బాబు గారి కుచ్చుటోపి!
♦ ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి అంటూ ఓట్లు దండుకున్న టీడీపీ
♦ రెండేళ్లయినా ఒక్కరంటే ఒక్కరికి కూడా భృతి చెల్లించని వైనం
♦ అలాంటి పథకమేదీ లేదని అసెంబ్లీ సాక్షిగా వెల్లడి
♦ జిల్లాలో మూడు లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
♦ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై మండిపడుతున్న నిరుద్యోగ యువత
‘అనుభవం ఉన్నోన్ని.. నా మాట నమ్మండి.. ఇంటికో ఉద్యోగం కల్పిస్తాం.. లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం..’ అని ఆశలు కల్పించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మమ్మల్ని నిలువునా ముంచాడు. తనేమో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ, అడుగడుగునా దుబారా చేస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతున్నాడు. ఇంత నిస్సిగ్గుగా మోసం చేస్తాడని అస్సలు ఊహించలేద’ంటూ నిరుద్యోగులు శివాలెత్తుతున్నారు.
సాక్షి, కడప : ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా..’ అంటూ 2014 ఎన్నికలప్పుడు ఊదరగొట్టి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకుని సీఎం పీఠం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇపుడు మాట మార్చారు. ఇంటికో ఉద్యోగం అటుంచి ఉన్న ఉద్యోగాలనూ ఊడగొడుతున్నారు. రూ.2వేల నిరుద్యోగ భృతి అడ్రస్ లేదు. అసలు అలాంటి పథకమే లేదంటూ తాజాగా అసెంబ్లీ సాక్షిగా సెలవివ్వడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగం రాకపోయినా ఫరవాలేదు.. నెలకు రూ.2 వేలు వస్తుందని ఆశించిన పలువురు నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది.
జిల్లాలోని 67,301 కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నిరుద్యోగులెవరూ భయపడవద్దు.. ఇంటింటికి ఉద్యోగం కల్పించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది.. ఉద్యోగం రాకపోతే ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున భృతి అందజేస్తుంది. దాంతో యువత ఖర్చులు కొంతమేర తగ్గిపోతాయి. స్వయం ఉపాధి ద్వారా వారికి రుణాలిచ్చి ఆర్థికంగా చేయూతనందిస్తాం’ అంటూ చెప్పేసరికి నిరుద్యోగులందరూ ఆ పార్టీకి ఓటు వేశారు. ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకారం రోజున కూడా పదేపదే నొక్కి వక్కాణించిన చంద్రబాబు.. ఇపుడు ఆ ఊసు ఎత్తడానికే ఇష్టపడటం లేదు.
బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ పోస్టులు మాత్రమే విడుదల చేయగా, ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏతోపాటు ఇతర డిగ్రీలు, టెక్నికల్ కోర్సులు చేసిన నిరుద్యోగులు.. భృతి ఇస్తారేమోనని ఇన్నాళ్లూ ఎదురు చూశారు. ఇపుడు అలాంటి పథకమేదీ లేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేయడంతో విస్తుపోయారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి, ప్రచారంలో పదేపదే ఇదే విషయాన్ని చెప్పి ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు.. ఇపుడిలా మోసం చేస్తారని ఊహించలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న ఉద్యోగానికి ‘పెద్ద’ పోటీ
జిల్లాలో బీటెక్, ఎంటెక్ లాంటి పెద్దపెద్ద చదువులు చదివిన వారు కూడా చిన్న చిన్న పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి సూపర్‌వైజర్, హె ల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిం చగా కేవలం 70 పోస్టులకు 16 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారూ దరఖాస్తు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్, క్లర్కులు, చివరకు సెక్యూరిటీ గార్డులు లాంటి పోస్టులకు కూడా ఉన్నత చదువులు చదివిన వారు పోటీ పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. నిరుద్యోగుల కోసం చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించక పోవడంపై యువత మండిపడుతోంది.
పెరిగిపోతున్న నిరుద్యోగం
ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ విషయన్నే పట్టించుకోవడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. మరో వైపు డిగ్రీ, పీజీలు చేసిన వారి సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. ఈ పరిస్థితిలో ఉద్యోగం అటుంచి నెలకు రూ.2 వేలు భృతి ఇచ్చినా చాలా మంది యువతకు కొంతైనా వెసలుబాటు ఉండేది. ప్రభుత్వం అందించే సొమ్ముతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉద్యోగ పరీక్షలకన్నా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉండేది. అటు భృతి చెల్లించకపోగా, ఇటు ఉద్యోగం కల్పించకపోవడంతో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలో సుమారు 2.80 లక్షల నుంచి 3 లక్షల మేర నిరుద్యోగులు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.