'చిల్లర' చిక్కులు | 'Change' problems | Sakshi
Sakshi News home page

'చిల్లర' చిక్కులు

Published Thu, Nov 10 2016 5:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

'చిల్లర' చిక్కులు

'చిల్లర' చిక్కులు

* పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడికి తప్పని తిప్పలు
పాల ప్యాకెట్ల కొనుగోలుతో కష్టాలు మొదలు
ప్రభుత్వ సంస్థల్లోనూ రూ.500, రూ. 1000 నోట్ల తిరస్కరణ
భారీగా తగ్గిన ఆదాయం
బోసిపోయిన దుకాణాలు.. 
 
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో/సాక్షి, గుంటూరు : సామాన్యుడికి చిల్లర చిక్కులు బుధవారం ఉదయం నుంచే మొదలయ్యాయి. పాల ప్యాకెట్లు కొనడం, టీస్టాల్స్‌ వద్ద తేనీరు తాగడానికి రూ. 500 నోటు మార్చడానికి చేసిన తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. హోటళ్లు, కూరగాయల దుకాణాలు, పచారీ షాపులు, బార్బర్‌ షాపులు.. ఎక్కడా రూ. 500, రూ. 1000 నోట్లను అంగీకరించకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించింది. శుక్రవారం నుంచి బ్యాంకులు పెద్ద నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వడంతో కొంతలో కొంత ఊరట లభించనుంది.
 
హోల్‌సేల్‌ మార్కెట్లదీ ఇదే దారి
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హోల్‌సేల్‌ మార్కెట్లలోనూ పెద్ద నోట్ల రద్దు కష్టాలు స్పష్టంగా కనిపించాయి. అన్ని రకాల హోల్‌సేల్‌ మార్కెట్లలోని వ్యాపారులు రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. రూ. 100 నోట్లు ఉన్నవారు నిత్యావసరాల కొనుగోలు, అత్యవసర ఖర్చులకు మాత్రమే ఉంచుకోవడంతో వ్యాపారాల జోరు తగ్గిందని వ్యాపారులు చెప్పారు. హోల్‌సేల్‌ మార్కెట్లకు వచ్చిన వినియోగదారుల సంఖ్య సగానికి పైగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ప్రయాణం.. ప్రహసనం..
ప్రయాణం అందరికీ అత్యవసరం కిందే లెక్క. పెద్ద నోట్లను నమ్ముకుని ఆర్టీసీ బస్సులు ఎక్కినవారికి నిరాశే ఎదురైంది. ప్రజా రవాణా బస్సుల్లో పెద్ద నోట్లు చెల్లుబాటవుతాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోవడానికి కండక్టర్లు నిరాకరించారు. గట్టిగా ఒత్తిడి చేసినవారికి పెద్ద నోట్లను తీసుకుని టికెట్లు ఇచ్చారు. వారి వద్ద చిల్లర   లేకపోవడంతో ముగ్గురు నలుగురికి కలిపి రూ. 500 నోటు ఇచ్చి.. చిల్లర పంచుకోండన్నారు. ఆర్టీసీలో మంగళవారం రాత్రి వరకు వచ్చిన చిన్న నోట్లను అధికారులు దారిమళ్లించారు. బుధవారం ఉదయం తమకు చిల్లర అప్పగించి ఉంటే.. ప్రయాణంలో కష్టాలు తప్పేవని కొందరు కండక్టర్లు చెప్పారు.
 
రైల్వే కౌంటర్లలో ఘర్షణ
రైల్వే కౌంటర్లలో పెద్ద నోట్లు తీసుకోవడానికి సిబ్బంది సిద్ధపడినా.. ప్రయాణికులకు చిల్లర సమకూర్చడం సాధ్యం కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వం చెప్పినా పెద్ద నోట్లు ఎందుకు తీసుకోరంటూ విజయవాడ రైల్వే కౌంటర్లలో గొడవపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు కౌంటర్లలో ఇలాంటి సమస్యలే తలెత్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి.
 
వెలవెలపోయిన మాల్స్‌..
పెద్ద నోట్లు తీసుకోవడానికి పలు షాపింగ్‌ మాల్స్‌ ముందుకు వచ్చినా.. పెద్దగా వ్యాపారం సాగలేదు. డెబిట్, క్రెడిట్‌ కార్డుల మీద వ్యాపారం కూడా సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా జరిగిందని వ్యాపారులు చెప్పారు. కస్టమర్లు పెద్దగా రాకపోవడంతో జంటనగరాల్లో పలు మాల్స్‌ వెలవెలపోయాయి. సినిమా హాళ్లు కూడా బోసిపోయాయి.
 
వన్నె తగ్గిన బంగారం..
బంగారం ధర పెరగడం, పెద్ద నోట్ల రద్దు.. వెరసి బంగారు ఆభరణాల కొనుగోళ్లు బుధవారం మందగించాయి. బంగారం వర్తకంలో పన్నులు చెల్లించకుండా చేసే ‘జీరో’ బిజినెస్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచే బంగారం దుకాణాలను వ్యాపారులు మూసివేశారు.
 
ఎయిర్‌పోర్ట్‌లోనూ అదే తీరు..
గన్నవరం విమానాశ్రయంలో వాటర్‌ బాటిళ్లు, స్నాక్స్‌ విక్రయించే దుకాణదారులు పెద్ద నోట్లను అంగీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం (ఆన్‌బోర్డ్‌)లోనూ ప్రయాణికులకు స్నాక్స్‌ విక్రయిస్తారు. కానీ పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పదుల సంఖ్యలో టికెట్లు కొనడానికి బుధవారం ఉదయం పలువురు విమానాశ్రయం కౌంటర్లకు వచ్చారు. ఇద్దరికి  టికెట్లు విక్రయించిన తర్వాత పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించారు. ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలని సూచించారు.
 
పెట్రోల్‌ పంపుల్లోనూ చిల్లర ఇవ్వలేదు..
పెట్రోల్‌ పంపుల్లో పెద్ద నోట్లు అంగీకరించారు. కానీ రూ. 500 నోటు ఇస్తే ఆ మొత్తానికి ఇంధనం పోయించుకోవాలని సిబ్బంది తెగేసి చెప్పడం పలుచోట్ల కనిపించింది. కొన్ని చోట్ల కస్టమర్లు వాగ్వాదానికి దిగారు. ఇక టోల్‌గేట్ల వద్ద పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించడం, కొన్నిచోట్ల తీసుకున్నా.. చిల్లర సమకూర్చడంలో జాప్యం జరగడంతో కిలోమీటర్ల వేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొనే తాత్కాలికంగా టోల్‌ రుసుము వసూలును కేంద్రం రద్దు చేసింది. కాజ టోల్‌గేట్‌ వద్ద సాయంత్రం నుంచి వసూళ్లు నిలిపివేశారు. ఇదే అదనుగా భావించిన మద్యం దుకాణాల యజమానులు మందుబాబుల వ్యసనాన్ని ఆసరాగా తీసుకుని రూ. 500 నోటు ఇస్తే రూ. 350కు మాత్రమే మద్యం ఇస్తూ అడ్డంగా దోచుకున్నారు.
 
నీరసించిన రిజిస్ట్రేషన్లు..
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో  రోజూ సరాసరి 1200–1300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. బుధవారం దశమి కావడంతో మంచిరోజుగా భావించి సరాసరి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికార వర్గాలు భావించాయి. కానీ పెద్ద నోట్ల రద్దు కారణంగా 15 శాతానికి పడిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్, రవాణా, మున్సిపల్‌ శాఖ కార్యాలయాల్లో బిల్లులు, రిజిస్ట్రేషన్‌లు, పన్నులు చెల్లించేందుకు వెళ్లినవారి వద్ద పెద్ద నోట్లు తీసుకోలేదు. రవాణా శాఖలో  నాలుగో వంతు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రోజుకు రూ. 50 లక్షల పన్ను వసూళ్లవుతుంటాయి.  బుధవారం  రూ. 18.08 లక్షలు మాత్రమే వసూలైంది. గుంటూరు కార్పొరేషన్‌లో రోజుకు రూ. 12 లక్షలు వసూలయ్యే పన్ను  రూ. 27వేలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. రోజుకు రూ. 60 లక్షలు వసూలయ్యే విద్యుత్‌ బిల్లులు  రూ. 37 లక్షలకు పడిపోయాయి.
 
పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..
బస్‌స్టేçÙన్‌లు, రైల్వే స్టేషన్‌లు, బ్యాంకుల వద్ద చిల్లర లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం బ్యాంకులు పనిచేయనుండడంతో బ్యాంకర్లతో మాట్లాడి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించడం, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. టోకెన్‌ సిస్టమ్‌ ద్వారా‡ డిపాజిట్లు, చెల్లింపులు చేయించేలా చూడాలని గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement