సాక్షి, విజయవాడ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రహస్యంగా కలవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్నామని బయటకు చెబుతూ, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రత్యేక హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు : చలసాని
ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ఓ వైపు ప్రత్యేక హోదా అంటూనే మరోవైపు చర్చలు జరపడమేంటని ఆయన ప్రశ్నించారు. హోదాపై టీడీపీ మూడు సార్లు మాట మార్చిందని ఆయన గుర్తుచేశారు. హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను అర్ధాంతరంగా ముగిస్తే ఆ రోజును చీకటి దినంగా పాటిస్తామని అన్నారు. ఈ నెల 28వ తేదీన విద్యార్థి సంఘాలతో, యువజన నేతలతో సమావేశమై జేఏసీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. జేపీసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, కర్ణాటకలో ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేలా అక్కడికి వెళ్లి పని చేస్తామని ఆయన తెలిపారు.
టీడీపీ ముసుగులో గుద్దులాట మానాలి : మధు
ఓ వైపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతున్నారు, మరోవైపు సుజనా చౌదరి, జైట్లీతో చర్చలు జరుపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ముసుగులో గుద్దులాట విధానాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు.
చంద్రబాబు చేతకానితనం వల్లే : రామకృష్ణ
చంద్రబాబు చేతకానితనం వల్లే ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో ప్రత్యేక హోదా వద్దని చెప్పింది చంద్రబాబే, ప్యాకేజీ పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్లు మంతనాలతో కాలం గడిపారని, ఇప్పుడు మళ్లీ సుజనా చేత జైట్లీతో చర్చలు జరిపించడం టీడీపీ అవకాశవాదానికి నిదర్శనం అని విమర్శించారు. సుజనా చౌదరి సొంతంగా చర్చలు జరపలేదని, చంద్రబాబు చెబితెనే ఆయన చర్చలు జరిపారని అన్నారు. మోడీ అంటే చంద్రబాబుకు భయం అందుకే మళ్లీ చర్చలు జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో పోరాటానికి కలిసిరావాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment