‘ఐటీ’కి వరాలు
రేపు ఐసీటీ పాలసీని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
♦ ఐటీ కంపెనీలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు
♦ రాష్ట్ర యువతకు ఉద్యోగాలిస్తే నియామక సాయం
♦ ఐటీలో పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రత్యేక స్టైపెండ్
♦ యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ రాయితీ
♦ వంద శాతం వరకూ రిజిస్ట్రేషన్ చార్జీలు రీయింబర్స్‌మెంట్
♦ చిన్న కంపెనీలకు అద్దె రాయితీ, ప్రభుత్వ సబ్ కాంట్రాక్టులు
♦ బీపీవోలు నెలకొల్పితే పెట్టుబడి రాయితీ.. అభ్యర్థులకు శిక్షణ భృతి
♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
♦ పెట్టుబడి, రుణాలపై వడ్డీ, విద్యుత్ చార్జీలో రూ.1.50 చొప్పున మాఫీ
♦ ఐటీ రంగాన్ని రెండింతలకు విస్తరించే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీల జల్లు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆకర్షించేలా కొత్త ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీ’ని రూపొందించింది. ఐటీ పరిశ్రమను ఐదేళ్లలోనే రెండింతలకు విస్తరించాలని, ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఇందుకోసం ఐటీ కంపెనీలకు స్థలాలు, రిజిస్ట్రేషన్, పన్నులు, అద్దె, మూల ధనం, విద్యుత్ చార్జీల్లో రాయితీలు ఇవ్వడంతోపాటు, పెట్టుబడులకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందజేయనుంది.
దీంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నియామక సాయం అందించాలని సరికొత్త నిర్ణయం కూడా తీసుకుంది. పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు పీహెచ్‌డీ విద్యార్థులకు స్టైఫెండ్ ఇవ్వనుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఐసీటీ పాలసీని ఆవిష్కరించనున్నారు. గవర్నర్ నరసింహన్, మంత్రి కె.తారకరామారావు, ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తితో పాటు ఐటీ రంగంలో పేరొందిన దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు.
ఆరు విభాగాలుగా..
ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఆరు విభాగాలుగా వర్గీకరించింది. మెగా కంపెనీలు, ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలు, ఇంజనీరింగ్ సేవలందించే కంపెనీలు, మధ్యతరహా-చిన్న-సూక్ష్మ కంపెనీలు, మహిళలు-ఎస్సీ-ఎస్టీ పారిశ్రామికవేత్తలు నెలకొల్పే కంపెనీలుగా గుర్తించనుంది. ఐటీ కంపెనీలన్నింటికీ వర్తించే రాయితీలతో పాటు ఒక్కో కేటగిరీకి మరింత ప్రోత్సాహకంగా ఉండేలా ప్రత్యేక రాయితీలను అందించనుంది.
అన్ని కంపెనీలకు ప్యాకేజీ
అర్హతలను బట్టి ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. కనీస ధర, అభివృద్ధి చార్జీలు తీసుకుని ఆ భూములను అప్పగిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో పేర్కొన్నట్లుగా విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తారు. మొదటి రిజిస్ట్రేషన్‌కు వంద శాతం, రెండో రిజిస్ట్రేషన్‌కు 50 శాతం స్టాంపు డ్యూటీ, బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజును రీయింబర్స్ చేస్తారు. ఈ రాయితీ మెగా ప్రాజెక్టులకు వర్తించదు. ఇండియన్ పేటెంట్, కాపీరైట్ ఫీజును గరిష్టంగా రూ.5 లక్షలకు మించకుండా, ఇంటర్నేషనల్ పేటెంట్లకు రూ.10 లక్షలకు మించకుండా రీయింబర్స్ చేస్తారు. సీఎంఎం (కెపాబులిటీ మెచ్యూరిటీ మోడల్) లెవెల్ ఫోర్‌కు మించిన కంపెనీలకు నాణ్యత ధ్రువీకరణ చెల్లింపుల్లో 20 శాతం, రూ.4 లక్షలకు మించకుండా రీయింబర్స్ చేస్తారు. మెగా కంపెనీలు మినహా ఐటీ కంపెనీలకు విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూపాయి చొప్పున రాయితీ ఇస్తారు.
మెగా కంపెనీలకు పవర్
పెద్ద ఐటీ కంపెనీలు తమ స్వీయ అవసరాలకు సరిపడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం లెసైన్సు ఇస్తుంది. వంద కిలోవాట్లకు మించిన సౌర విద్యుత్ యూనిట్ నెలకొల్పేందుకు రూ.20 లక్షలు లేదా మూలధనంలో పది శాతం.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఏటా వంద మంది విద్యార్థులను తెలంగాణ కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే నియామక సాయం (రిక్రూట్‌మెంట్ అసిస్టెన్స్)ను అందిస్తుంది. ఒక్కో ఉద్యోగికి రూ.10 వేల చొప్పున చెల్లిస్తుంది.
ఆర్ అండ్ డీ కంపెనీలకు ప్రత్యేకం
‘రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’కు అయ్యే ఖర్చులో పది శాతాన్ని కంపెనీలకు గ్రాంట్‌గా చెల్లిస్తారు. లేదా తెలంగాణలో ఆ కంపెనీ వార్షిక టర్నోవర్‌లో రెండు శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది తక్కువైతే అంతమొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రతిభ ఆధారంగా టాప్‌లో ఉన్న 25 శాతం విద్యార్థులకు ప్రతి నెలా రూ.25 వేలు స్టైపెండ్‌గా రెండేళ్లపాటు చెల్లిస్తుంది. ఏటా 20 మంది విద్యార్థులను కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే రూ.20 వేల చొప్పున కంపెనీలకు నియామక సాయం అందిస్తుంది.
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆఫర్
హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించనుంది. మొట్టమొదట నెలకొల్పే ఐదు కంపెనీలకు మొదటి మూడేళ్ల పాటు మున్సిపల్ టాక్స్‌ను రీయింబర్స్ చేస్తుంది. ఏటా 50 మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటే రూ.20 వేల చొప్పున నియామక సాయం అందిస్తుంది. బీపీవోలు నెలకొల్పితే 50 శాతం లేదా గరిష్టంగా రూ.20 లక్షలకు మించి పెట్టుబడి రాయితీని అంది స్తుంది. అభ్యర్థులకు శిక్షణ భృతిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో అభ్యర్థికి ప్రతి నెలా రూ. 2,500 చొప్పున మూడు నెలలు అందిస్తుంది. ఇంజనీరింగ్ కంపెనీలకు నోటిఫైడ్ ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శన స్టాల్ అద్దెలో 50 శాతం లేదా రూ.50 వేలు ప్రభుత్వం భరిస్తుంది.
చిన్న కంపెనీలకు ఊతం
చిన్న, మధ్యతరహా, సూక్ష్మ కంపెనీలకు సైతం ఎగ్జిబిషన్ స్టాల్‌లో అద్దె రాయితీ వర్తిస్తుంది. ఏటా కనీసం వంద మంది ఐటీ నిపుణులను కాలేజీల నుంచి రిక్రూట్ చేసుకుంటే రూ.20 వేల చొప్పున నియామక సాయం చెల్లిస్తుంది. రూ.5 లక్షల వరకు వార్షిక లీజు, అద్దెలో 25 శాతం సబ్సిడీని అందిస్తుంది. రూ.10 కోట్లకు మించిన ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టులుంటే అందులో 20 శాతం చిన్న, సూక్ష్మ కంపెనీలకు సబ్ కాంట్రాక్టుపై అప్పగిస్తారు.
మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకం
మహిళలు, ఎస్సీ, ఎస్టీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొత్త విధానంలో ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం కల్పించనుంది. రూ.5 లక్షలలోపు టర్మ్, పెట్టుబడి రుణాల్లో మహిళలకు 5 శాతం వడ్డీ రాయితీ, ఎస్సీ-ఎస్టీలకు 8.5 శాతం వడ్డీ రాయితీని ఐదేళ్లపాటు అమలు చేస్తుంది. విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూ.1.50 చొప్పున రీయింబర్స్ చేయనుంది. మహిళలకు మూలధనంలో 25 శాతం, రూ.20 లక్షలకు మించకుండా, ఎస్సీ-ఎస్టీలకు రూ.25 లక్షలకు మించకుండా సబ్సిడీ అందిస్తుంది. ఎగ్జిబిషన్ స్టాల్ అద్దెలో మహిళలకు 75 శాతం, ఎస్సీ-ఎస్టీలకు వంద శాతం రూ.50 వేలకు మించకుండా రీయింబర్స్ చేస్తుంది. ఏడాదికి 50 మంది ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున నియామక సాయం అందిస్తుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌లో శిక్షణ పొందిన వారికి వీటిలో ప్రాధాన్యమిస్తారు.