సతతం.. హరితం! చేద్దాం విజయవంతం
♦ 3.40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
♦ 8 నుంచి 22 వరకు ‘హరితహారం’
♦ ప్రతి వెయ్యి మొక్కల సంరక్షణకు ఓ అధికారి
♦ కలెక్టర్ రోనాల్డ్ రోస్ వెల్లడి
సంగారెడ్డి జోన్: ‘మెతుకుసీమను హరితసీమగా మార్చేద్దాం.. అందరం భాగస్వాములమవుదాం.. పక్షం రోజులూ ‘హరితహారాన్ని’ నిర్విఘ్నంగా కొనసాగిద్దాం..’అని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3.40 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు జిల్లా యంత్రాంగమంతా హరితహారం కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. రిజర్వు ఫారెస్టుల్లో 40 లక్షల మొక్కలు, అటవీ బయటి ప్రాంతంలో 3 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వీటికి కావాల్సిన మొక్కలు నర్సరీల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు, ఔత్సాహికులు కోరుకున్న మొక్కలను పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు.
ప్రతి శాఖకు కూడా లక్ష్యాన్ని నిర్దేశించామని, ఆ మేరకు అధికారులకు అవగాహన కల్పించామన్నారు. 8వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, 9న రాజీవ్ రహదారి, 11న పరిశ్రమలు, 12న పాఠశాలలు, కళాశాలలు, 13న మిషన్ కాకతీయలోని 1,624 చెరువుల్లో, 14న ఇళ్ల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 15న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16న వాగులు, వంకలు, కాల్వల గట్ల పైన, 17న ప్రభుత్వ భూముల్లో, 18న మున్సిపల్ పరిధుల్లో, 20న పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక కేంద్రాల కార్యాలయాల పరిసరాల్లో, 21న జాతీయ రహదారి వెంట, 22న పంచాయతీ రాజ్ రోడ్లల్లో మొక్కలు నాటుతామన్నారు.
నోడల్ అధికారిగా ఎంపీడీఓలు
హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. వీటితో పాటు హరిత సంరక్షణ కమిటీలు భాగస్వామ్యులవుతాయన్నారు. ప్రతి వెయ్యి మొక్కలను సంరక్షించడానికి ఒక స్పెషల్ అధికారికి బాధ్యతలను అప్పగిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలోనూ బాలల హరితహారం కింద ప్రతి విద్యార్థికి 5 మొక్కలను పంపిణీ చేసి, వాటిని సంరక్షించి పుట్టిన రోజు నిర్వహించేలా సీజీఆర్ స్వచ్ఛంద సంస్థతో ప్రయత్నిస్తున్నామన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే..
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం వల్లే విజయం సాధిస్తాయన్నారు. రానున్న పక్షం రోజులు మంత్రులు మొదలుకొని సర్పంచ్‌ల వరకు అందరు ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల పరిధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ హరితహారాన్ని విజయవంతం చేయడంలో తమవంతు పాత్రను పోషిస్తారన్నారు. ప్రతి గ్రామంలోను 40 వేల మొక్కలకు తగ్గకుండా పెంచడం వల్ల పర్యావరణాన్ని కాపాడుతుందన్నారు. ఆయా గ్రామాలను ప్రోత్సహించడానికి ఉచితంగా కొబ్బరి మొక్కల పంపిణీతో పాటు లక్ష రూపాయాల ఇన్సెంటివ్‌ను ఇస్తామన్నారు.
పరిశ్రమల్లో 10 లక్షల మొక్కలు నాటుతాం...
వాయు, జల కాలుష్యాలకు ప్రధాన కారణమవుతున్న పరిశ్రమల పరిధిలో 10 లక్షల మొక్కలను నాటుతున్నామన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున మొక్కలను ఉచితంగా అందించినప్పటికీ ఆయా పరిశ్రమల యాజమాన్యాలే మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు.