కేంద్రం మోసం చేస్తుంటే బాబు నిలదీయరేం?
• 36 మంది ఎంపీలు ఉద్యమంచేస్తే హోదా ఇవ్వరా..
• హోదారాని రోజు ప్రజలే కసితో పార్టీలకు బుద్ధి చెబుతారు
• ప్రత్యేక హోదా సాధన పోరాట సభలో చలసాని శ్రీనివాస్
చీరాల: తాము అధికారంలోకి వస్తే విభజన వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక హోదా కుదరదు ప్యాకేజీనే ఇస్తామని తేల్చి చెబుతోందని ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడని ప్రశ్నించారు. సోమవారం చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కువద్ద ప్రత్యేక హోదా సాధన పోరాట ప్రధమ మహాసభ జరిగింది.
మహాసభ కన్వీనర్ బోయిన వెంకటేశ్వర్లు అశ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో చలసాని ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేని దీనావస్థలో మనం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఢిల్లీలో తలవంచడం వలనే తెలుగువాడి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టినట్లు అవుతుందన్నారు. తెలుగు జాతి చేతకాని జాతికాదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని చివరికి చెంబులో మట్టితెచ్చి తెలుగు వారి నోట్లో మట్టి కొట్టాడని విమర్శించారు.
స్వప్రయోజనాలే పాలకులకు ప్రధానం..
36 మంది ఉన్న ఎంపీలు ఢిల్లీలో ఒక్కడిగా విజృంభిస్తే హోదా వచ్చి తీరుతుందని చలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో సుజనా చౌదరి వ్యాపారాలు చేసుకుంటే అశోక్ గజపతిరాజు మాత్రం విమానాలలో తిరుగుతున్నాడని పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో గొంతెత్తి అడిగిన వెంకయ్యనాయుడు మోదీ జపం చేస్తూ ఎడారి పాటలు పాడుతున్నాడని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పడం చూస్తే ఈ రాష్ట్రం ఏమై పోయినా వారికి రాజకీయ స్వప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా స్పష్టమవుతోందన్నారు.
హోదానే అభివృద్ధి మార్గం..
కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన దుగరాజపట్నం పోర్టుకు నయాపైసా నిధులు కేటాయించకుండా తమిళనాడులో మాత్రం మూడో పోర్టుకు రూ.20 వేల కోట్లు నిధులు మంజూరు చే శారని, కేవలం తమిళులలో ఉన్న ఐక్యత వలనే ఇది సాధ్యపడింద ని చలసాని చెప్పారు. ఇలాంటి దారుణాలను కొన్ని మీడియాలు అసలు బయటకు తేకపోవడం అన్యాయమన్నారు. అఖిల పక్షం కమిటీ సమావేశం వేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఎందుకు తేవడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
భావి తరాలు బతికి బట్ట కట్టాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, దీనిపై ఎవరికైనా సందేహాలుంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో విభజన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోవడం అన్యాయమన్నారు. హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలందరూ పన్నులు చెల్లించడం నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ మహాసభకు ప్రత్యేక హోదా పోరాట సమితి సభ్యులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకుడు కె. వెంకట్రావు, ఏఐటియుసి కార్యదర్శి ఎ. బాబురావు, సిఐటియుసి కార్యదర్శి ఎన్.బాబురావు, తదితరలు పాల్గొన్నారు. సభకు ముందుగా విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.