రూ.కోటికి టోపీ | colour stones issue | Sakshi
Sakshi News home page

రూ.కోటికి టోపీ

Published Thu, Sep 22 2016 11:48 PM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

colour stones issue

  • రంగురాళ్లలో ‘త్రీస్టార్‌’
  • తపస్సికొండను తవ్వేశారు
  • ఆ కొండ తవ్వకానికి ఓ పోలీసు అధికారి భరోసా
  • రూ.10 లక్షల డీల్‌
  • మధ్యవర్తిగా టీడీపీ సానుభూతి పరుడైన ఓ ఉపాధ్యాయుడు
  •  
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    మన్యంలో సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై లక్షలు ముడుపులు మెక్కి మిన్నకుండిపోతున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో అడ్డతీగల మండలం దుప్పిలపాలెం సమీపాన తపస్సు కొండ రిజర్వ్‌ ఫారెస్టులో రంగురాళ్ల క్వారీలో మూడుపువ్వులు ఆరుకాయలుగా తవ్వకాలు పూర్తిచేశారు. ఈ రంగురాళ్ల క్వారీని ఎప్పుడో మూసేశారు. అటువంటి క్వారీ తవ్వకానికి ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అనుమతి ఇచ్చారు.  పది రోజులపాటు రంగురాళ్లు తవ్వుకునేందుకు రోజుకు లక్ష వంతున రూ.10 లక్షలకు రంగురాళ్ల వ్యాపారులకు, పోలీసు అధికారికి మధ్య ‘డీల్‌’ కుదిరింది. ఆ అధికారి ఇచ్చిన అనుమతితో ఎనిమిది మంది రంగురాళ్ల వ్యాపారులు గిరిజనులను వినియోగించుకుని ఆ పది రోజులు     
    మస్తుగా కొండను తవ్వేశారు. ఆ 10 రోజుల్లో సుమారు రూ.కోటి విలువైన వ్యాపారం చేశారని అంచనా.
    ఆ పోలీసు అధికారిపై విచారణ జరిగినా... ఈ రంగురాళ్ల క్వారీలో  కొండలు కూలిపోయి పలు సందర్భాల్లో గిరిజనులు దుర్మరణంపాలైన ఘటనలున్నాయి. ఆ కారణంగానే ఆ క్వారీని మూసేశారు. అటువంటి క్వారీకి దొడ్డిదారిన తవ్వుకునేందుకు అనుమతించి లక్షలు వెనకేసుకున్నారని ఇన్‌స్పెక్టర్‌పై గతంలో పలు ఫిర్యాదులు ఏలూరు రేంజ్‌ డీఐజీ దృష్టికి వెళ్లడం విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఆ విచారణను కొనసాగనివ్వకుండా మేనేజ్‌ చేసుకోగలిగారు. ఇప్పుడు మరోసారి అదే పంధాలో రంగురాళ్ల వ్యాపారానికి తెరతీశారని గిరిజనం కోడై కూస్తోంది. ఆ పోలీసు అధికారి, రంగురాళ్ల వ్యాపారులకు మధ్యవర్తిగా అడ్డతీగల మండలంలో టీడీపీ సానుభూతిపరుడైన ఉపాధ్యాయుడు వ్యవహరించడం ఇక్కడ విశేషం. రిమ్మలపాలెం సహా పలు గ్రామాల్లో సుమారు 16 మంది రంగురాళ్ల వ్యాపారులున్నారు. వారిలో ఎనిమిది మందికి మాత్రమే ఆ ఇన్‌స్పెక్టర్‌ అనుమతించగా గుట్టుచప్పుడుకాకుండా తపస్సుకొండ క్వారీలో రంగురాళ్లను తవ్వేసుకున్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోలీసు అధికారి విచారించేందుకు సన్నద్ధమవగా కేసులొద్దని లక్షలు మూటగట్టుకున్న అధికారి ఒత్తిడి తెచ్చి మోకాలడ్డారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం తెలిసింది.
    దొంగలు దొరికినా తర్జన భర్జనలే...
    అయినప్పటికీ ఇటీవల దుశ్చర్తి గ్రామానికి చెందిన పలువురిని అడ్డతీగల ఎస్‌ఐ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసులు పెట్టాలా? వద్దా అనే విషయంలో పోలీసులు తర్జనభర్జనలుపడ్డారు. పై అ«ధికారితో అన్నీ మాట్లాడానని ఉపాధ్యాయుడు చెప్పడంతో తాము రంగురాళ్లు తవ్వామని దుశ్చర్తికి చెందిన వారు విచారణలో వివరించారని పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారం లో 11 మందిని నిందితులుగా గుర్తించి వారిలో ఏడుగుర్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ 11 మందిలో ఇన్‌స్పెక్టర్, వ్యాపారులకు మధ్య డీల్‌ కుదిర్చిన ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడని సమాచారం. అనుమతించిన వ్యాపారాలతో లింకులున్న మరో ముగ్గురు నిందితులను కేసు నుంచి తప్పించేందుకు పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేస్తే ఉద్యోగంపోతుందని సం బంధిత ఇన్‌స్పెక్టర్‌ అధికార పార్టీ నేతల తో ఒత్తిడి తెచ్చి కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అందుకే విచారణలో గుర్తిం చిన 11మందిపైనా కేసులు పెట్టి అరెస్టులు చేసేందుకు తటపటాయిస్తున్నారు.
    వాస్తవమే...
    ఈ విషయమై అడ్డతీగల ఎస్సై తూపాటి రామకృష్ణను గురువారం సంప్రదించగా తపస్సుకొండ రంగురాళ్లు క్వారీలో తవ్వకాల వ్యవహారంలో ఏడుగురిపై కేసు నమోదుచేసిన మాట వాస్తవమేనన్నారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయుడు విషయమై ప్రశ్నించగా ఆ విషయం కూడా విచారిస్తున్నామన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement