బద్వేలు టీడీపీలో ముసలం
►బద్వేలు,గోపవరం జడ్పీటీసీల రాజీనామా
►మాజీ ఎమ్యెల్యే విజయమ్మపై తిరుగుబాటు
►సయోధ్యకు రంగంలోకి దిగిన జిల్లా అధ్యక్షుడు వాసు
►ఫలించని ఎమ్యెల్యే జయరాములు చర్చలు
►తారా స్థాయికి చేరిన వర్గ విభేదాలు
సాక్షిప్రతినిధి/సాక్షి, కడప : బద్వేలు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. ఎమ్యెల్యే జయరాములు, మాజీ ఎమ్యెల్యే విజయమ్మల మధ్య కొంతకాలంగా రగులుతున్న అంతర్గత విభేదాలు ఆదివారం భగ్గుమన్నాయి.విజయమ్మ మీద ఇద్దరు జెడ్పీటీసీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గోపవరం, బద్వేలు జడ్పీటీసీలు రాజీనామా చేసి.. లేఖలను సీఎంతో పాటు మంత్రి లోకేష్‌లకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి రంగంలోకి దిగినా జెడ్పీటీసీలు మెత్తబడలేదు. ఇద్దరు జెడ్పీటీసీలను జయరాములు బుజ్జగించేందుకు ప్రయత్నించినా చర్చలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో వ్యవహారం కాస్త ముదిరి పాకాన పడటం..దేశంలో దుమారం రేగిన నేపథ్యంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు నేరుగా రంగంలోకి దిగబోతున్నారు.
ప్రచ్ఛన్నయుద్ధం
బద్వేలు ‘దేశం’లో నియోజకవర్గ నేతల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయికి చేరింది. ఆది నుంచి బద్వేలు సెగ్మెంట్‌లో తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలున్నా ప్రస్తుతం ముదిరి పాకాన పడ్డాయి. గతంలో బద్వేలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలోకి వస్తున్న సమయంలోనూ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు నచ్చజెప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. బద్వేలులో రెండు వర్గాలుగా చీలిపోయిన తెలుగు తమ్ముళ్లు ప్రతి విషయంలోనూ ఏదో ఒక సమస్య నేపథ్యంలో గొడవపడి పార్టీ పరువును రచ్చకీడుస్తున్నారు.
ఇటీవల జరిగిన బద్వేలు నియోజకవర్గ సయన్వయ కమిటీ సమావేశంలోనూ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. అప్పట్లో ఇరువర్గాల నేతలకు పార్టీ పరిశీలకులు నచ్చచెప్పారు. మొదటి నుంచి కూడా మార్కెట్‌యార్డు విషయం మొదలుకొని పార్టీ పదవుల వరకు ఇలా ప్రతి విషయంలోనూ రెండు వర్గాల మధ్య అంతర్గతంగా యుద్ధ వాతావరణం కొనసాగుతూ వస్తోంది. ఎమ్మెల్యే జయరాములు తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తూ ఇతరులను పట్టించుకోవడం లేదని పార్టీలో ప్రత్యర్థి వర్గం విమర్శిస్తోంది.
ఇద్దరు జెడ్పీటీసీల రాజీనామా
బద్వేలు జెడ్పీటీసీ బీరం శిరీష, గోపవరం జెడ్పీటీసీ రమణయ్యలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నా వీరి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని....వర్గ విభేదాల నేపథ్యంలో పనులు జరగనపుడు ఎందుకు పదవిలో కొనసాగాలని ఇరువురు రాజీనామా చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు ఖరాఖండిగా చెబుతున్నారు. ఎమ్మెల్యే జయరాములు రాజీనామాల వ్యవహారంతోపాటు ప్రత్యర్థి వర్గంపై అధిష్ఠాన వర్గానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికారంలో ఉన్నా...అనధికారం...
తన తండ్రి బీరం జయరామిరెడ్డి రూ. 12 లక్షలకు సంబంధించి పనులు చేస్తే....బిల్లులు కాకుండా మరోవర్గం నేత అడ్డుకుంటోందని...మరికొన్ని పనులకు సంబం«ధించి అగ్రిమెంటు చేయకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని శిరీష మండిపడ్డారు. అధికార పార్టీలో ఉన్న జెడ్పీటీసీలకు సంబంధించిన పనులే జరగకపోతే పదవులు ఎందుకని ఆమె ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గోపవరం జెడ్పీటీసీ రమణయ్య కూడా మండలంలో అధికారులు విలువ ఇవ్వడం లేదని...చివరకు నాలుగు రోజుల కిందట జరిగిన కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు తనను పిలువలేదని.. తను వెళ్లి అడిగితే జాబితా ఇంతకుముందే పంపించామని చెప్పడం బాధకలిగించాయని పేర్కొంటున్నారు. కేవలం ఒక పింఛన్, ఒక రేషన్‌కార్డు ఇప్పించుకోలేని స్థితిలో ఉన్న నాకు పదవి అవసరం లేదని రాజీనామా చేసినట్లు రమణయ్య పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అండతోనే అధికారులు విలువ ఇవ్వకుండా ఇలా చేస్తున్నారని పరోక్షంగా ఆయన విమర్శించారు.