చోడవరం, న్యూస్‌లైన్ : విభజనపై వెనక్కు తగ్గకపోతే సోనియా గాంధీ ఇల్లు ముట్టడించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వాస్తవాల పునాదులపై ఉద్యమం సాగాలి తప్ప రాజకీయ స్వలాభం కోసం కాకూడదన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం సమైక్యాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్యాంధ్ర లక్ష గళ గర్జనసభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు.
ఐక్యవేదిక కన్వీనర్ కేఎల్‌ఎన్‌వీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ లాంటి స్వార్ధ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఉద్యమాలు రాకూడదన్నారు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసి తెలంగాణ వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలన్నది వందల ఏళ్ల నుంచి పెద్దల ఆకాంక్ష అన్నారు.
రాష్ర్ట విభజనకు కేసీఆర్‌లా సెలైన్ బాటిళ్ల దీక్షలు చేయలేదని, అంకిత భావంతో కూడిన తెలుగు ప్రజల ఐక్యత కోసం నాడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దీక్ష చేసి అమరులయ్యారన్నారు. సీమాంధ్ర ప్రజల రక్తమాంసాలతో హైదరాబాద్ ఏర్పడిందని, ఈ మహానగరం ఎవరి సొత్తూ కాదని అన్నారు. అమరావతి స్థూపంపై ఉన్న చిహ్నం తెలుగు జాతి సంస్కృతి ఐక్యతకు దేశంలోనే గుర్తింపు పొందిందని, అంతటి గొప్ప చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాన్ని విభజించడం తగదన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో అమాయకులని, ఇక్కడి విద్యుత్ విభాగం పరోక్షంగా అదనపు భారం వేసి బిల్లుల రూపంలో వసూలు చేసినా తెలుసుకోలేని అమాయకులని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ కుతంత్ర రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఏదో రోజు తెలుసుకుని అతనికి గోరీ కట్టడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని, తెలుగు వాళ్లంతా అన్నదమ్ములుగా ఉన్నారే తప్ప ఎవరూ విభజన కోరుకోవడం లేదన్నారు. విజయనగరం నుంచి తెలంగాణ వచ్చిన కేసీఆర్ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
రాష్ర్ట యువజన జేఏసీ అధ్యక్షుడు ఆడారి కిషోర్ మాట్లాడుతూ సోనియా గాంధీ రాజకీయ స్వార్ధం కోసం విభజనకు పూనుకొన్నారన్నారు. తెలుగు వారి మనోభావాలను అర్థం చేసుకోలేదన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆగ్రహిస్తే టీఆర్‌ఎస్ భవనాన్ని కూకటివేళ్లతో పెకళిస్తామని హెచ్చరించారు. మ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు స్పీకర్‌ఫార్మట్‌లో రాజీనామాలు చేసి నేరుగా ఉద్యమంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు ముంగా వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ సిబ్బంది సంఘం అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, జిల్లా ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఈశ్వరరాజు, విశాలాంధ్ర ఉపాధ్యాయుల ఉద్యమ నాయకుడు సింహాద్రప్పడు, ఉత్తరాంధ్ర మహిళా ఉపాధ్యాయుల సంఘం నాయకురాలు ఎం.నీలావతి, జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.
రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టాలి
అనకాపల్లి రూరల్: రాష్ట్ర అసెంబ్లీని సమావేశ పరిచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టాలని తద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. గవరపాలెంలోని ఆడారి కిశోర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ సీమాంధ్రలోని పార్లమెంట్ సభ్యులందరూ రాష్ట్రపతి వద్దకు వెళ్లి విభజనకు వ్యతిరేకంగా పత్రాలు అందజేయాలన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్, ఆడారి కిషోర్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యుడు కె.ఎన్.వి. సత్యనారాయణ, దూలం గోపి పాల్గొన్నారు.
అవాస్తవాల పునాదులపై వేర్పాటువాదం
Published Thu, Sep 26 2013 1:52 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement