PHD students
-
యూనివర్సిటీల్లో కేసీఆర్ ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేరు మీద ఫెలోషిప్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏ ఇతర ఆర్థికసాయం పొందని విద్యార్థులకు దీన్ని అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ‘కేసీఆర్ డాక్టోరల్ ఫెలోషిప్’ పేరుతో దీన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అన్ని యూనివర్సిటీలు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాయి. ఈ ఫెలోషిప్ అమలుకు ఏటా రూ. 5 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎంఫిల్ తర్వాత పీహెచ్డీ చేసేవారికి గతంలో ‘రాజీవ్ గాంధీ ఫెలోషిప్’ఇచ్చేవాళ్లు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి ఆయా సామాజికవర్గాల పీహెచ్డీ స్కాలర్స్ ఈ ఫెలోఫిప్‌లను అందుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల కొన్ని వర్గాల విద్యార్థులు ఏ విధమైన స్కాలర్‌షిప్‌లనూ పొందలేకపోతున్నారు. ఇలాంటివాళ్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేలమంది వరకూ ఉంటారు. గత కొన్నాళ్లుగా పీహెచ్‌డీకి కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చుకోవడం వారికి కష్టంగా మారింది. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పీహెచ్‌డీకి అవసరమైన రసాయనాలు, ప్రయోగ పరికరాలు, ఇతర గ్రంథాలరేట్లు విపరీతంగా పెరిగాయి. సొంత ఖర్చులతో వీటిని సమకూర్చుకోవడంలో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్కాలర్షిప్ అందిస్తే బాగుంటుందని యూనివర్సిటీలు ప్రతిపాదించాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్యరూపం దాల్చేవీలుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక తోడ్పాటు అవసరం రాష్ట్రంలో చాలామంది పీహెచ్డీ విద్యార్థులు ఏ రకమైన ఫెలోషిప్ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేసీఆర్ ఫెలోషిప్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇది అమలులోకి వస్తే కీలకమైన పీహెచ్‌డీల్లో మంచి పురోగతి ఉంటుంది. ఫెలోషిఫ్ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని మేం భావిస్తున్నాం. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాం. –ప్రొ.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ -
జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్
న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్).. డాక్టోరల్ స్టడీస్ చదివే దేశానికి చెందిన వారితోపాటు, ఇతర ఆసియా దేశాల విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పీహెచ్డీ చదివే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్: ► స్కాలర్షిప్ అందించే సమయం: రెండేళ్లు. ► పీహెచ్డీ విభాగాలు: ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, కంపెరేటివ్ స్టడీస్ ఇన్ రిలీజియన్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ–ఇన్విరాన్మెంట్. వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ చేసే అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తోంది. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఫుల్‌టైం పీహెచ్డీ స్కాలర్ అయి ఉండాలి. ► వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, తీన్‌మూర్తీ హౌస్, న్యూఢిల్లీ–110011 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: jnmf.in చదవండి: JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..! సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
చెక్కేసే వారికి చెక్..!
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు వైవీయూలో అధ్యాపకులు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియని స్థితి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ విధానం జూలై 1 నుంచి వైవీయూలో కూడా ప్రవేశపెట్టారు. ఇందుకోసం విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాల వద్ద, హాస్టల్స్, మెస్, పరిపాలన భవనం తదితర ప్రాంతాల్లో 23 బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న విశ్వవిద్యాలయం తాజాగా బయోమెట్రిక్ విధానం రావడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. అనుసంధానం ఇలా... విశ్వవిద్యాలయంలో మొత్తం 23 బయోమెట్రిక్ అటెండెన్స్ మిషన్లను ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు మరోసారి వేలిముద్రను మిషన్‌లో వేయాల్సి ఉంటుంది. దీంతో వీరి రాకపోకల విషయాలు, సమయపాలనకు సంబంధించి కంట్రోల్‌రూంలో నిక్షిప్తమవుతాయి. జూలై 1న ప్రారంభమైన ఈ ప్రక్రియ మొదటి నెల కావడంతో నెల చివర్లో బయోమెట్రిక్ అటెండెన్స్ రికార్డు పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయేమో గుర్తించిన తర్వాత ఆగస్టు 1 నుంచి ఉన్నతవిద్య కార్యాలయంలో అనుసంధానం చేసేందుకు వైవీయూ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విద్యార్థుల్లో గుబులు... ఈ విధానం ద్వారా అధ్యాపకులు, సిబ్బంది సకాలంలో వస్తుండటంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగనుంది. అయితే పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థుల్లో మాత్రం ఎక్కడో మూల గుబులు మొదలైంది. అటెండెన్స్‌లో 75 శాతం తగ్గితే ఉపకార వేతనాలు పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో కళాశాలకు రెగ్యులర్‌గా రాని పక్షంలో ఇబ్బందులు తప్పవేమోనన్న గుబులు వారిలో మొదలైంది. పరిశోధక విద్యార్థులు సైతం పరిశోధనలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంటుంది. అ సమయంలో ఎలా చేయాలో అధికారులు స్పష్టం చేయకపోవడంతో ఈ భయం వారినీ వెంటాడుతోంది. బాధ్యతగా భావిస్తాం విశ్వవిద్యాలయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టడాన్ని అధ్యాపకులందరం స్వాగతిస్తున్నాం. స్టేట్ పాలసీలో భాగంగా చేపట్టిన ఈ విధానం వలన అధ్యాపకులు మరింత బాధ్యతగా పనిచేసే అవకాశం ఉంటుంది. తద్వారా పర్యవేక్షణ, పారదర్శకత మెరుగవుతుంది.– ఆచార్య కంకణాల గంగయ్య, వైవీయూ అధ్యాపక సంఘం అధ్యక్షుడు సమయపాలన మెరుగుపడుతుంది వైవీయూలో బయోమెట్రిక్ విధానం పెట్టడం మంచిదే. అయితే కొన్ని విభాగాల్లో బోధనేతర సిబ్బంది కళాశాల సమయవేళల్లోనే కాకుండా తర్వాత సమయంలో ఒక్కోసారి రాత్రి వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అదనంగా పనిచేసిన వారికి ఏదైనా వెసులుబాటు ఇస్తే బాగుంటుంది.– చెన్నారెడ్డి, వైవీయూ బోధనేతర సిబ్బంది సంఘం నాయకుడు క్రమశిక్షణ పెరుగుతుంది బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం పెట్టడం ద్వారా విద్యార్థులు కూడా క్రమశిక్షణతో కళాశాలకు రెగ్యులర్‌గా వస్తారు. అయితే రెండుపూటలా వేలిముద్ర వేయాలన్న నిబంధనలో విద్యార్థులకు మినహాయింపునివ్వాలి. హాజరు తక్కువై ఉపకార వేతనాలు నిలిచిపోయే ప్రమాదం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. – గంపా సుబ్బరాయుడు, విద్యార్థి సంఘం నాయకుడు, వైవీయూ ఆగస్టు 1 నుంచి పక్కాగా అమలు వైవీయూలో జూలై 1 నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టాం. అయితే మొదటి నెల కావడంతో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం. తొలినెల అవుట్‌పుట్ పరిశీలించిన తర్వాత ఉన్నతవిద్య అధికారులకు అందజేస్తాం. అందుకే తొలినెల ఆధార్ లింకేజి పెట్టలేదు. అయితే ఆగస్టు 1 నుంచి కచ్చితంగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో సహా అందరికీ ఆధార్ లింకేజితో పాటు నేరుగా ఉన్నత విద్య కార్యాలయానికి అనుసంధానం చేస్తాం. ఈ విధానం ద్వారా అందరిలో బాధ్యత మరింత పెరుగుతుందని భావిస్తున్నాం. – ఆచార్య వై. నజీర్అహ్మద్, రిజిస్ట్రార్, వైవీయూ -
‘ఐటీ’కి వరాలు
రేపు ఐసీటీ పాలసీని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ ఐటీ కంపెనీలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ♦ రాష్ట్ర యువతకు ఉద్యోగాలిస్తే నియామక సాయం ♦ ఐటీలో పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక స్టైపెండ్ ♦ యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ రాయితీ ♦ వంద శాతం వరకూ రిజిస్ట్రేషన్ చార్జీలు రీయింబర్స్మెంట్ ♦ చిన్న కంపెనీలకు అద్దె రాయితీ, ప్రభుత్వ సబ్ కాంట్రాక్టులు ♦ బీపీవోలు నెలకొల్పితే పెట్టుబడి రాయితీ.. అభ్యర్థులకు శిక్షణ భృతి ♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ♦ పెట్టుబడి, రుణాలపై వడ్డీ, విద్యుత్ చార్జీలో రూ.1.50 చొప్పున మాఫీ ♦ ఐటీ రంగాన్ని రెండింతలకు విస్తరించే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీల జల్లు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆకర్షించేలా కొత్త ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీ’ని రూపొందించింది. ఐటీ పరిశ్రమను ఐదేళ్లలోనే రెండింతలకు విస్తరించాలని, ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఇందుకోసం ఐటీ కంపెనీలకు స్థలాలు, రిజిస్ట్రేషన్, పన్నులు, అద్దె, మూల ధనం, విద్యుత్ చార్జీల్లో రాయితీలు ఇవ్వడంతోపాటు, పెట్టుబడులకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందజేయనుంది. దీంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నియామక సాయం అందించాలని సరికొత్త నిర్ణయం కూడా తీసుకుంది. పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు పీహెచ్డీ విద్యార్థులకు స్టైఫెండ్ ఇవ్వనుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఐసీటీ పాలసీని ఆవిష్కరించనున్నారు. గవర్నర్ నరసింహన్, మంత్రి కె.తారకరామారావు, ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తితో పాటు ఐటీ రంగంలో పేరొందిన దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఆరు విభాగాలుగా.. ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఆరు విభాగాలుగా వర్గీకరించింది. మెగా కంపెనీలు, ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలు, ఇంజనీరింగ్ సేవలందించే కంపెనీలు, మధ్యతరహా-చిన్న-సూక్ష్మ కంపెనీలు, మహిళలు-ఎస్సీ-ఎస్టీ పారిశ్రామికవేత్తలు నెలకొల్పే కంపెనీలుగా గుర్తించనుంది. ఐటీ కంపెనీలన్నింటికీ వర్తించే రాయితీలతో పాటు ఒక్కో కేటగిరీకి మరింత ప్రోత్సాహకంగా ఉండేలా ప్రత్యేక రాయితీలను అందించనుంది. అన్ని కంపెనీలకు ప్యాకేజీ అర్హతలను బట్టి ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. కనీస ధర, అభివృద్ధి చార్జీలు తీసుకుని ఆ భూములను అప్పగిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో పేర్కొన్నట్లుగా విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తారు. మొదటి రిజిస్ట్రేషన్‌కు వంద శాతం, రెండో రిజిస్ట్రేషన్‌కు 50 శాతం స్టాంపు డ్యూటీ, బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజును రీయింబర్స్ చేస్తారు. ఈ రాయితీ మెగా ప్రాజెక్టులకు వర్తించదు. ఇండియన్ పేటెంట్, కాపీరైట్ ఫీజును గరిష్టంగా రూ.5 లక్షలకు మించకుండా, ఇంటర్నేషనల్ పేటెంట్లకు రూ.10 లక్షలకు మించకుండా రీయింబర్స్ చేస్తారు. సీఎంఎం (కెపాబులిటీ మెచ్యూరిటీ మోడల్) లెవెల్ ఫోర్కు మించిన కంపెనీలకు నాణ్యత ధ్రువీకరణ చెల్లింపుల్లో 20 శాతం, రూ.4 లక్షలకు మించకుండా రీయింబర్స్ చేస్తారు. మెగా కంపెనీలు మినహా ఐటీ కంపెనీలకు విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూపాయి చొప్పున రాయితీ ఇస్తారు. మెగా కంపెనీలకు పవర్ పెద్ద ఐటీ కంపెనీలు తమ స్వీయ అవసరాలకు సరిపడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం లెసైన్సు ఇస్తుంది. వంద కిలోవాట్లకు మించిన సౌర విద్యుత్ యూనిట్ నెలకొల్పేందుకు రూ.20 లక్షలు లేదా మూలధనంలో పది శాతం.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఏటా వంద మంది విద్యార్థులను తెలంగాణ కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే నియామక సాయం (రిక్రూట్మెంట్ అసిస్టెన్స్)ను అందిస్తుంది. ఒక్కో ఉద్యోగికి రూ.10 వేల చొప్పున చెల్లిస్తుంది. ఆర్ అండ్ డీ కంపెనీలకు ప్రత్యేకం ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’కు అయ్యే ఖర్చులో పది శాతాన్ని కంపెనీలకు గ్రాంట్‌గా చెల్లిస్తారు. లేదా తెలంగాణలో ఆ కంపెనీ వార్షిక టర్నోవర్‌లో రెండు శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది తక్కువైతే అంతమొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రతిభ ఆధారంగా టాప్‌లో ఉన్న 25 శాతం విద్యార్థులకు ప్రతి నెలా రూ.25 వేలు స్టైపెండ్‌గా రెండేళ్లపాటు చెల్లిస్తుంది. ఏటా 20 మంది విద్యార్థులను కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే రూ.20 వేల చొప్పున కంపెనీలకు నియామక సాయం అందిస్తుంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆఫర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించనుంది. మొట్టమొదట నెలకొల్పే ఐదు కంపెనీలకు మొదటి మూడేళ్ల పాటు మున్సిపల్ టాక్స్‌ను రీయింబర్స్ చేస్తుంది. ఏటా 50 మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటే రూ.20 వేల చొప్పున నియామక సాయం అందిస్తుంది. బీపీవోలు నెలకొల్పితే 50 శాతం లేదా గరిష్టంగా రూ.20 లక్షలకు మించి పెట్టుబడి రాయితీని అంది స్తుంది. అభ్యర్థులకు శిక్షణ భృతిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో అభ్యర్థికి ప్రతి నెలా రూ. 2,500 చొప్పున మూడు నెలలు అందిస్తుంది. ఇంజనీరింగ్ కంపెనీలకు నోటిఫైడ్ ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శన స్టాల్ అద్దెలో 50 శాతం లేదా రూ.50 వేలు ప్రభుత్వం భరిస్తుంది. చిన్న కంపెనీలకు ఊతం చిన్న, మధ్యతరహా, సూక్ష్మ కంపెనీలకు సైతం ఎగ్జిబిషన్ స్టాల్లో అద్దె రాయితీ వర్తిస్తుంది. ఏటా కనీసం వంద మంది ఐటీ నిపుణులను కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే రూ.20 వేల చొప్పున నియామక సాయం చెల్లిస్తుంది. రూ.5 లక్షల వరకు వార్షిక లీజు, అద్దెలో 25 శాతం సబ్సిడీని అందిస్తుంది. రూ.10 కోట్లకు మించిన ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టులుంటే అందులో 20 శాతం చిన్న, సూక్ష్మ కంపెనీలకు సబ్ కాంట్రాక్టుపై అప్పగిస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకం మహిళలు, ఎస్సీ, ఎస్టీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొత్త విధానంలో ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం కల్పించనుంది. రూ.5 లక్షలలోపు టర్మ్, పెట్టుబడి రుణాల్లో మహిళలకు 5 శాతం వడ్డీ రాయితీ, ఎస్సీ-ఎస్టీలకు 8.5 శాతం వడ్డీ రాయితీని ఐదేళ్లపాటు అమలు చేస్తుంది. విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూ.1.50 చొప్పున రీయింబర్స్ చేయనుంది. మహిళలకు మూలధనంలో 25 శాతం, రూ.20 లక్షలకు మించకుండా, ఎస్సీ-ఎస్టీలకు రూ.25 లక్షలకు మించకుండా సబ్సిడీ అందిస్తుంది. ఎగ్జిబిషన్ స్టాల్ అద్దెలో మహిళలకు 75 శాతం, ఎస్సీ-ఎస్టీలకు వంద శాతం రూ.50 వేలకు మించకుండా రీయింబర్స్ చేస్తుంది. ఏడాదికి 50 మంది ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున నియామక సాయం అందిస్తుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌లో శిక్షణ పొందిన వారికి వీటిలో ప్రాధాన్యమిస్తారు.