాతన సాగుపై పరిశోధనలకు పిలుపు
అధునాతన సాగుపై పరిశోధనలకు పిలుపు
Published Tue, May 2 2017 9:37 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
- ఆర్‌ఏఆర్‌ఎస్‌లో జాతీయస్థాయి సదస్సు విజయవంతం
- 150 మంది పరిశోధన పత్రాల సమర్పణ
- వాతావరణ పరిస్థితులు- పంటల సాగుపై చర్చ
నంద్యాలఅర్బన్: పంటలసాగును లాభసాటిగా మార్చేందుకు పరిశోధనలను విస్తృతం చేయాలని ఆచార్య ఎన్‌జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశో«ధన సంచాలకులు డాక్టర్ ఎన్‌వీ నాయుడు పిలుపునిచ్చారు. ఇందుకోసం అధునాతన పద్ధతుల్లో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. స్థానిక వైఎస్సార్ సెంటినరీ హాలులో మంగళవారం వాతావరణ అనుకూల వ్యవసాయానికి అవసరమైన విధానాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఎన్‌వీ నాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలతో పాటు నేపాల్ దేశం నుంచి 150మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌వీనాయుడు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులను ఇచ్చే పంటలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయాలన్నారు. ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి, పీజీ డీన్ డాక్టర్ వీర రాఘవయ్య మాట్లాడుతూ సహజ వనరులు వ్యవసాయానికి మూలాధారమని, అయితే వాతావరణ మార్పుల వల్ల సహజ వనరులు కూడా మార్పులకు గురవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ బి.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ పంటల్లో అధిక దిగుబడి కోసం అనువైన వాతావరణ పరిస్థితులు, ఎరువుల యాజమాన్యంపై పరిశోధనలు సాగించాలన్నారు. ఏఎన్‌జీఆర్ ఏయూ విశ్రాంత డీన్ డాక్టర్ ఎలమందారెడ్డి, ఏఎన్‌జీఆర్‌ఏయూ పాలక మండలి మాజీ సభ్యులు పోచాబ్రహ్మానందరెడ్డి ప్రసంగించారు. సదస్సులో వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, వాతావరణ మార్పు-నేల, నీరు, ఎరువుల యాజమాన్యం, వాతావరణ పర్యవేక్షణ-ప్రత్యామ్నాయ పంటలు, కలుపు యాజమాన్యం, సమగ్ర వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యాంత్రికీకరణ, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు, విద్యార్థులు పరిశోధన పత్రాలు, పోస్టర్లు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు ఆకట్టుకున్నారు.
Advertisement
Advertisement