చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
తిరుచానూరు : చెప్పేదొకటి... చేసేదొక్కటి అన్న చందంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర కార్యదర్శి పి.నీలకంఠమనాయుడు విమర్శించారు. తిరుపతిలోని ఆపస్ కార్యాలయంలో గురువారం ఆ సంఘం ముఖ్యప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని నమ్మబలికి, తీరా అధికారంలోకి వచ్చిన రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు.
ప్రజాప్రతినిధుల జీతాలను లక్షల్లో పెంచుకున్న ప్రభుత్వానికి ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.బాలాజీ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల జీతాలు లక్షల్లో పెంచుకున్నప్పుడు అడ్డురాని ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల విషయంలో మాత్రం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యోగులకు మేలు చేయకుంటే భవిష్యత్తులో ఉద్యోగుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఏప్రిల్ 5న తిరుపతిలో జరిగే ఆపస్ జిల్లా మహాసభల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆపస్ జిల్లా నాయకులు మునిరత్నం, వెంకటేశ్వర్లు, మధుసూదన్, నాగరాజు, శివశంకర్, సుభాష్‌చంద్రదాస్, సురేష్, విజయశంకర్ పాల్గొన్నారు.