‘బతుకమ్మ’ నిర్వహణపై భిన్నాభిప్రాయాలు
–రసాభాసాగా మారిన సమావేశం
– బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుకు నిర్ణయం
–ఉత్సవ కమిటీ ఏర్పాటు
కోదాడఅర్బన్: బతుకమ్మ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకుగాను మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ మహిళా సంఘాలు, వార్డు కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసాగా మారింది. భిన్నాభిప్రాయాల మధ్య సాగిన ఈ సమావేశం చివరకు వాగ్వాదాలు, అరుపులతో హోరెత్తి మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశాన్ని తలపించింది. బతుకమ్మ పండుగను గతంలో మాదిరిగా ఒకేచోట కాకుండా పట్టణంలోని మహిళల సౌకర్యం కోసం వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించాలని కొందరు ప్రతిపాదించగా, మరికొందరు దానిని వ్యతిరేకించారు. పండుగ నిర్వహణకు వచ్చే నిధులను వార్డుల వారిగా పంచిఇవ్వాలని కొందరు కోరగా, తమకు నిధులతో సంబంధం లేదని తమ వార్డులలో తామే ఉత్సవాలను నిర్వహించకుంటామని తెలిపారు. ఈ వివాదంలో చివరకు కమిషనర్ జోక్యం చేసుకుని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఉత్సవాలకు మాత్రమే మున్సిపాలిటీ పరంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
భిన్నాభిప్రాయాల నడుమ సాగిన సమావేశం.....
చైర్‌పర్సన్ వంటిపులి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, మహిళా సంఘాలు, సమభావన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు వార్డులకు చెందిన మహిళలు మాట్లాడుతూ ఈ దఫా ఉత్సవాలను తమ వార్డులోనే నిర్వహించేందుకు నిర్ణయించామని చైర్‌పర్సన్‌కు తెలిపారు. అలాగే ఉత్సవాలకు మున్సిపల్ అధికారులు రాయితీపై పూలు సరఫరా చేయాలని కోరారు. అనంతరం చైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ ఉత్సవాలను ఒకేచోట నిర్వహిస్తే పండుగ వాతావరణం నెలకొంటుందని, నిర్వహణాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు జనరల్‌ఫండ్ నిధులు కేటాయిస్తున్నందున కొన్ని వార్డుల్లో నిర్వహించే ఉత్సవాలకు మున్సిపాలిటీ పరంగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీనికి వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్, కౌన్సిలర్లు ఉప్పగండ్ల సరోజ, షఫీలు తమ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కౌన్సిలర్ ఖాజాగౌడ్,టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి గట్ల కోటేశ్వరరావులు దీనిని వ్యతిరేకించడంతో వారికి మిగిలిన కౌన్సిలర్ల మధ్య చాలాసేపు వివాదం నడిచింది. చివరకు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఉత్సవాలకు మున్సిపాలిటీ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలపడంతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నాయకులు నూనె సులోచన, కుక్కడపు బాబు, బెలిదె అశోక్, పలు మహిళా సంఘాల, సమభావన సంఘాల సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఉత్సవ కమిటీ ఏర్పాటు..
బాలుర ఉన్నత పాఠశాలలో ఉత్సవాల నిర్వహణకు గాను సమావేశం అనంతరం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షురాలిగా చైర్‌పర్సన్ వంటిపులి అనిత, గౌరవ సలహాదారులిగా నూనె సులోచన, ఉపాధ్యక్షులుగా పబ్బా గీత, నాగుబండి నళిని, కారంపూడి రమాదేవి, ఇమ్మడి భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా యాదా రాణి, చందా నిర్మల, తూము శాంత, పండు పద్మ, బొగ్గారపు రేఖారాణి, ఓరుగంటి రమాదేవి, పిట్టల భాగమ్మ. చింతా కెజ్జమ్మలతో పాటు మహిళ వార్డు కౌన్సిలర్లు, టీఎల్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులను సభ్యులుగా నియమించారు.