వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు
సాయిరామ్ పార్లర్‌లో బయటపడ్డ వైనం
ఇదేమిటని అడిగిన వారికి నిర్లక్ష్య సమాధానం
జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు
నమూనాలు సేకరించి తీసుకువెళ్లిన అధికారులు
విశాఖపట్నం : ఏం లేకపోయినా ఉండగలం కానీ సమయానికి కడుపు నిండకపోతే మాత్రం తట్టుకోలేం. కోటి విద్యలు కూటి కోసమేనని అందుకే అన్నారు. అలాంటి ఆహారాన్ని అందించే వారిని ఎంతగానో గౌరవిస్తాం. ఈ కోవలోనే నగరంలో ప్రముఖ హోటల్‌గా పేరుగాంచి, నిత్యం రద్దీగా ఉండే సాయిరామ్ పార్లర్‌లో నిర్వాహకుల నిర్లక్ష్యం సోమవారం వెలుగు చూసింది. పురుగుల బిర్యానీని కస్టమర్లకు అందిస్తున్న వైనం బయటపడింది. బాధితుడు అరుణ్ ‘సాక్షి’కి ఆ వివరాలను అందించారు.
ఇదీ జరిగింది : అప్పటికే మధ్యాహ్న భోజన సమయం దాటిపోతోంది. సమయం 3.30 గంటలైంది. బాగా ఆకలిమీద ఉన్న కంచరపాలెం ప్రాంతానికి చెందిన జి.అరుణ్‌బాబు డైమండ్ పార్కు దగ్గరున్న సాయిరామ్ పార్లర్‌కు వెళ్లారు. వెజ్ బిర్యానీ, పెరుగు ఆవడ తీసుకున్నారు. పెరుగు ఆవడ ముందుగా తిని, తర్వాత వెజ్ బిర్యానీ తీసుకున్నారు. పచ్చి మిరపకాలయలు తినడం ఇష్టం లేక వాటిని ముందే ఏరి పక్కన పెట్టేశాడు. రెండు స్పూన్ల బిర్యానీ తినే సరికి పచ్చగా ఏదో కనిపించింది. పచ్చిమిరపకాయలు తీసేశాక ఇదేమిటని దగ్గరగా చూస్తే గుండె ఝల్లుమంది. వాంతి వచ్చినంత పనైంది.ప్లేటులో ఉన్నది పచ్చి మిరపకాయ కాదు పచ్చ గొంగళి పరుగు.
నూనెలో బాగా వేగిందో, బిర్యానీలో ఉడికిందో తెలియదు గానీ చనిపోయి ఉంది. దానిని చూడగానే అరుణ్ తనను తాను సముదాయించుకుని సరఫరా చేసిన వారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. వారు చాలా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ, ఆ ప్లేటు పక్కన పెట్టేసి మరోటి తీసుకోమన్నారు. ఈ విషయం హోట ల్ యజమానికి తెలి యాలని, ఆయనను పిలిపించమని అరుణ్ పట్టుబట్టాడు. దాదాపు గంట న్నర తర్వాత హోటల్ నిర్వాహకులు ఆయన వద్దకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడేం చేయమంటావ్, నీకు చేతనైంది చేసుకో అని చెప్పి వెళ్లిపోయారు. నిర్వాహకుల సమాధానం, వారి తీరు చూసిన తర్వాత అరుణ్‌కు ఆన్‌లైన్‌లో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఫోన్ నెంబర్ సంపాధించి ఆయనకు ఫోన్ చేశారు.
విషయం తెలుసుకున్న కమిషనర్ పరిశీలించాల్సిందిగా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సిఎంహెచ్‌ఓ) డాక్టర్ ఎ.హేమంత్‌ను ఆదేశించారు. ఆయన హుటాహుటిన దగ్గరలో ఎవరున్నారని ఆరాతీస్తే శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి ఉన్నారని తెలియడంతో వెంటనే సాయిరామ్ పార్లర్‌కు వెళ్లి విషయం ఏమిటో తెలుసుకోమని ఆయనకు చెప్పారు. వెంటనే కృష్ణమూర్తి వెళ్లి అరుణ్‌ను కలిశారు. బిర్యానీ ప్లేటును పరిశీలించి దానిలో ఉన్న గొంగళి పురుగును కూడా చూశారు. వెంటనే ఆ ఆహారాన్ని డబ్బాలో సీజ చేశారు. అరుణ్ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కాగా ఈ ఉదంతంపై స్పందించేందుకు హాటల్ సిబ్బంది నిరాకరించగా యజమాని ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. అరుణ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి, ఆహారాన్ని పరీక్షించిన అనంతరం హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటా మని సిఎంహెచ్‌ఓ హేమంత్ ‘సాక్షి’కి వెల్లడించారు.