శివార్లలో వ్యర్థాల డంపింగ్‌.. | Hyderabad Factories Dump Chemical And Solid Waste At City Outskirts | Sakshi
Sakshi News home page

శివార్లలో వ్యర్థాల డంపింగ్‌..

Published Mon, Jun 21 2021 8:30 AM | Last Updated on Mon, Jun 21 2021 10:19 AM

Hyderabad Factories Dump Chemical And Solid Waste At City Outskirts - Sakshi

దుండిగల్‌: నింగి, నేలా, నీరు.. అన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. మానవ మనుగడకు జీవనాధారమైన వీటిని విషతుల్యంగా కొందరు మారుస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల, దూలపల్లి, అటు సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే గడ్డపోతారం పారిశ్రామికవాడల్లో వందలాది రసాయన పరిశ్రమల నుంచి నిత్యం వెలువడే ఘన, ద్రవ వ్యర్థాలను నగర శివారు ప్రాంతాల్లో డంపింగ్‌ చేస్తున్నారు. ఓ వైపు పీసీబీ టాస్క్‌ ఫోర్స్‌ ఉన్నా లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో.. డంపింగ్‌ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. 

  • చెట్టు పూట్టా అనే తేడా లేకుండా ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు డంప్‌ చేసేస్తున్నారు. 
  • చివరకు చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. 
  • ఇప్పటికే నగర శివారులోని కుంటలు, చెరువుల్లో శిఖం భూముల్లో నిత్యం రసాయనాల డంపింగ్‌ నిరాటంకంగా  కొనసాగుతోంది. 
  • దీంతో స్థానికులు చర్మ, శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. 

అర్ధరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా.. 
పరిశ్రమల్లో ఉత్పత్తుల సమయంలో వెలువడే రసాయన, ఘన వ్యర్థాలు జేఈటీఎల్‌కు తరలించాల్సి ఉండగా అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో పరిశ్రమల యాజమాన్యాలు డంపింగ్‌ మాఫియాలను ఆశ్రయిస్తున్నాయి. దీంతో వివిధ పరిశ్రమల నుండి సేకరించే వ్యర్థాలను రాత్రిపూట టీడీసీఎం, ట్రాక్టర్లలో తరలించి నగర శివారులోని ప్రభుత్వ భూములు, కుంటలు, అటవీ స్థలాల్లో పారబోస్తున్నారు.  

ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి.. 
దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని డీపోచంపల్లి, సారెగూడెం, దుండిగల్‌ తండా–1, 2 ప్రాంతాల వాసులు ఎక్కువగా ఈ రసాయనాల డంపింగ్‌లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రైందంటే చాలు ఘాటైన వాసనలతో ఈ ప్రాంత వాసులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై ఈ రసాయనాలు తీవ్ర దుష్ప్రభావాన్ని  చూపుతున్నాయి. ఈ అక్రమ డంపింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

కానరాని పీసీబీ టాస్క్‌ ఫోర్స్‌.. 
రసాయన పరిశ్రమలపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఏర్పాటు చేసిన పీసీబీ టాస్క్‌ ఫోర్స్‌ దాదాపు పనిచేయడం లేదనే చెప్పవచ్చు. ఏదైనా ప్రాంతంలో రసాయనాలు డంప్‌ చేశారని ఫిర్యాదు వచ్చిన సమయంలోనే అధికారులు హడావుడి చేసి సంబంధిత శాంపిళ్లను తీసుకు వెళ్తున్నారేÆ తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమపై చర్యలు తీసుకున్న దాఖాలు లేవు.  

అనువైన ప్రాంతం..  
మున్సిపాలిటీ పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు మల్లంపేట నుంచి దుండిగల్‌ వరకు విస్తరించి ఉంది. దీనికి తోడు ఇక్కడ వేల ఎకరాల ప్రభుత్వ స్థలం, నిర్మానుష్య ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. దీంతో కెమికల్‌ మాఫియా ఇదే అనువైన ప్రాంతంగా భావించి గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం ప్రాంతాల నుంచి రాత్రికి రాత్రే భారీ ఎత్తున రసాయనాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. 

మచ్చుకు కొన్ని.. 

  • 2021 జూన్‌ 7న గాగిల్లాపూర్‌ తండాకి వెళ్లే దారిలో ఓ పరిశ్రమ మెడికల్‌ వేస్టేజీని డంప్‌ చేసింది.  
  • జూన్‌ 9, 11 తేదీల్లో దుండిగల్‌ నుంచి గాగిల్లాపూర్‌ తండాకు వెళ్లేదారిలో ఉన్న గుర్జకుంటలో భారీ ఎత్తున రసాయనాలను డంప్‌ చేశారు.  
  • ఇదే నెలలో దుండిగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఎంఎల్‌ఆర్‌ఐటీకి వెళ్లే దారిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాల వద్ద సుమారు 100కు పైగా డ్రమ్ముల్లో రసాయనాలను డంపింగ్‌ చేశారు. 

పీసీబీ బాధ్యత వహించాలి.. 
తండాల సమీపంలోని చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో భారీ ఎత్తున ఘన, ద్రవ రసాయన వ్యర్థాలను డంప్‌ చేస్తున్నా పీసీబీ అధికారులు స్పందించడం లేదు. పత్రికల్లో కథనాలు ప్రచురితమైన సమయాల్లోనే వచ్చి హడావుడి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి ప్రజలు అనారోగ్యం పాలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి.– శివనాయక్, బీజేఎం మున్సిపల్‌ ప్రెసిడెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement