
చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు
లక్ష కోట్ల పెట్టుబడులు ఏమయ్యాయి?
విజయవాడ సెంట్రల్ : సీఎం చంద్రబాబు అబద్ధాలతో రోజులు గడుపుతున్నారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.సూరిబాబు విమర్శించారు. సోమవారం ఆంధ్రరత్నభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 331 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు, రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని 21 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు వస్తాయని బాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు.పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ఒప్పందాలు లేవని ఏపీ ఇండస్ట్రీస్ డైరెక్టర్ తెలిపారన్నారు. అంటే 331 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బాబు చెప్పినవన్నీ అబద్ధాలే అన్న విషయం స్పష్టమైందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏ పరిశ్రమను ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ప్రజాప్రతినిధులు ఎన్ని పరిశ్రమల ద్వారా ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నట్లు పదేపదే చెబుతున్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఎలా ఇరుక్కున్నారని ఎద్దేవా చేశారు.