కాలకూట విషం
- పటాన్‌చెరులో పారుతున్న వ్యర్థ, రసాయనాలు
- భూగర్భ జలాలు సైతం విషపూరితం
- ఆందోళన చెందుతున్న ప్రజలు
పటాన్‌చెరు టౌన్: పట్టణంలో వివిధ రసాయాన కాలుష్య వ్యర్థ జలాలు ఏరులై పారుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం కాలుష్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. భూగర్భ జలాలు సైతం విషపూరితం అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అతిపెద్ద పారిశ్రామిక వాడగా దేశంలో పేరు గడించిన పటాన్‌చెరులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు స్థిరపడ్డారు. మహారాష్ట్ర బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎంతో మంది వివిధ పరిశ్రమల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరందరిని కాలుష్యం కబళిస్తుంది.
ఎవ్రికీ తెలియకుండా చాపకిందనీరులా కాలుష్యం జనాల శరీరాల్లోకి వెళ్లిపోతోంది. పట్టణంలోని ఆల్విన్‌కాలనీకి వెళ్లే రహదారి, ఫాదర్ స్కూల్ సమీపంలో కాలుష్యజాలాలు ఏరులై పారుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ ప్రాంతంలో ఉండే పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యర్థ, రసాయన జలాలను వెనకనే ఉన్న పెద్దకాలువలోకి నిత్యం వదిలేస్తున్నారు. ఆ జలాలు తాగునీటిలో కలసి కలుషితం చేస్తున్నాయి.
ఫాదర్‌స్కూల్‌సమీపంలో ఒక వాటర్ ట్యాంక్, పెద్ద సంపు ఉన్నాయి. ఈ ట్యాంకు నుంచి వివిధ ప్రాంతాలను నిత్యం తాగునీరు అందుతోంది. అయితే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థజలాలు ఈ ట్యాంకు సంపులో కలుస్తుండటం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యర్థ జలాలు వర్షపునీటితో కలసి సంపులోకి వెళుతున్నా సంబంధిత అధికారులు కానీ, స్థానిక పాలకులు కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కేవలం పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మకై ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రసాయ జలాలు వచ్చే కాలువను జేసీబీతో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పూడిక కూడా తీయించారు. దీంతో పరిశ్రమల వ్యర్థ జలాలు మరింత ఎక్కువగా మంచినీటి సంపులో కలిసేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో ఈ ట్యాంక్‌నుంచి సరఫరా అయ్యే మంచినీరు కలుషితమయంగా వస్తుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమల రసాయన జలాలు కలిసిన ఈ మంచినీరు తాగడం వల్ల వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ నీటి వల్ల తాతాలికంగా కాకపోయిన దీర్ఘకాలిక వ్యాధులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భూగర్భ జలాలలు సైతం ఈ రసాయనాల వల్ల విషతుల్యం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
గతంలో ఈ విషయం ఎన్నోసార్లు అధికారులకు, పాలకులకు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి కాలుష్య జలాలు మంచినీటి సంపులో కలవకుండా చూడాలని కోరుతున్నారు. ప్రధానంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలను కాలుకూట విష జలాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.
పటాన్‌చెరు, రసాయన జలాలు, ప్రజల ఆందోళన
పరిశ్రమల నుంచి కాలువల్లోకి వస్తున్న రసాయన జలాలు