టీడీపీ నేతపై కేసునమోదు
టీడీపీ నేతపై కేసునమోదు
Published Wed, Feb 22 2017 11:58 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
- వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో పోస్టు ఫలితం
నంద్యాల: వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో పోస్టు చేసిన కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌పై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ గుణశేఖర్‌బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. టీడీపీ నంద్యాల వాట్సాప్ గ్రూప్‌లో ఓ అశ్లీల వీడియో కలకలం సృష్టించింది. చైర్‌పర్సన్ దేశం సులోచన, కౌన్సిలర్లు శోభారాణి, చాంద్‌బీ, మహబూబ్‌బీ, కన్నాంబ, సుబ్బరాయుడు, భీమునిపల్లి వెంకటసుబ్బమ్మ, కత్తి శంకర్, మధుసాయి, జాకీర్, నబిరసూల్, లక్ష్మినారాయణ, కోఆప్షన్ సభ్యుడు సుధాకర్‌రెడ్డి తదితరులు బుధవారం చైర్‌పర్సన్ చాంబర్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియోపై చర్చించారు. మహిళా కౌన్సిలర్లు మూకుమ్మడిగా వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌పై చర్యలకు పట్టుబట్టారు. ఆ మేరకు చైర్‌పర్సన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
మనుషులు చేసేపని కాదు..
మహిళా కౌన్సిలర్లు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియోను పోస్టు చేయడం మనుషులు చేసే పనే కాదని చైర్‌పర్సన్ దేశం సులోచన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా చైర్‌పర్సన్‌గా ఈ విషయం మాట్లాడటానికి ఇబ్బందిగా ఉందని, తమకే ఇలాంటి అవమానాలు జరిగితే సామాన్య మహిళలకు ఏ విధంగా అండగా నిలబడగలమన్నారు. గౌరవపదమైన హోదాలో ఉన్న గంగిశెట్టి విజయ్‌కుమార్ ఇలాంటి పోస్టు చేయడం తప్పని.. విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. పలువురు మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతున్న అశ్లీల వీడియో వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు...
చైర్‌పర్సన్ దేశం సులోచన, ఆమె వర్గానికి చెందిన కౌన్సిలర్లు గంగిశెట్టి విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని సీఐ గుణశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గంగిశెట్టిపై ఐపీసీ 294, 506, 509, 354డి, ఐటీ యాక్ట్ 66ఏ, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, కేవలం రాజకీయంగా కక్ష సాధింపునకే తప్పుడు కేసు బనాయించారని గంగిశెట్టి విజయ్‌కుమార్ ఆరోపించారు. తాను సెల్‌ఫోన్‌ను ఎక్కడైనా పెట్టినప్పుడు ఇతరులు పోస్టు చేసి ఉండవచ్చని.. ఈ వివాదాన్ని తాను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.
Advertisement