- విచారణ చేపట్టిన భద్రాచలం పోలీసులు
తెలంగాణా ఆస్పత్రిలో ఆంధ్రా శిశువు మాయం
Published Tue, Oct 25 2016 9:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
నెల్లిపాక :
తెలంగాణ రాష్ట్ర పరిధిలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఆంధ్రా శిశువు మంగళవారం మాయమైంది. ఎటపాక మండలం గోళ్లగట్ట (భద్రాచలం సమీపంలో)కు చెందిన సోయం శాంతమ్మ 20 రోజుల మగ శిశువుతో తన పెద్దమ్మ కల్లూరి భద్రమ్మను తీసుకుని మంగళవారం ఉదయం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. íజ్వరంగా ఉన్న పిల్లాడిని పిల్లల వార్డులో చేర్పించేందుకు వెళ్లగా కాన్పుకు సంబంధించిన కాగితాలు తీసుకురావాలని అక్కడున్న నర్సులు వారికి సూచించారు. ఇంట్లో మర్చిపోయిన కాగితాలు తెమ్మని భద్రాచలంలోని ఓ షాపులో పనిచేస్తున్న తన కొడుక్కి చెప్పేందుకు భద్రమ్మ బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తల్లి శాంతమ్మ చేతిలో బిడ్డ కనబడలేదు. బిడ్డ ఏదని అడిగితే ఎవరో ఒకామె తీసుకున్నదని సమాధానం చెప్పింది. దీంతో అమె కంగారుపడి ఆసుపత్రి అంతా వెతికినా లాభం లేకపోయింది. శాంతమ్మకు ఇదే మొదటి కానుపు. ఇదే ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. విషయం తెలుసుకున్న ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ప్రసూతి వార్డును సందర్శించి అక్కడున్న మాయమైన శిశువు తల్లి, అమ్మమ్మలను విషయం అడిగి తెలుసుకున్నారు. ఆయనిచ్చిన సమాచారం మేరకు భద్రాచలం పట్టణ ఎస్‌సై కరుణాకర్ ఆస్పత్రికొచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు. కాగా ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు.
Advertisement