అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాలు ఊడిపోతాయ్
అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాలు ఊడిపోతాయ్
Published Sun, Jul 16 2017 12:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అధికారులకు కలెక్టర్ భాస్కర్ హెచ్చరిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)
జిల్లాలో భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు సొమ్ముల చెల్లింపులో అధికారులు అక్రమాలకు పాల్పడితే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతి, జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో శనివారం సమీక్షించారు. లబ్ధిదారులకు సొమ్ముల చెల్లింపులో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అధ్వానంగా ఉన్న ఏలూరుగుండుగొలను, కొవ్వూరు రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సేకరించిన భూముల్లో తిరిగి పంటలు వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోణంగిపుంత పనుల్లో మిగిలిన నాలుగు డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పొగొండ, తమ్మిలేరు, చింతలపూడి ఫీల్డ్ చానల్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ పీ.కోటేశ్వరరావు, జేసీ2 ఎంహెచ్ షరీఫ్, డీఆర్‌ఓ కే.హైమావతి, నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఆర్‌డీఓలు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు
201617 ఆర్థిక సంవత్సరానికి రూ.3.45 కోట్లతో చేపట్టిన దొంగరావిపాలెం, వలంధరరేవు, పెదమల్లం ప్రాంతాల్లో కాటేజీలు, రెస్టారెంట్లు, తదితర పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పర్యాటక అధికారులను కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. 201718 ఆర్థిక సంవత్సరానికి పర్యాటక స్థలాల అభివృద్ధికి జిల్లాలో రూ.67 కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. వోఅండ్‌ఎంకు టెండర్లు పిలిచి ఖరారు చేయాలని ప్రాంతీయ సంచాలకులు, పర్యాటక శాఖ భీమాశంకర్‌ను ఆదేశించారు. కొరుటూరులో కాటేజీలకు సంబంధించి 15 రోజుల్లో టెండర్లు ఖరారు చేసి పనులను ప్రారంభించాలని జిల్లా అటవీ శాఖ టెరిటోరియల్ నాగేశ్వరరావును ఆదేశించారు. æరూ.19 కోట్లతో పేరుపాలెం బీచ్ వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను గడువు నాటికి పూర్తి చేయాలన్నారు. కొరుటూరు, కొల్లేరు ప్రాంతాల్లో ఉడెన్ కాటేజీ నిర్మాణాల నమూనాలను రమేష్‌సింగ్ కె.ఉడెన్ ఓ కంపెనీవారు కలెక్టరుకు వివరించారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. డీఎఫ్‌ఓ టెరిటోరియల్ నాగేశ్వరరావు, పర్యాటక శాఖ ఈఈ శ్రీనివాస్, డీఈ పద్మారావు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు
యువతీ యువకులకు వివిధ రంగాల్లో స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ భాస్కర్ వెల్లడించారు. ఏలూరు వట్లూరులోని టీటీడీసీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత కలెక్టర్ భాస్కర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌లు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెఫ్మా పీడీ ఎన్.ప్రకాశరావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement