Calasani Srinivas
-
కేంద్రం మోసం చేస్తుంటే బాబు నిలదీయరేం?
• 36 మంది ఎంపీలు ఉద్యమంచేస్తే హోదా ఇవ్వరా.. • హోదారాని రోజు ప్రజలే కసితో పార్టీలకు బుద్ధి చెబుతారు • ప్రత్యేక హోదా సాధన పోరాట సభలో చలసాని శ్రీనివాస్ చీరాల: తాము అధికారంలోకి వస్తే విభజన వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక హోదా కుదరదు ప్యాకేజీనే ఇస్తామని తేల్చి చెబుతోందని ఏపీ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడని ప్రశ్నించారు. సోమవారం చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కువద్ద ప్రత్యేక హోదా సాధన పోరాట ప్రధమ మహాసభ జరిగింది. మహాసభ కన్వీనర్ బోయిన వెంకటేశ్వర్లు అశ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో చలసాని ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేని దీనావస్థలో మనం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఢిల్లీలో తలవంచడం వలనే తెలుగువాడి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టినట్లు అవుతుందన్నారు. తెలుగు జాతి చేతకాని జాతికాదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని చివరికి చెంబులో మట్టితెచ్చి తెలుగు వారి నోట్లో మట్టి కొట్టాడని విమర్శించారు. స్వప్రయోజనాలే పాలకులకు ప్రధానం.. 36 మంది ఉన్న ఎంపీలు ఢిల్లీలో ఒక్కడిగా విజృంభిస్తే హోదా వచ్చి తీరుతుందని చలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో సుజనా చౌదరి వ్యాపారాలు చేసుకుంటే అశోక్ గజపతిరాజు మాత్రం విమానాలలో తిరుగుతున్నాడని పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో గొంతెత్తి అడిగిన వెంకయ్యనాయుడు మోదీ జపం చేస్తూ ఎడారి పాటలు పాడుతున్నాడని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పడం చూస్తే ఈ రాష్ట్రం ఏమై పోయినా వారికి రాజకీయ స్వప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా స్పష్టమవుతోందన్నారు. హోదానే అభివృద్ధి మార్గం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన దుగరాజపట్నం పోర్టుకు నయాపైసా నిధులు కేటాయించకుండా తమిళనాడులో మాత్రం మూడో పోర్టుకు రూ.20 వేల కోట్లు నిధులు మంజూరు చే శారని, కేవలం తమిళులలో ఉన్న ఐక్యత వలనే ఇది సాధ్యపడింద ని చలసాని చెప్పారు. ఇలాంటి దారుణాలను కొన్ని మీడియాలు అసలు బయటకు తేకపోవడం అన్యాయమన్నారు. అఖిల పక్షం కమిటీ సమావేశం వేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఎందుకు తేవడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. భావి తరాలు బతికి బట్ట కట్టాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, దీనిపై ఎవరికైనా సందేహాలుంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో విభజన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోవడం అన్యాయమన్నారు. హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలందరూ పన్నులు చెల్లించడం నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ మహాసభకు ప్రత్యేక హోదా పోరాట సమితి సభ్యులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, డాక్టర్ ఎ.శ్రీనివాసరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకుడు కె. వెంకట్రావు, ఏఐటియుసి కార్యదర్శి ఎ. బాబురావు, సిఐటియుసి కార్యదర్శి ఎన్.బాబురావు, తదితరలు పాల్గొన్నారు. సభకు ముందుగా విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
‘టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి’
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి, యువజన, ప్రజా గర్జనకు ఆయన విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర ఎంపీలంతా ప్రధాని ఇంటి వద్ద దీక్షలు చేయాలని, హోదా ఆవశ్యకత , ఏపీ ప్రజల డిమాండ్ మోదీకి తెలిసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి విద్యార్థులు ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేసే ముష్టి అవసరం లేదని, పూర్తి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు చెప్పింది ఇక చాలని, విభజన హామీలు అమలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. -
ఇంత నిర్లక్ష్యమా..!
= ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేసినా పట్టించుకోని కేంద్రం = తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలి = 24న సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశం = తెలంగాణలో 65 శాతం మంది సమైక్యాంధ్రకు మద్దతు = ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు బెంగళూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం 66 రోజుల పాటు ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించ లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు దుయ్యబట్టారు. సమైక్యాంధ్రకు పలు పార్టీల మద్దతు కోరే ప్రయత్నాల్లో భాగంగా జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడను కలవడానికి బుధవారం ఆయనిక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై శాసన సభ ముసాయిదా బిల్లు వచ్చినప్పుడు సీమాంధ్రలోని 13 జిల్లాల శాసన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఈ నెల 24న సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తదుపరి ఉద్యమ స్వరూపంపై చర్చిస్తామన్నారు. తెలంగాణలో 65 శాతం మంది సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో విభజన వాదం ఊపందుకుంటుంది : చలసాని శ్రీనివాస్ ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం తెలంగాణను ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా విభజన వాదం ఊపందుకుంటుందని హెచ్చరించారు. కర్ణాటకలో ఎప్పటి నుంచో కూర్గ్ ల్యాండ్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందని గుర్తు చేశారు. కనుక కన్నడ సోదరులు సమైక్య వాదానికి మద్దతు పలకడం ద్వారా విభజనకు తాము వ్యతిరేకులమని తేటతెల్లం చేయాలని కోరారు. జీతాలు తీసుకోకుండా... సీమాంధ్రలో 66 రోజుల పాటు రూ. 2,700 కోట్ల జీతాలు తీసుకోకుండా అన్ని శాఖల ఉద్యోగులు ఉద్యమాలు చేశారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. సీమాంధ్రలోని ప్రజలు పూర్తి స్థాయిలో తమ ఉద్యమానికి మద్దుతు తెలిపారని అన్నారు. డిసెంబరులో పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో కొన్ని వేల మంది ఢిల్లీ వెళ్లి నిరసనలు వ్యక్తం చేయనున్నారని వెల్లడించారు. ప్రజలు మనోభావాలను దెబ్బ తీసే విధంగా కేంద్ర వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెగని కావేరి జగడం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కావేరి చిచ్చు రగులుతూనే ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గంగప్ప తెలిపారు. కావేరి నీటి పంపంకంపై ఏర్పాటు చేసిన కమిటీలో పని చేశానని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దీనిపై ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భవిస్తే తెలుగు వారి మధ్య చిచ్చు రగిలే అవకాశాలు లేకపోలేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు చిరంజీవి రెడ్డి, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి, సీపీ బ్రౌన్ సేవా సమితి అధ్యక్షుడు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి, ప్రవాసాంధ్ర ప్రముఖులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, ముఖర్జీ, గురవయ్య, ప్రతాప్, హలసూరు విజయ కుమారి, కోటేశ్వరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అవాస్తవాల పునాదులపై వేర్పాటువాదం
చోడవరం, న్యూస్‌లైన్ : విభజనపై వెనక్కు తగ్గకపోతే సోనియా గాంధీ ఇల్లు ముట్టడించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వాస్తవాల పునాదులపై ఉద్యమం సాగాలి తప్ప రాజకీయ స్వలాభం కోసం కాకూడదన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం సమైక్యాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్యాంధ్ర లక్ష గళ గర్జనసభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఐక్యవేదిక కన్వీనర్ కేఎల్‌ఎన్‌వీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ లాంటి స్వార్ధ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఉద్యమాలు రాకూడదన్నారు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసి తెలంగాణ వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్నది వందల ఏళ్ల నుంచి పెద్దల ఆకాంక్ష అన్నారు. రాష్ర్ట విభజనకు కేసీఆర్‌లా సెలైన్ బాటిళ్ల దీక్షలు చేయలేదని, అంకిత భావంతో కూడిన తెలుగు ప్రజల ఐక్యత కోసం నాడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దీక్ష చేసి అమరులయ్యారన్నారు. సీమాంధ్ర ప్రజల రక్తమాంసాలతో హైదరాబాద్ ఏర్పడిందని, ఈ మహానగరం ఎవరి సొత్తూ కాదని అన్నారు. అమరావతి స్థూపంపై ఉన్న చిహ్నం తెలుగు జాతి సంస్కృతి ఐక్యతకు దేశంలోనే గుర్తింపు పొందిందని, అంతటి గొప్ప చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాన్ని విభజించడం తగదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో అమాయకులని, ఇక్కడి విద్యుత్ విభాగం పరోక్షంగా అదనపు భారం వేసి బిల్లుల రూపంలో వసూలు చేసినా తెలుసుకోలేని అమాయకులని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ కుతంత్ర రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఏదో రోజు తెలుసుకుని అతనికి గోరీ కట్టడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని, తెలుగు వాళ్లంతా అన్నదమ్ములుగా ఉన్నారే తప్ప ఎవరూ విభజన కోరుకోవడం లేదన్నారు. విజయనగరం నుంచి తెలంగాణ వచ్చిన కేసీఆర్ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ర్ట యువజన జేఏసీ అధ్యక్షుడు ఆడారి కిషోర్ మాట్లాడుతూ సోనియా గాంధీ రాజకీయ స్వార్ధం కోసం విభజనకు పూనుకొన్నారన్నారు. తెలుగు వారి మనోభావాలను అర్థం చేసుకోలేదన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆగ్రహిస్తే టీఆర్ఎస్ భవనాన్ని కూకటివేళ్లతో పెకళిస్తామని హెచ్చరించారు. మ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు స్పీకర్ఫార్మట్లో రాజీనామాలు చేసి నేరుగా ఉద్యమంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు ముంగా వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ సిబ్బంది సంఘం అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, జిల్లా ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఈశ్వరరాజు, విశాలాంధ్ర ఉపాధ్యాయుల ఉద్యమ నాయకుడు సింహాద్రప్పడు, ఉత్తరాంధ్ర మహిళా ఉపాధ్యాయుల సంఘం నాయకురాలు ఎం.నీలావతి, జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టాలి అనకాపల్లి రూరల్: రాష్ట్ర అసెంబ్లీని సమావేశ పరిచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టాలని తద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. గవరపాలెంలోని ఆడారి కిశోర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ సీమాంధ్రలోని పార్లమెంట్ సభ్యులందరూ రాష్ట్రపతి వద్దకు వెళ్లి విభజనకు వ్యతిరేకంగా పత్రాలు అందజేయాలన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్, ఆడారి కిషోర్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యుడు కె.ఎన్.వి. సత్యనారాయణ, దూలం గోపి పాల్గొన్నారు.