జలకళను సంతరించుకున్న ఉస్మాన్ సాగర్
మణికొండ: కురుస్తున్న వర్షాలకు నగర ప్రజల దాహార్తిని తీర్చే జంట జలాశయాల్లో నీటి మట్టం పేరుగుతోంది. మొన్నటి దాకా నెర్రలు చాచిన ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ ఇప్పుడు కాస్త జలకళను సంతరించుకున్నాయి. పరివాహక మండలాలైన శంకర్‌పల్లి, మొయినాబాద్, మోమిన్ పేట్, నవాబ్‌పేట్, వికారాబాద్ తదితర మండలాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రోజూ వరద వస్తోంది.
ఇటీవల చెరువు శివార్లలో మట్టిని తొలగించి పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో అవి నిండేందుకే ఎక్కువగా నీరు పడుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. గండిపేటలో కిందకు ఉన్న నీటిని సరఫరా చేసే నిమిత్తం గతంలో ఏర్పాటు చేసిన మోటార్ల వద్దకు నీరు వచ్చే అవకాశం ఏర్పడటంతో బుధవారం రాత్రి వాటిని తొలగించారు.
కింద ఉన్న పైప్‌లైన్ ను మూసివేసే పనులను గురువారం చేపట్టారు. ప్రస్తుతమున్న నీటితో మోటార్లు లేకుండా సరఫరా చేయవచ్చని చెప్పారు. మరో వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో చెరువుల్లోకి భారీగా నీరు చేరే అవకాశం ఉందన్నారు. గురువారం సాయంత్రం ఉస్మాన్ సాగర్‌లో 1769.50 అడుగుల నీరు ఉండగా, రాత్రి వరకు 1770 అడుగులకు పెరిగే అవకాశం ఉందన్నారు. హిమాయత్‌సాగర్‌లో నీటి మట్టం సాయంత్రానికి 1,735 అడుగులకు చేరుకుంది.