
హోదా’పై నయవంచన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హోదా సాధన సమితి నేతల ధ్వజం
అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నయవంచనకు పాల్పడ్డాయని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌లు తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ‘ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి’ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్‌లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెబితే...అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని డిమాండ్ చేయడాన్ని గుర్తు చేశారు.
రాష్ర్టంలో చంద్రబాబు మరో అడుగు ముందుకేసి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారని, మరి ఈరోజు వెంకయ్య, చంద్రబాబు ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. మధు మాట్లాడుతూ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతుంటే అభివృద్ధిని చూసి వస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. మాట వినని కేంద్రానికి తమ మద్దతు ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రజలతో కలసి ఉద్యమించాలని చంద్రబాబుకు సూచించారు. చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు నిరుద్యోగులకు చెప్పిన చంద్రబాబు... ఈరోజు ఆయన మాత్రమే జాబు తెచ్చుకుని నిరుద్యోగుల్ని అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలోని ఎంపీలందరూ ప్రధాని నరేంద్రమోదీ నివాసం ఎదుట ధర్నా చేయాలని సూచించారు.