మంత్రి పదవి లేదు.. భూమి తీసుకో! | Chandrababu cool Pathivada Narayanaswamy Naidu | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి లేదు.. భూమి తీసుకో!

Published Sun, Apr 10 2016 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

మంత్రి పదవి లేదు.. భూమి తీసుకో!

మంత్రి పదవి లేదు.. భూమి తీసుకో!

మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ
ఆయన్ను బుజ్జగించే యత్నంలో భాగంగా ఆయన సృష్టించిన కంపెనీకి 17.67 ఎకరాల కేటాయింపు
జాతీయ రహదారి సమీప భూములు కారుచౌకగా కట్టబెట్టిన వైనం
బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలు
కేవలం రూ.6 లక్షలకే పతివాడ కంపెనీకి కేటాయించిన బాబు సర్కారు

 
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడ్ని బుజ్జగించే చర్యల్లో భాగంగా ఆయన సృష్టించిన కంపెనీకి కారుచౌకగా భూములు కట్టబెట్టిన వైనమిది. ఇందుకోసం నిబంధనలను సైతం తోసిరాజనడం గమనార్హం. కనీసం ఎస్టాబ్లిష్ కాని ఫార్మా కంపెనీకి కారుచౌకగా 17.67 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కేటాయించారు. ఇద్దరు వ్యక్తుల పేరుతో ఏడాదిక్రితం రిజిస్ట్రేషన్ చేసిన ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి ఎకరా రూ.6 లక్షల వంతున ధారాదత్తం చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షలు పలికే భూమిని కట్టబెట్టారు. ఇప్పుడిది తీవ్ర విమర్శలకు తావిస్తోంది.  

సీనియర్ అయినా గుర్తింపు లేదని ఆదినుంచీ అలక...  
ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న పతివాడ నారాయణస్వామి నాయుడు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆయనకు మొండిచేయి ఎదురైంది. సీనియరైన ఆయన్ను కాదని పొరుగు జిల్లాకు చెందిన కిమిడి మృణాళినికి బాబు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో పతివాడ నిరాశ చెందారు. అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమేగాక బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కారు. టీటీడీ బోర్డు, లెజిస్లేటివ్ కమిటీల్లో చోటు కల్పించినా ఆయన సంతృప్తి చెందలేదు. చంద్రబాబు ఇచ్చిన పదవుల్ని తిరస్కరించారు.
 
చకచకా కదిలిన ఫైలు
అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో.. దరఖాస్తు చేయడమే తరువాయి రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన కదిలారు. కొవ్వాడ గ్రామస్తులనుంచి అభ్యంతరం రాకుండా తీర్మానం చేయించారు. అప్పటి పూసపాటిరేగ తహశీల్దార్ ఫైలును చకచకా కదిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.6 లక్షలు చొప్పున ధర నిర్ణయించేశారు. ఆ వెంటనే కలెక్టరేట్, ఆర్డీవోకు పంపించారు. అంతా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. గతేడాది ఏప్రిల్‌లో సీసీఎల్‌ఎ(చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్)కు పంపించారు. అక్కడా ఎమ్మెల్యే పైరవీ చేయడంతోపాటు ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ లెటర్ రాశారు. సీఎం సానుకూలత తెలిపారు. ఫైలు కేబినెట్ వద్దకెళ్లింది. ఇటీవల ఆమోదం కూడా తెలిపింది. ఈ నెల 4న కేటాయింపులు చేస్తూ ప్రత్యేక జీవో కూడా జారీఅయింది.
 
ఎస్టాబ్లిష్ కాకపోయినా...
సాధారణ వ్యక్తి రూ.లక్ష మూలధనం పెట్టి, రూ.100తో కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఎకరాల కొలదీ భూమి కావాలని అడిగితే ప్రభుత్వం ఇస్తుందా? పొరపాటున కూడా ఇవ్వదు. కానీ అధికారపార్టీ ఎమ్మెల్యేకు చెందిన కంపెనీ కావడంతో ముందువెనుకా చూడకుండా 17.67 ఎకరాల్ని కేటాయించేసింది. పెట్టుబడెంతో,  ఏ స్థాయిలో కంపెనీ పెడతారో, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో, వాస్తవ పరిస్థితులేంటో అన్నది గుర్తించకుండా మనోడనే ఒకేఒక కారణంతో కారుచౌకగా భూముల్ని కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఎలాంటి కార్యకలాపాలు జరగని కంపెనీకి భూములు కేటాయించరాదన్న నిబంధనలున్నా పట్టించుకోలేదు. కొవ్వాడ అగ్రహారంలో ఎకరా భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.60 లక్షలనుంచి రూ.80 లక్షలు పలుకుతోంది. కానీ అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం కేవలం రూ.6 లక్షలకే కట్టబెట్టింది.
 
భూపందేరంతో బుజ్జగింపు..
పతివాడను బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా.. భూపందేరానికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నలిచ్చారు. ఈ నేపథ్యంలో 2014 అక్టోబర్ 9న ఇద్దరు వ్యక్తులతో ఎస్‌వీఎల్ లైఫ్ సైన్సు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని పతివాడ రిజిస్ట్రేషన్ చేయించారు. ఫార్మాస్యూటికల్స్, నాన్ కార్బన్ తయారీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీకి తన బంధువైన మీసాల సన్యాసినాయుడు, సన్నిహితుడు చంద్రశేఖర్ రాగిని డెరైక్టర్లుగా పెట్టుకున్నారు. రూ.లక్ష మూలధనంగా చూపించారు. వెంటనే పూసపాటిరేగ మండలం 16వ నంబర్ జాతీయ రహదారికి పక్కనేవున్న కొవ్వాడ అగ్రహారం గ్రామంలోని 17.67 ఎకరాల భూమిని తన ఫార్మా కంపెనీకోసం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement