కమిషనరేట్.. కరీంనగర్
కమిషనరేట్.. కరీంనగర్
Published Wed, Sep 21 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లాను పోలీస్ కమిషనరేట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాకు భారీగా ఉన్నతాధికారులు రావడంతోపాటు భద్రత పెరగనుంది. నేరాల నియంత్రణలో పోలీసులు పట్టుసాధించే అవకాశముంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాను జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ మూడు జిల్లాలుగా విభజిస్తున్న క్రమంలో కరీంనగర్‌ను మాత్రమే కమిషనరేట్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
పలు మార్పులు
కమిషనరేట్ ఏర్పాటు చేయడానికి కనీసం 10 లక్షల జనాభా ఉండాలనే నిబంధన ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ప్రస్తుతం జిల్లాలో 38,11,738 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలో కరీంనగర్ జిల్లాలో 13,13,061మంది జనాభా ఉండగా.. 3456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. కరీంనగర్‌లో రెండు రెవెన్యూ డివిజన్లతోపాటు కొత్తగా ఏర్పడుతున్న మూడు మండలాలు కలుపుకుని 20 మండలాలున్నాయి. దీని పరిధిలో రెండు డీఎస్పీ పోస్టులు, 13 సీఐ, 27 ఎస్సై పోస్టులున్నాయి. ఇవికాకుండా ఎస్‌బీ, డీసీఆర్‌బీ, పీసీఆర్, డీపీటీసీ, హెడ్‌క్వార్టర్‌లకు సంబంధించి పలు పోస్టులుంటాయి. నిబంధనల ప్రకారం ప్రతి 50వేల మందికి ఒక పోలీస్‌స్టేషన్ ఉండాలి. ప్రతివేయి మందికి ఒక పోలీస్ ఉండాలి. ప్రస్తుతం 4వేల మందికి ఒక పోలీస్ కూడా లేడు. కొత్తగా ఏర్పడుతున్న మూడు జిల్లాలకు అన్ని పోలీస్ విభాగాల్లో కలిపి సుమారు 4,300 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో డిస్ట్రిక్ గార్డ్స్, అర్ముడ్ బలగాలుపోను సుమారు 2400 మంది సివిల్ సిబ్బంది ఉంటారు. వీరిలో సెలవుల్లో 400 మంది ఉంటారు. వీఐపీ పర్యటనలుంటే సిబ్బంది వారి బందోబస్తుకు సరిపోతారు. ఠాణాల్లో ఒకరు లేదా ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. కమిషనరేట్‌గా మారితే సిబ్బంది సంఖ్య భారీగా పెరగనుంది.
కమిషనరేట్‌గా ఏర్పడితే...
కమిషరేట్‌గా ఏర్పడితే చాలామంది ఉన్నతాధికారులు జిల్లాకు రానున్నారు. కమిషరేట్‌కు ఒక్కో డీఐజీ ఉంటారు. కమిషనర్‌తో కలుపుకుని జిల్లాకు ఇద్దరు ఎస్పీలుంటారు. వీరితోపాటు శాంతిభద్రతల కోసం డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ), ఎస్‌బీకి ఏసీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ, ఆపరేషన్స్ విభాగానికి అడిషనల్ కమిషనర్, అడ్మినిస్ట్రేషన్‌కు డీసీపీ, ట్రాఫిక్‌కు అడిషనల్ కమిషనర్, క్రైం విభాగానికి అడిషనల్ కమిషనర్, ఆర్ముడ్ విభాగానికి అడిషనల్ కమిషనర్.. ఇలా సుమారు 10 మంది ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పాలన ఉంటుంది. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఏసీపీ (ప్రస్తుతం డీఎస్పీ)లు, ప్రతి ఠాణాకు సీఐ స్థాయి అధికారి ఎస్‌హెచ్‌వోగా ఉంటారు. కమిషరేట్ పరిధిలో ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నాలుగు సీసీఎస్ ఉండే అవకాశముంది. సీఐడీ, సీబీసీఐడీ విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. వాటికి నాలుగు నుంచి ఐదుగురు ఐపీఎస్ స్థాయి అధికారులను నియమిస్తారు. జనాభా ప్రతిపాదికగా కొత్తగా పలు ఠాణాలు ఏర్పాటవుతాయి. సిబ్బంది భారీగా పెరగడంతోపాటు ఆధునిక పరికరాలు, వాహనాలు అందుబాటులోకి వస్తాయి. డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల సంఖ్య భారీగా పెరగడం, కిందిస్థాయి అధికారులపై ప్రత్యేక నిఘా ఉండడంతో ఎప్పటికప్పుడు వారి పనితీరు సమీక్షించడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో ప్రజలకు మెరుగైన సేవలందడమే కాకుండా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశముంది.
గతంలోనే ప్రతిపాదనలు..
2014 జూలైలోనే వరంగల్ కమిషరేట్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, పెద్దపల్లిలోని కొంతభాగం, ధర్మపురిలోని కొంతభాగం కలిపి గోదావరిఖని, కరీంనగర్ కమిషనరేట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పచ్చజెండా ఊపింది. జనాభా, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, భవనాలు, కమిషనరేట్‌కు ఉండాల్సిన ప్రాథమిక సౌకర్యాలు తదితర అంశాలతో పోలీస్ అధికారులు నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. అయితే అనుహస్యంగా వరంగల్ కమిషనరేట్‌ను మాత్రమే ప్రకటించారు. అప్పటినుంచి ప్రభుత్వం కరీంనగర్‌ను కమిషనరేట్‌గా చేయడానికి కావాల్సిన అవకాశాలు పరిశీలిస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో నిజామాబాద్, కరీంనగర్‌ను కమిషనరేట్లు అప్‌గ్రేడ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Advertisement
Advertisement