నేడే చిత్తూరు మేయర్ ఎన్నిక
⇒మేయర్ స్థానానికి కటారి హేమలత నామినేషన్
⇒కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన టీడీపీ
⇒పరోక్ష పద్ధతిలో మేయర్ ఎంపిక
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ స్థానానికి శనివారం ఎన్నిక జరగనుంది. దివంగత మేయర్ అనురాధ చనిపోయినప్పటి నుంచి మేయర్ స్థానం ఖాళీగా ఉంది. ఇన్‌చార్జ్ మేయర్‌గా సుబ్రమణ్యం కొనసాగుతున్నారు. దీంతో అనురాధ కోడలు కటారి హేమలత పేరును మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు కటారి హేమలతను మేయర్‌గా ఎన్నుకోవాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమక్షంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక, మేయర్‌గా హేమలత ఎన్నిక లాంఛనీయమే!
కోర్టు తీర్పుతో...
చిత్తూరు నగర తొలి మహిళా మేయర్ అఅయిన కటారి అనురాధ 2015 నవంబరు 17న తన భర్త మోహన్‌తో పాటు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డెప్యూటీ మేయర్‌గా ఉన్న సుబ్రమణ్యం ఇన్‌చార్జ్ మేయర్‌గా కొనసాగుతున్నారు. అయితే బీసీ–మహిళకు రిజర్వు చేసిన మేయర్ సీటులో పురుషుడు పాలన సాగించడంపై పలువురు కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏప్రిల్ 15లోపు బీసీ–మహిళను మేయర్‌గా ఎన్నుకోవా లని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా అనురాధ కుటుంబానికే మేయర్ పదవిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కటారి హేమలత 33వ డివిజన్ కార్పొరేటర్‌గా నామినేషన్ దాఖలు చేశా రు. మామూలుగా ఎవరైనా ప్రజాప్రతి నిధి చనిపోతే ఆ స్థానంలో వారి కుటుంబసభ్యులు బరిలో నిలిస్తే పోటీకి నిలపరాదనే నియమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాటించింది. అభ్యర్థిని బరిలో దింపకుండా ఏకగ్రీవం అయ్యేలా హుందాగా వ్యవహరించింది. దీంతో హేమలత గంగనపల్లె నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ స్థానానికి బీసీ–మహిళా విభాగం నుంచి పోటీ చేస్తున్నట్లు హేమలత నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందచేశారు.
కోరం తప్పనిసరి..
మేయర్‌ను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవా ల్సి ఉంది. చిత్తూరు నగరంలోని 50 మంది కార్పొరేటర్లలో టీడీపీకి 34 మం ది ఉన్నారు. మేయర్ ఎన్నికలో పార్టీ కార్పొరేటర్లంతా హాజరు కావాలని, హేమలతను మేయర్‌ను ఎన్నుకోవాలని టీడీపీ విప్ జారీ చేసింది. 26 మంది కార్పొరేటర్లు తప్పనిసరిగా హాజరైతేనే కోరం ఏర్పడుతుంది. లేకపోతే మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. మరుసటి రోజూ కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే కార్పొరేటర్లందరికీ మేయర్ ఎన్నిక కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కాగా ఈ ఎన్నిక మొత్తం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమక్షంలో కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. మేయర్ ఎన్నిక కార్యక్రమంపై కమిషనర్ బాలసుబ్రమణ్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.