అనంత సర్వజనాస్పత్రికి మహర్దశ!
– బోధనాస్పత్రికి సీటీ స్కాన్ యంత్రం
– నెలాఖరులోగా అందుబాటులోకి సేవలు
– మరో నాలుగు నెలల్లో ఎంఆర్‌ఐ
– ‘సీటీ స్కాన్’ వెతలపై ‘సాక్షి’ వరుస కథనాలు
(సాక్షి ఎఫెక్ట్)
అనంతపురం మెడికల్ : స్థానిక సర్వజనాస్పత్రికి ఎట్టకేలకు సీటీ స్కాన్ రాకతో ఏడాదిన్నర నిరీక్షణకు తెరపడింది. ఇదే సమయంలో ఎంఆర్‌ఐ కూడా వస్తుండడంతో పేద ప్రజలకు ఆర్థిక భారం తప్పనుంది. వివరాల్లోకి వెళితే.. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజనాస్పత్రిలో 2002లో సీటీ స్కాన్ యంత్రాన్ని ఇన్‌స్టాల్ చేశారు. ఇది మరమ్మతులకు గురి కావడంతో ఏడాదిన్నరగా సేవలు నిలిచిపోయాయి. మరమ్మతుకు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని సదరు కంపెనీ తెలిపింది. మరమ్మతుల తర్వాత పరికరం ఎంత కాలం పని చేస్తుందో తెలియదు. దీంతో కొత్త యంత్రాన్ని సమకూర్చాలని ఇక్కడి అధికారులతోపాటు కలెక్టర్ కూడా ప్రతిపాదించారు.
ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు లేఖ రాశారు. గతంలోనే ఇక్కడకు సీటీ స్కాన్ మంజూరైనా రాజకీయ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలించారు. గత ఏడాది మే 18న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ‘ఆస్పత్రి నిద్ర’ చేసిన సమయంలో సీటీ స్కాన్‌లేక రోగుల కష్టాలను తెలుసుకున్నారు. మూడు నెలల్లోగా పరికరాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా వీలైనంత త్వరలో యంత్రాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ వీరి హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రోగుల అవస్థలు, సీటీ స్కాన్ యంత్రం ఆవశ్యకత, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. గత ఏడాది మే 2 న ‘వాళ్లకు పట్టదు..వీళ్లకు తప్పదు’.. అక్టోబర్ 13న ‘మూడు..మారిందా’ శీర్షికలతో సమస్య తీవ్రతను తెలియజేసింది. దీనిపై అధికారులు స్పందించారు.
పీపీపీ పద్ధతిలో సీటీ స్కాన్ :
ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో సీటీ స్కాన్ యంత్రాన్ని సమకూర్చారు. ఎస్‌ఎల్ డయాగ్నస్టిక్స్ టెండర్‌ను దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఎంఓయూ కూడా ముగిసింది. ఇందులో భాగంగా శనివారం ఆస్పత్రిలో ఉన్న పాత సీటీ స్కాన్ యంత్రాన్ని కండెమ్షన్ చేశారు. నెలాఖరులోగా పరికరాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. కాగా ఆస్పత్రికి ఎంఆర్‌ఐ కూడా రానున్నట్లు ఆయన చెప్పారు. డీఎంఈ స్థాయిలో బిడ్డింగ్ కూడా అయిపోయిందని, మరో నాలుగు నెలల్లో ఆస్పత్రికి సమకూరుతుందన్నారు.
తప్పనున్న ఆర్థిక భారం :
సీటీ స్కానింగ్ యంత్రం అందుబాటులోకి రానుండడంతో పేద రోగులకు ఆర్థికభారం తగ్గనుంది. యంత్రం పని చేసే సమయంలో రోజుకు సుమారు పది వరకు స్కానింగ్‌లు చేసేవారు. తలకు గాయం, కడుపు, ఛాతీ, పక్షవాతం ఉన్న వాళ్లకు ఈ యంత్రంతో స్కానింగ్ చేస్తారు. ప్రస్తుతం యంత్రం అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరు రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది.