ఇంత నిర్లక్ష్యమా..! | I ignored ..! | Sakshi
Sakshi News home page

ఇంత నిర్లక్ష్యమా..!

Published Thu, Nov 21 2013 2:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

I ignored ..!

= ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేసినా పట్టించుకోని కేంద్రం
 = తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలి
 = 24న సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశం
 = తెలంగాణలో 65 శాతం మంది సమైక్యాంధ్రకు మద్దతు
 = ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు

బెంగళూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం 66 రోజుల పాటు ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించ లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు దుయ్యబట్టారు. సమైక్యాంధ్రకు పలు పార్టీల మద్దతు కోరే ప్రయత్నాల్లో భాగంగా జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడను కలవడానికి బుధవారం ఆయనిక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై శాసన సభ ముసాయిదా బిల్లు వచ్చినప్పుడు సీమాంధ్రలోని 13 జిల్లాల శాసన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఈ నెల 24న సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తదుపరి ఉద్యమ స్వరూపంపై చర్చిస్తామన్నారు. తెలంగాణలో 65 శాతం మంది సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు.
 
 అన్ని రాష్ట్రాల్లో విభజన వాదం ఊపందుకుంటుంది : చలసాని శ్రీనివాస్

 ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం తెలంగాణను ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా విభజన వాదం ఊపందుకుంటుందని హెచ్చరించారు. కర్ణాటకలో ఎప్పటి నుంచో కూర్గ్ ల్యాండ్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందని గుర్తు చేశారు. కనుక కన్నడ సోదరులు సమైక్య వాదానికి మద్దతు పలకడం ద్వారా విభజనకు తాము వ్యతిరేకులమని తేటతెల్లం చేయాలని కోరారు.
 
 జీతాలు తీసుకోకుండా...
 
 సీమాంధ్రలో 66 రోజుల పాటు రూ. 2,700 కోట్ల జీతాలు తీసుకోకుండా అన్ని శాఖల ఉద్యోగులు ఉద్యమాలు చేశారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. సీమాంధ్రలోని ప్రజలు పూర్తి స్థాయిలో తమ ఉద్యమానికి మద్దుతు తెలిపారని అన్నారు.
 
 డిసెంబరులో పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో కొన్ని వేల మంది ఢిల్లీ వెళ్లి నిరసనలు వ్యక్తం చేయనున్నారని వెల్లడించారు. ప్రజలు మనోభావాలను దెబ్బ తీసే విధంగా కేంద్ర వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఎడతెగని కావేరి జగడం

 తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కావేరి చిచ్చు రగులుతూనే ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గంగప్ప తెలిపారు. కావేరి నీటి పంపంకంపై ఏర్పాటు చేసిన కమిటీలో పని చేశానని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దీనిపై ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భవిస్తే తెలుగు వారి మధ్య చిచ్చు రగిలే అవకాశాలు లేకపోలేదని ఆయన  హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు చిరంజీవి రెడ్డి, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి, సీపీ బ్రౌన్ సేవా సమితి అధ్యక్షుడు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి, ప్రవాసాంధ్ర ప్రముఖులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, ముఖర్జీ, గురవయ్య, ప్రతాప్, హలసూరు విజయ కుమారి, కోటేశ్వరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement