చెక్కేసే వారికి చెక్..!
వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు వైవీయూలో అధ్యాపకులు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియని స్థితి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ విధానం జూలై 1 నుంచి వైవీయూలో కూడా ప్రవేశపెట్టారు. ఇందుకోసం విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాల వద్ద, హాస్టల్స్, మెస్, పరిపాలన భవనం తదితర ప్రాంతాల్లో 23 బయోమెట్రిక్ మిషన్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న విశ్వవిద్యాలయం తాజాగా బయోమెట్రిక్ విధానం రావడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.
అనుసంధానం ఇలా...
విశ్వవిద్యాలయంలో మొత్తం 23 బయోమెట్రిక్ అటెండెన్స్ మిషన్‌లను ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు మరోసారి వేలిముద్రను మిషన్‌లో వేయాల్సి ఉంటుంది. దీంతో వీరి రాకపోకల విషయాలు, సమయపాలనకు సంబంధించి కంట్రోల్‌రూంలో నిక్షిప్తమవుతాయి. జూలై 1న ప్రారంభమైన ఈ ప్రక్రియ మొదటి నెల కావడంతో నెల చివర్లో బయోమెట్రిక్ అటెండెన్స్ రికార్డు పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయేమో గుర్తించిన తర్వాత ఆగస్టు 1 నుంచి ఉన్నతవిద్య కార్యాలయంలో అనుసంధానం చేసేందుకు వైవీయూ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
విద్యార్థుల్లో గుబులు...
ఈ విధానం ద్వారా అధ్యాపకులు, సిబ్బంది సకాలంలో వస్తుండటంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగనుంది. అయితే పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థుల్లో మాత్రం ఎక్కడో మూల గుబులు మొదలైంది. అటెండెన్స్‌లో 75 శాతం తగ్గితే ఉపకార వేతనాలు పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో కళాశాలకు రెగ్యులర్‌గా రాని పక్షంలో ఇబ్బందులు తప్పవేమోనన్న గుబులు వారిలో మొదలైంది. పరిశోధక విద్యార్థులు సైతం పరిశోధనలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంటుంది. అ సమయంలో ఎలా చేయాలో అధికారులు స్పష్టం చేయకపోవడంతో ఈ భయం వారినీ వెంటాడుతోంది.
బాధ్యతగా భావిస్తాం
విశ్వవిద్యాలయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టడాన్ని అధ్యాపకులందరం స్వాగతిస్తున్నాం. స్టేట్ పాలసీలో భాగంగా చేపట్టిన ఈ విధానం వలన అధ్యాపకులు మరింత బాధ్యతగా పనిచేసే అవకాశం ఉంటుంది. తద్వారా పర్యవేక్షణ, పారదర్శకత మెరుగవుతుంది.– ఆచార్య కంకణాల గంగయ్య, వైవీయూ అధ్యాపక సంఘం అధ్యక్షుడు
సమయపాలన మెరుగుపడుతుంది
వైవీయూలో బయోమెట్రిక్ విధానం పెట్టడం మంచిదే. అయితే కొన్ని విభాగాల్లో బోధనేతర సిబ్బంది కళాశాల సమయవేళల్లోనే కాకుండా తర్వాత సమయంలో ఒక్కోసారి రాత్రి వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అదనంగా పనిచేసిన వారికి ఏదైనా వెసులుబాటు ఇస్తే బాగుంటుంది.– చెన్నారెడ్డి, వైవీయూ బోధనేతర సిబ్బంది సంఘం నాయకుడు
క్రమశిక్షణ పెరుగుతుంది
బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం పెట్టడం ద్వారా విద్యార్థులు కూడా క్రమశిక్షణతో కళాశాలకు రెగ్యులర్‌గా వస్తారు. అయితే రెండుపూటలా వేలిముద్ర వేయాలన్న నిబంధనలో విద్యార్థులకు మినహాయింపునివ్వాలి. హాజరు తక్కువై ఉపకార వేతనాలు నిలిచిపోయే ప్రమాదం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
– గంపా సుబ్బరాయుడు, విద్యార్థి సంఘం నాయకుడు, వైవీయూ
ఆగస్టు 1 నుంచి పక్కాగా అమలు
వైవీయూలో జూలై 1 నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టాం. అయితే మొదటి నెల కావడంతో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం. తొలినెల అవుట్‌పుట్ పరిశీలించిన తర్వాత ఉన్నతవిద్య అధికారులకు అందజేస్తాం. అందుకే తొలినెల ఆధార్ లింకేజి పెట్టలేదు. అయితే ఆగస్టు 1 నుంచి కచ్చితంగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో సహా అందరికీ ఆధార్ లింకేజితో పాటు నేరుగా ఉన్నత విద్య కార్యాలయానికి అనుసంధానం చేస్తాం. ఈ విధానం ద్వారా అందరిలో బాధ్యత మరింత పెరుగుతుందని భావిస్తున్నాం.
– ఆచార్య వై. నజీర్‌అహ్మద్, రిజిస్ట్రార్, వైవీయూ